దాడులను ఖండించిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2021-10-20T06:31:21+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లోని ఆ పార్టీ కార్యాలయాలు, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై దాడులను జిల్లాలోని ఆ పార్టీ ముఖ్యనేతలు తీవ్ర స్థాయిలో ఖండించారు.

దాడులను ఖండించిన టీడీపీ నేతలు

అరాచక పాలనకు పరాకాష్ట

జిల్లా వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు

పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి 

దిష్టిబొమ్మలు దహనం

అనంతపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లోని ఆ పార్టీ కార్యాలయాలు, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై దాడులను జిల్లాలోని ఆ పార్టీ ముఖ్యనేతలు తీవ్ర స్థాయిలో ఖండించారు. వైసీపీ అరాచక పాలనకు ఈ దాడులే పరాకాష్టగా అభివర్ణించారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి దినంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చగా ప్రభుత్వ దాడులు నిలిచాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడులు చూస్తుంటే... ప్రజాస్వామ్యంలో ఉన్నామా...? లేదా..? అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ దాడులను ఖండించాలని ఆ పార్టీ నేతలు అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా... టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ... జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. వైసీపీ అరాచక పాలనపై ఆక్రోశం వ్యక్తం చేస్తూ... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదించారు. 



ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ

వైసీపీ గూండాలు.. టీడీపీ జాతీయ కార్యాలయంలపై దాడిచేయడం అత్యంత దుర్మార్గం. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యలయాలు, నాయకుల గృహాలే లక్ష్యంగా సాగిన అమానవీయ దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ. ఇలాంటి దుర్మార్గాలను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖం డించాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన అరాచక పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అన్నివర్గాల ప్రజలపై ఉంది.

- కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు


ఇది కచ్చితంగా స్టేట్‌ స్పాన్సర్‌ టెర్రర్‌

రాష్ట్రంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభు త్వం దాడులను ప్రోత్సహిస్తోంది. ఇది కచ్చితంగా స్టేట్‌ స్పాన్సర్‌ టెర్రర్‌. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావులేదు. ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తే... వాటికి సమాధానం చెప్పాలి కానీ.. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేయడం మంచిది కాదు. ఈ దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు.

- పయ్యావుల కేశవ్‌, పీఏసీ చైర్మన, ఎమ్మెల్యే


ఇది సీఎం జగన అరాచక పాలన

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయా లు, పార్టీ శ్రేణులపై సాగిన దాడులు సీఎం అరాచక పాలనకు పరాకాష్టగా నిలిచాయి. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ దాడులకు ముఖ్యమంత్రి జగన సమాధానం చెప్పాలి. పట్టపగలు వందలాది మంది వైసీపీ అరాచకమూకలు దాడులకు పా ల్పడటం చూస్తుంటే... రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలపై అభ్యంతరాలుంటే ఖండించాలిగానీ... ఇలా దాడులు చేయడమేంటి? ఈ దాడులు చూస్తుంటే... ప్రజలు భయకంపితులవుతున్నారు.

- పరిటాల సునీత, మాజీ మంత్రి


వ్యతిరేకత నుంచి జనం దృష్టి మరల్చేందుకే

టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైసీపీ అరాచక శక్తులు దాడులకు పాల్పడటం పిరికిపంద చర్య. ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను మరల్చేందుకే పథకం ప్రకారం దాడులకు పాల్పడ్డారు. వైసీపీ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడంలో భాగంగా... ప్రజలే వైసీపీకి చరమగీతం పాడుతారు.

- బీకే పార్థసారథి, టీడీపీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు 


పథకం ప్రకారమే దాడులు

రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేయడాన్ని బట్టి చూస్తే.. పథకం ప్రకారమే సాగిందని స్పష్టంగా తెలుస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయం, హిందూపురంలో బాలకృష్ణ నివాసం, అధికార ప్రతినిధి పట్టాభి నివాసంలో విధ్వంసం పిరికిపంద చర్యలు. గంజాయి స్మగ్లింగ్‌లో వాస్తవాలు బయటకు వస్తాయనే వైసీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు.

- పల్లె రఘునాథరెడ్డి, మాజీ మంత్రి


అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే..

రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థ పాలననను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నాయకులు, కార్యాలయాలపై వైసీపీ అరాచక మూకలు దాడులకు పాల్పడ్డారన్నది స్పష్టంగా కనిపిస్తోం ది. ప్రజాస్వామ్యానికి పాతరేసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది. విమర్శలు, ఆరోపణలు చేస్తే దాడులు చేస్తామనే సంకేతాలను పంపడం చూస్తుంటే... ప్రభుత్వం ఎంత దిగజారుతోందో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి ఈ దాడులపై స్పందించాలి. 

- పరిటాల శ్రీరామ్‌, ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌



డీజీపీ ధ్రుతరాష్టుడిలా వ్యవహరిస్తున్నారు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి, రాష్ట్ర డీజీపీ కనుసన్నుల్లోనే దాడులకు పాల్పడ్డారు. దాడులు చేస్తున్నారని పార్టీ నాయకులు.. పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా... పట్టించుకోలేదు. డీజీపీ ధ్రుతరాషు్ట్రడిలా వ్యవహరిస్తున్నారు. కళ్లున్న కబోదిలా కళ్లముందే జరుగుతున్నా... పట్టించుకోవడం లేదు. ఈ దాడులతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డీజీపీ విఫలం కావడంతోపాటు వైసీపీతో అంటకాగుతున్నారన్నది స్పష్టంగా తేలిపోయింది.

- ఎంఎస్‌ రాజు, టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు




ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు

దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే... దాడులకు దిగుతామనడం అసమర్థ పాలనకు నిదర్శనమే అవుతుంది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దాడులు చూడలేదు. ఆటవిక రా జ్యంలో లేమనే విషయం వైసీపీ నాయకులు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.

- బీవీ వెంకటరాముడు, అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి

Updated Date - 2021-10-20T06:31:21+05:30 IST