‘రాష్ట్రంలో గాడితప్పిన పాలన’

ABN , First Publish Date - 2022-01-20T04:19:31+05:30 IST

ఒక్క చాన్స్‌ అనే నినాదంతో జగన్‌కు ఓట్లు వేసిన ప్రజలు మోసపోయారని, రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు.

‘రాష్ట్రంలో గాడితప్పిన పాలన’
మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి

పత్తికొండటౌన్‌, జనవరి 19: ఒక్క చాన్స్‌ అనే నినాదంతో జగన్‌కు ఓట్లు వేసిన ప్రజలు మోసపోయారని, రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం పత్తికొండకు వచ్చిన ఆయన మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ ప్రమోద్‌కుమార్‌రెడ్డి స్వగృహంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంబాబుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్‌ రాష్ట్ర ప్రజలందరినీ నట్టేట ముంచారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పాలకులు మరిచారన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు సైతం రోడ్లు ఎక్కి నిరసనలు, పోరాటాలు సాగించే దుస్థితికి జగన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిందని దుయ్యబట్టారు. గుడివాడలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో జూదం, అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు చేయించారని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల కర్నూలు జిల్లాకు నీటి కేటాయింపులలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. టీడీపీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ప్రమోద్‌కుమార్‌రెడ్డి, పెండేకల్లు భాస్కర్‌రెడ్డి, ఎద్దులదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, తిమ్మయ్యచౌదరి, మనోహర్‌చౌదరి, తిరుపాలు, కడవల సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T04:19:31+05:30 IST