అధికార పార్టీ అట్రాసిటీ!

ABN , First Publish Date - 2022-05-15T07:53:37+05:30 IST

వందల ఏళ్ల నుంచి సమాజంలో వివక్షకు గురవుతున్న దళిత, గిరిజనుల చేతిలోని సామాజిక ‘ఆయుధం’.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం. సైగలు, చూపులు, మాటలు ఏవీ వీరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. మాన ప్రాణాలు తీసేసే కుల దౌష్ట్య దాడుల సందర్భంలో రాజ్యాంగ సంస్థలు వీరికి అండగా నిలవాలి.

అధికార పార్టీ అట్రాసిటీ!

టీడీపీ నాయకులే అధికంగా టార్గెట్‌

ఏపీలో రాజకీయకత్తిగా మారిన వైనం

దళితుల రక్షణకు చేసిన చట్టం దుర్వినియోగం

నిస్సహాయ దళితులకు కొండంత అండగా

నిలిచే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం

రాష్ట్రంలో రాజకీయ కక్షకు వాడుతున్న వైనం

సమస్యలపై ప్రశ్నించినా, నిలదీసినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

రాజధానిలో దళితులపైనా ఆ కేసులు

ఎస్సీకి న్యాయం కోరినా ‘అనంత’లో బుక్‌

బాధితులు ఎస్సీలు కాకున్నా అదే చట్టం

అసలైన బాధితులకు మాత్రం అన్యాయమే

కేసు పెట్టించడానికీ రోడ్లెక్కాల్సిన పరిస్థితి


అ.. అంటే అట్రాసిటీ

దళిత, గిరిజనుల రక్షణ కోసం చేసిన పకడ్బందీ చట్టాన్ని ప్రభుత్వ యంత్రాంగమే దుర్వినియోగం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిని రాజకీయ కక్షలకు వాడుతోందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో చిన్న అవకాశం దొరికితే చాలు... విపక్ష నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెట్టేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు.. ఇంకా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారిని సమస్యల పరిష్కారం కోసం కలిసినా, ప్రశ్నించినా, నిలదీసినా ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ పరిస్థితిపై దళిత సంఘాలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.


రేపల్లె ఎస్సీ అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఒంగోలులో హోంమంత్రి తానేటి వనితను అడ్డుకున్నారు. పోలీసు మంత్రి హోదాలో ఆమె బాధ్యతను గుర్తుచేయడానికే అలా అడ్డుకున్నారు. కానీ, పోలీసులు మాత్రం.. వనిత సామాజికవర్గం మాత్రమే చూసి..  అడ్డుకున్న టీడీపీ మహిళా నాయకులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం నమోదుచేశారు.


కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, లింగాల మండలం పెద్దకొడాలిలో మేకలను మేపేందుకు వెళ్లిన ఎస్సీ బాధితురాలిపై గ్యాంగ్‌ రేప్‌ జరిగితే.. టీడీపీ నేతలు ఆమె కుటుంబానికి న్యాయం కోరారు. బాధ్యులైనవారిపై అట్రాసిటీ కేసులు పెట్టాలని 2020 డిసెంబరులో పులివెందుల డీఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే.. బాధ్యులను వదిలేసి, వారిని శిక్షించాలన్న టీడీపీ నేతలపై పోలీసులు అట్రాసిటీ కేసులు పెట్టారు.



(ఆంధ్రజ్యోతి-న్యూస్‌ నెట్‌వర్క్‌)

వందల ఏళ్ల నుంచి సమాజంలో వివక్షకు గురవుతున్న దళిత, గిరిజనుల చేతిలోని సామాజిక ‘ఆయుధం’.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం. సైగలు, చూపులు, మాటలు ఏవీ వీరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. మాన ప్రాణాలు తీసేసే కుల దౌష్ట్య దాడుల సందర్భంలో రాజ్యాంగ సంస్థలు వీరికి అండగా నిలవాలి. బాధ్యులైనవారితో నాన్‌బెయిలబుల్‌ నిబంధనలు సహా చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తూ.. బాధితులకు న్యాయం అందించడంతోపాటు ఆర్థిక ఆసరానూ అందించాలి. స్థూలంగా ఇదీ ఈ చట్టం లక్ష్యం. దేశమంతా ఈ చట్టం పదునుగానే పని చేస్తోంది. పేట్రేగే అమానుష కుల దౌర్జన్యాలు, దారుణమైన వివక్షలను అడ్డుకుని సామాజిక న్యాయం చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి పెడుతూనే ఉంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జగన్‌ ప్రభుత్వం దీన్నొక రాజకీయ కత్తిగా మార్చివేసింది. కరుడుగట్టిన సమాజాలపై ఎక్కుపెట్టాల్సిన చట్టం ఇది. కానీ, టీడీపీ నాయకులే టార్గెట్‌గా పోలీసులు కేసులు పెట్టేస్తున్నారు. కేసు పెడితే బెయిల్‌ రాదు.. ఎక్కువకాలం జైలులోనే ఉంచేయొచ్చుననే దుర్బుద్ధితో అట్రాసిటీ చట్టాన్ని ఎడాపెడా దుర్వినియోగం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అండగా ఎక్కడ టీడీపీ నేతలు ఆందోళనకు దిగినా అట్రాసిటీ కేసుల్లో బుక్‌ చేయడం ఒక ట్రెండ్‌గా మారింది.


ఉదాహరణకు రేపల్లె రైల్వేస్టేషన్‌లో భర్త, బిడ్డలతో కలిసి నిద్రిస్తున్న ఎస్సీ మహిళపై కొందరు గ్యాంగ్‌రేప్‌ జరిపారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఈనెల రెండోతేదీన ఒంగోలు వచ్చిన హోంమంత్రి తానేటి వనితను టీడీపీ మహిళా విభాగం అడ్డుకుంది. చిత్రంగా వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మొత్తం 16మందిపై కేసు పెట్టి... గంటల వ్యవధిలోనే వారిలో ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రాత్రంతా స్టేషన్‌లో నిర్బంధించారు. చివరకు కోర్టు జోక్యం చేసుకుని మొత్తం 12మందికి స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేసింది. అనంతపురంలో బాధ్యులపై అట్రాసిటీ కేసు పెట్టాలని ఉద్యమించిన దేశం నాయకులపైనే ఆ చట్టాన్ని పోలీసులు ప్రయోగించారు. కొన్ని చోట్ల బాధితులు దళితులు, గిరిజనులు కాకపోయినా పోలీసులు విచిత్రంగా అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారు. సమస్యలపై బయటకువచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయంగా ఉద్యమించే టీడీపీ నాయకులను ప్రధానంగా ఎర చేస్తున్నారు. కేసులతో వారిని బెదిరించి అదరగొట్టాలని చూస్తున్నారు. 


  • గట్లనుంచి గుట్టల దాకా ఒకటే భాష..
  • కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి రిజర్వు ఫారె్‌స్టలో అక్రమంగా మైనింగ్‌ చేస్తున్న ప్రదేశానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెళ్లారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి తిరిగి వెళ్తుండగా అధికార పార్టీ నేతలు... ఆయన కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి పోలీసులు ఉమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగించారు. తనకు ఉమా ‘కులం’ పేరిట దూషించారంటూ ఈ దాడిలో పాల్గొన్న వైసీపీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది జూలైలో కేసు నమోదుచేశారు. కానీ, వీడియోలు చూస్తే వాగ్వాదానికి తావే లేకుండా కారులో ఉన్న ఉమాపై ఏకపక్షంగా దాడి జరిగినట్టు తెలుస్తూనే ఉంది. 

  • అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనను కులం పేరుతో దూషించారని అప్పటి పుట్లూరు సర్కిల్‌ సీఐ దేవేంద్ర ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి దీనివెనుక పనిచేసిందని చెబుతున్నారు. ఆ కేసులో జేసీ ప్రభాకర్‌ రెడ్డి కడప జైలులో ఉండివచ్చారు. 
  • ఇదే  జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మామ హనుమంతరెడ్డికి, డిహీరేహాళ్‌ మండలం పులకుర్తి గ్రామానికి చెందిన  రామాంజనేయలరెడ్డి అనే రైతుకు మధ్య పొలం విషయంలో గొడవ జరిగింది. కోర్టు రామాంజినేయులు రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా.. పోలీసులు మాత్రం హనుమంతరెడ్డి పక్షాన నిలిచారు. పైగా హనుమంతరెడ్డి అనుచరులతో రామాంజినేయులురెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టించారు. 
  • తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పాల సహకార సంఘం మాజీ డైరెక్టర్‌, టీడీపీ నేత రామచంద్రనాయుడు, స్థానిక వైసీపీ నేతల పొలాల మధ్య అనాధీనభూమి కొంత ఉంది. దాన్ని బండి బాటగా వినియోగిస్తున్నారు. వైసీపీ నేత ఈబాటను విస్తరించే క్రమంలో రామచంద్రనాయుడికి చెందిన భూమిలో దౌర్జన్యంగా రోడ్డు వేశారు. అడ్డుకున్న రామచంద్రనాయుడిపైన, ఆయన కుమారుడు భార్గవ్‌పై వైసీపీ నేత తన డ్రైవర్‌ ద్వారా 2020 ఆగస్టు 18న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు.
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలం ఎస్‌.మల్లాపురంలో పేదల పింఛన్‌ సొమ్ము స్వాహా చేస్తున్నాడని స్థానిక టీడీపీ నాయకులు.. గ్రామ వలంటీర్‌ను నిలదీశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఆ వలంటీర్‌ టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. 
  • ఏలూరు జిల్లాలో దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పైనే అత్యధికంగా 10 అట్రాసిటీ కేసులు పోలీసులు పెట్టారు. నెల్లూరు జిల్లాలో పాత్రికేయులపైనా అట్రాసిటీ కేసులు పెట్టారు. రాజధాని రైతుల ఉద్యమం సందర్భంగా ఏకంగా దళితులపైనే ఈ చట్టం ప్రయోగించి.. కోర్టుల్లో పోలీసులు అభాసుపాలయ్యారు. 


దళితులపైనే అట్రాసిటీ...!

రాజకీయ కోణంలో ఎడాపెడా అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగిస్తున్న పోలీసులు... నిజమైన దళిత బాధితులకు న్యాయం చేయడం లేదనే ఆరోపణలున్నాయి. పోలీ్‌సస్టేషన్‌ల్లో అట్రాసిటీ కేసులు నమోదు  చేయించడానికి దళిత, గిరిజన సంఘాలు రోడ్డెక్కి ఉద్యమాలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. దళితులు ఎక్కడ వివక్షను ఎదుర్కొంటున్నారో అధికారులు గుర్తించి, అలాంటి ప్రాంతాల్లో సివిల్‌ రైట్స్‌ డేలు జరిపి అవగాహన కల్పించాల్సి ఉండగా.. ఆ దిశగా చర్యలేవీ ఉండటం లేదని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) నేతలు పెదవి విరుస్తున్నారు.


నీళ్లు అడిగినందుకు... 

నంద్యాల జిల్లా బేతంచెర్లలో నీటి సమస్య గురించి ప్రశ్నించడానికి స్థానిక టీడీపీ నేతల ఆధ్వర్యంలో సుమారు పాతిక మంది మహిళలు నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. వీరిని కలిసేందుకు పంచాయతీ కమిషనర్‌ బయటికి కూడా రాలేదు. తర్వాత చైర్మన్‌ వచ్చి... సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో... టీడీపీ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. దీనిపై టీడీపీ నేతలు గట్టిగా స్పందించారు. ఆ తర్వాత ఏమైందో... ఏమో! నీళ్ల గురించి అడగడానికి వచ్చిన పాతికమందిపైనా నగర పంచాయతీ కమిషనర్‌ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టేశారు. వారు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు తెచ్చుకోవాల్సి వచ్చింది.


‘అట్రాసిటీ’యే ఎందుకు?

  • తమను ప్రశ్నించినా, నిలదీసినా తమ అనుచరుల ద్వారా ఫిర్యాదు చేయించి, విపక్ష నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిస్తున్నారు.
  • ఈ చట్టం మోపితే అంత త్వరగా బెయిల్‌ రాదు.. ఎక్కువకాలం జైల్లో ఉంచవచ్చు.  
  • ప్రజాసమస్యలపై రోడ్డెక్కేవారిని అదరగొట్టి కార్నర్‌ చేసేయొచ్చునని ఎత్తుగడ. 
  • వేరే చట్టాలతో పోల్చితే అట్రాసిటీ కేసులను ఎదుర్కోవడం ప్రతిపక్ష నేతలకు నైతికంగా ఇబ్బందే!


ప్రత్తిపాటిపై ఎస్సీ, ఎస్టీ కేసు

చిలకలూరిపేట, మే 14: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు పలువురు తెలుగుదేశం పార్టీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదయింది. శుక్రవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ తాగునీటి చెరువుల వద్ద ఎన్టీఆర్‌ సుజల స్రవంతి వాటర్‌ ప్లాంటు పునఃప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటపై పట్టణ ప్రణాళికా విభాగం పర్యవేక్షకురాలు కె.సునీత... ‘టీడీపీ నేతలు నా విధులకు ఆటంకం కలిగించారు. నన్ను తోసివేశారు’ అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు చిలకలూరిపేట అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఎస్సీ మహిళ కావడంతో టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ పీవోఏ చట్టంలోని సెక్షన్లు 323, 34, 353, 506, 509ల కింద కేసు నమోదు చేసినట్లు అర్బన్‌ సీఐ జి.రాజేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2022-05-15T07:53:37+05:30 IST