వెళ్లడానికి వీల్లేదు

ABN , First Publish Date - 2022-09-25T06:27:39+05:30 IST

అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న టీడీపీ నాయ కులను పోలీసులు వెంటాడి మరీ అడ్డుకున్నారు.

వెళ్లడానికి  వీల్లేదు
చింతమనేనికి నోటీసు ఇస్తున్న పోలీసులు

టీడీపీ నాయకులకు అడ్డంకులు

అమరావతి పాదయాత్రకు వెళ్ళకుండా నిర్బంధాలు

ముదినేపల్లి వద్ద జయమంగళ అరెస్టు

మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి నోటీసులు


ముదినేపల్లి / పెదవేగి సెప్టెంబరు 24 : అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న టీడీపీ నాయ కులను పోలీసులు వెంటాడి మరీ అడ్డుకున్నారు. శనివారం గుడివాడ వెళ్తున్న కైకలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ జయమంగళ వెంకటరమణను ముదినేపల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కైకలూరు నియోజకవర్గంలోని వివిధ మమండలాల నుంచి గుడివాడ వెళ్లే నాయకుల కార్లను, ఇతర వాహనాలను ముదినేపల్లిలో అడ్డగించారు.పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి కైకలూరు, మండవల్లి మీదుగా ముదినేపల్లి చేరుకున్న జయమంగళ ఉన్న కారును ఎస్‌ఐ షణ్ముఖ సాయి తన సిబ్బందితో అడ్డుకుని గుడివాడ వెళ్లేందుకు వీలు లేదని నిలిపివేశారు. తాను విజయవాడ వెళ్లాల్సి ఉందని ఇలా అడ్డగించటం ప్రజాస్వామ్య విరుద్దం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డు తొలగమని నాయకులు చెప్పినా వినలేదు. జయ మంగళతో పాటు టీడీపీ నాయకులు వల్లభనేని శ్రీనివాసచౌదరి, పైడిమర్రి మాల్యాద్రి, బలే ఏసురాజు తదితరులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మూడు గంటలపాటు స్టేషన్‌ లో ఉంచి పోలీసు బందోబస్తుతో వారిని కైకలూరు పంపించేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ గుడివాడ వెళ్తున్నారనే అనుమానంతో పోలీసులు ప్రభాకర్‌ను గృహ నిర్బంధం చేసి పాదయాత్రకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసు అందించగా నోటీసు తీసుకోవడానికి ప్రభాకర్‌ నిరాకరించారు. 


మమ్మల్ని అడ్డుకుంటే ఉద్యమం ఆగుతుందా ?

మమ్మలి అడ్డుకున్నంత మాత్రాన మహోద్యమం ఆగుతుందా..? ఉద్యమానికి సంఘీభావం తెలపడం కూడా తప్పేనా..? గుడి వాడకు తరలివస్తున్న జన ప్రభంజనాన్ని తట్టుకోలేక కొడాలి నాని ఎస్పీతో ఆదేశాలు జారీ చేయించి ఎక్కడి వారిని అక్కడే అదుపు లోకి తీసుకునే కార్యక్రమం చేపట్టారు. హైకోర్టు ఆదేశాలతో అమరావతి రైతుల పాద యాత్ర జరుగుతున్నా సంఘీభావం తెలిపే వారిని ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గం.. ఇది కోర్టు ధిక్కారమే అవుతుందంటూ పోలీసుస్టేషన్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం జయ మంగళ వెంకట రమణ పోలీసుల తీరుపై మండిపడ్డారు.


ఏం తప్పు చేశానని నోటీస్‌ ఇస్తున్నారు..?

ఇది సిగ్గుమాలిన ప్రభుత్వం. ఏం తప్పు చేశానని నన్ను గృహ నిర్భంధం చేసి నోటీసులు ఇస్తున్నారు.. అని చింతమనేని ప్రభాకర్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పాదయాత్రకు వెళ్ళడానికి వీల్లేదంటూ ఏలూరు మూడవ పట్టణ సీఐ, ఎస్‌ఐ శంకర్‌తో పాటు 20 మంది వరకు పోలీస్‌ సిబ్బంది శనివారం ఉదయం పెదవేగి మండలం దుగ్గిరాలలోని ప్రభాకర్‌ ఇంటికి చేరుకుని గృహ నిర్బంధం చేశారు. గుడివాడలో జరిగే పాదయాత్రలో నేను వెళ్లడం లేదు. అయినా వెళ్తే తప్పేముంది. మేమేమైనా దోపిడీలు చేస్తున్నామా ? దొంగ తనాలు పాల్పడుతున్నామా ? అని ఆయన ప్రశ్నించారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, కాయ పండితేనే రాలుతుందని, జగన్‌ పాలన కూడా త్వరలోనే ముగుస్తుందని అన్నారు.


పోలీసులను తప్పించుకుని పాదయాత్రకు..

పాదయాత్రకు బయలుదేరిన చింతమనేని ప్రభాకర్‌ను శనివారం ఉదయం దుగ్గిరాలలోని స్వగృహంలో నిర్భంధించారు. బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా పోలీసులు మొహరించారు. ప్రభాకర్‌ పోలీసుల కళ్లుగప్పి శనివారం సాయంత్రానికి గుడివాడ చేరుకున్నారు. గుడివాడలో పోలీసులు ప్రభాకర్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన ప్రభాకర్‌ కారు నుంచి దిగి ద్విచక్ర వాహనంపై దూకు డుగా పోలీసుల వలయాన్ని చేధించుకుంటూ పాదయాత్ర ప్రాంతానికి చేరుకున్నారు. మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో కలసి య్రాతలో పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-25T06:27:39+05:30 IST