ఫ్లెక్సీలు తొలగింపు.. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు

ABN , First Publish Date - 2022-05-28T06:05:14+05:30 IST

తెలుగుదేం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడుకు ప్రభుత్వం విఘాతం కలిగిస్తోంది.

ఫ్లెక్సీలు తొలగింపు.. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
గుజ్జనగుండ్ల సెంటరులో టీడీపీ నాయకులతో చర్చిస్తున్న పోలీసులు

మహానాడు ఫ్లెక్సీలు తొలగిస్తున్న కార్పొరేషన్‌ సిబ్బంది

గుంటూరు, మే 27: తెలుగుదేం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడుకు ప్రభుత్వం విఘాతం కలిగిస్తోంది. గుంటూరు నగరంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శుక్రవారం ఉదయం నుంచి నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలోని అక్రమ ఆక్రమణల నిర్మూలన దళం బృందం తొలగిస్తోంది. గుజ్జనగుండ్ల సెటరులో టీడీపీ సీనియర్‌ కార్యకర్త మునగా సాంబశివరావు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని తొలగించగా సాంబశివరావు ప్రశ్నించినా.. తమకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయంటూ  తీసేశారు.

శంకర్‌విలాస్‌ సెంటరులో అడ్డుకున్న కార్యకర్తలు

 శుక్రవారం రాత్రి నగరంలోని బ్రాడీపేట మెయిన్‌ రోడ్డుపై ఫ్లెక్సీ తొలగిస్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని నిరసన తెలిపారు. తెలుగు యువత నాయకుడు పాటిబండ్ల బలరాం, 49వడివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు తెలగతోటి సుధీర్‌ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఫ్లెక్సీలు తొలగిస్తున్న సిబ్బందిని అడ్డుకున్నారు.  కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేసినా సిబ్బంది ఫ్లెక్సీల తొలగింపును కొనసాగించారు. దీంతో వారు అక్కడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహానాడు సందర్భంగా భాష్యం ప్రవీణ్‌, టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అన్నింటిని సిబ్బంది తొలగించారు. మద్దిరాల మ్యానీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగిస్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 

 వాహనాలు అడ్డుకోవడమే లక్ష్యం

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు వెళ్లే వాహనాలను ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఈనెల 26 నుంచి 29 వరకు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను ప్రారంభించిన విషయం విదితమే. బస్సు యాత్ర శనివారం నగర శివారులోని కాకానివై జంక్షన్‌ వద్దకు చేరుకుంటుంది.  ఈ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని శనివారం విజయవాడ నుంచి వచ్చే వాహనాలను దారిమళ్లిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. విజయవాడ వైపు నుంచి గుంటూరు నరంలోని ప్రవేశించే వాహనాలు శంకర్‌ ఐ హాస్పటల్‌ వద్ద సర్వీసు రోడ్డు నుంచి వెళ్లి కాకాని ఫ్లెఓవర్‌ వై జంక్షన్‌ అండర్‌ ఫ్లైఓవర్‌ వద్ద మలుపు తీసుకుని తిరిగి నగరంలోకి ప్రవేశించాలని జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు. 

అర్ధరాత్రి హైటెన్షన్‌.. రంగంలోకి టీడీపీ కార్పొరేటర్లు

టీడీపీ ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం శనివారం అర్ధరాత్రి హైటెన్షన్‌కు దారి తీసింది. ఫ్లెక్సీలు తొలగిస్తున్నారన్న విషయం తెలుసుకున్న టీడీపీ కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరాంప్రసాద్‌, ఈరంటి వరప్రసాద్‌ (బాబు), తెలుగు యువత నాయకుడు పులివర్తి అజార్‌తోపాటు మరికొందరు శంకర్‌విలాస్‌ సెటరుకు చేరుకన్నారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్న సిబ్బందిని కార్పొరేటర్లు అడ్డుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా సిబ్బంది ససేమిరా అనటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు భారీగా రంగంలోకి దిగారు. అరండల్‌పేట పోలీసులతోపాటు కొత్తపేట పోలీసులు కూడా ఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి వరకు ఫ్లెక్సీల తొలగింపు ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. 

Updated Date - 2022-05-28T06:05:14+05:30 IST