జగన్‌ పాలనలో పేద పిల్లలకు విద్య దూరం

ABN , First Publish Date - 2022-07-06T05:44:03+05:30 IST

ఎస్సీ, ఎస్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు విద్య దూరమవుతోందని టీడీపీ రాష్ట్ర నాయకులు మానుకొండ శివప్రసాద్‌, దారు నాయక్‌, సుఖవాసి శ్రీనివాసరావు విమర్శించారు.

జగన్‌ పాలనలో పేద పిల్లలకు విద్య దూరం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మానుకొండ శివప్రసాద్‌

టీడీపీ రాష్ట్ర నేతలు

గుంటూరు, జూలై 5(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు విద్య దూరమవుతోందని టీడీపీ రాష్ట్ర నాయకులు మానుకొండ శివప్రసాద్‌, దారు నాయక్‌, సుఖవాసి శ్రీనివాసరావు విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాగానే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌(బీఏఎస్‌) పథకాన్ని రద్దు చేసిందని, ఫలితంగా 40 వేల మంది గిరిజన పిల్లలు కార్పొరేట్‌ విద్యకు దూరమయ్యారని ఆయన విమర్శించారు. దారునాయక్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలో విదేశాల్లో చదువుకునే ఎస్సీ, గిరిజన విద్యార్థులకు అంబేడ్కర్‌ విదేశీ విద్యాపథకాన్ని అమలు చేసి ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇచ్చి ప్రోత్సహించారన్నారు. సుఖవాసి శ్రీనివాస్‌ మాట్లాడుతూ వైసీపీ వచ్చాక ఉపాధ్యాయ నియామకాలు ఆగిపోయి విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయిందని ఫలితంగా పదో తరగతి ఉత్తీర్ణత పడిపోయిందని, గిరిజన విద్యార్థుల ఉత్తీర్ణత 40 శాతానికి తగ్గిందని ఆయన విమర్శించారు. నాడు- నేడు పథకం కేవలం పత్రికలకు మాత్రమే పరిమితమైందని స్కూళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో షేక్‌ లాల్‌వజీర్‌, మేళం సైదయ్య, దర్శనపు యాకోబు తదితరులు పాల్గొన్నారు. 


ఆర్థిక నేరస్తుల చేతుల్లో రాజ్యాంగం 

పదహారు నెలలు జైల్లో చిప్పకూడు తిన్న వ్యక్తి రాష్ట్రపతి నామినేషన్‌ను బలపరుస్తూ సంతకం పెడతాడు.. మరో ఆర్థిక నేరస్తుడు ఏకంగా ప్రధానమంత్రి పాల్గొనే సభలో ప్రొటోకాల్‌ ఎలా ఉండాలో ఆయన కార్యాలయాన్నే శాసిస్తాడు... స్థూలంగా ఆంధ్రప్రదేశ్‌లో మన రాజ్యాంగానికి పట్టిన గతి ఇదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. పార్టీ పశ్చిమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల అధినేతలను పిలవకుండా ప్రతినిధులను పంపమని కోరటమేమిటని ప్రశ్నించారు. వచ్చిన ప్రతినిధిని సైతం వేదికమీదకు పిలవకుండా అవమానపరచారని ఆరోపించారు. శాసనసభలో ఉపనాయకుడిగా, ప్రధాన ప్రతిపక్షపార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బలహీన వర్గాలకు చెందిన అచ్చెన్నాయుడిని ఈ విధంగా అవమానించటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగదని అన్నారు. దీనిపై ప్రదానమంత్రి కార్యాలయం వెంటనే స్పందించి విచారణకు ఆదేశించాలన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణను సైతం వైసీపీ ప్రభుత్వం రాజకీయలబ్ధికి వాడుకున్నా కేంద్రప్రభుత్వం చేష్ఠలుడిగి చుస్తుండటం సిగ్గుచేటని అన్నారు. మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజుని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు బీజేపీ జగన్నాటకాన్ని అర్ధం చేసుకోలేని అమాయకులు కాదని అన్నారు. ఆహ్వానపత్రికలో సైతం జగన్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, రోజారెడ్డిల పేర్లువేసి ఆ నియోజకవర్గానికి చెందిన ప్రొటోకాల్‌ ఏంపీ రఘురామ కృష్ణంరాజు పేరులేకపోవటం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఆయనపై రాజద్రోహం కేసుమోపి, దారుణంగా హింసించి, నేడు ఆ వర్గాన్ని మెప్పించటం కోసం సీతారామరాజు విగ్రహాన్ని వాడుకోవటం అత్యంత దుర్మార్గమని అన్నారు. తన కేసుల కోసం రాష్ర్టాభివృద్ధిని తాకట్టుపెడుతున్న జగన్‌రెడ్డి నిస్సహాయతను చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని కనపర్తి శ్రీనివాస్‌ అన్నారు.

 

Updated Date - 2022-07-06T05:44:03+05:30 IST