చంద్రబాబు పర్యటనతో వైసీపీలో వణుకు: టీడీపీ

ABN , First Publish Date - 2021-03-06T05:39:26+05:30 IST

చంద్రబాబు కర్నూలు నగరంలో గురువారం చేపట్టిన రోడ్‌షో పర్యటన పూర్తిగా విజయవంతమైందని, ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ అన్నారు.

చంద్రబాబు పర్యటనతో వైసీపీలో వణుకు: టీడీపీ
టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతున్న నాయకులు

కర్నూలు(అగ్రికల్చర్‌), మార్చి 5: చంద్రబాబు కర్నూలు నగరంలో గురువారం చేపట్టిన రోడ్‌షో పర్యటన పూర్తిగా విజయవంతమైందని, ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రోడ్‌షో నేపథ్యంలో కలెక్టర్‌తో పాటు ఎస్పీ తదితర పోలీసు యంత్రాంగం పటిష్ఠ చర్యలు తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు పర్యటనతో తమ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోందని, కర్నూలు నగర అభివృద్ది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, ప్రజలు స్పష్టం చేస్తున్నారని సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు యాదవ్‌ తెలిపారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దోపిడీ ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు గుణపాఠం చెప్పాలా అని ప్రజలు  ఎదురు చూస్తున్నారన్నారు. చంద్రబాబు రోడ్‌షో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ పార్టీ కర్నూలు నియోజకవర్గం ఇన్‌చార్జి టీజీ భరత్‌ చక్కటి కార్యచరణ ప్రణాళిక అమలు పరిచారని అభినందించారు. ఇదే విధంగా రానున్న ప్రతి ఎన్నికల్లో కూడా తమ పార్టీ నాయకులు ముందుకెళ్లి విజయాన్ని సాధించే విదంగా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. కాగా, విశాఖ ఉక్కు కోసం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బంద్‌ పూర్తిగా విజయవంతమైందని, ఈ బంద్‌కు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు పలికిందని తెలిపారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం నోరు విప్పడం లేదని, ఈ సమస్యపై ప్రజలు, పత్రికల ముందుకు ఆయన ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలతో పాటు 22 మంది లోక్‌సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నా విశాఖ ఉక్కు కోసం ప్రధాని మోదీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీ దొంగనాటకాలను ఇప్పటికైనా ఆపాలని, జగన్‌ విశాఖ ఉక్కు కోసం ఉద్యమాన్ని చేపట్టి, దానికి నాయకత్వం వహిస్తే తామంతా మద్దతు ఇస్తామన్నారు. ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసి విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, ఆ విధంగా చేయలేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించి పోరాటాలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రికి సూచించారు. హనుమంతరావు చౌదరి, సుకన్య, రామాంజనేయులు, నాగేంద్రకుమార్‌, సముద్రాల హనుమంతరావు, సునీల్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-06T05:39:26+05:30 IST