జగన్‌ పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం

ABN , First Publish Date - 2021-03-07T04:40:59+05:30 IST

జగన్‌ పాలనలో రాష్ట్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, చంద్రబాబు ఐదేళ్లలో చేసిన అప్పుల కంటే 20 నెలల్లో జగన్‌ చేసిన అప్పులే ఎక్కువని టీడీపీ సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు.

జగన్‌ పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం
మాట్లాడుతున్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

టీడీపీ సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి

నెల్లూరు(వ్యవసాయం), మార్చి 6: జగన్‌ పాలనలో రాష్ట్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, చంద్రబాబు ఐదేళ్లలో చేసిన అప్పుల కంటే 20 నెలల్లో జగన్‌ చేసిన అప్పులే ఎక్కువని టీడీపీ సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అప్పు తెచ్చిన ప్రతి పైసాను చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం వెచ్చించారన్నారు. రాష్ట్రంలో  పన్నుల ద్వారా వస్తున్న రాబడిని జగన్‌ ముఠా దోచుకుంటోందని ఆరోపించారు. నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ, మాజీ మేయర్‌ అజీజ్‌ చేసిన అభివృద్ధే కనిపిస్తుందన్నారు.  అలాంటిది మంత్రి అనిల్‌ చంద్రబాబునాయుడి హయాంలోనే అప్పులు పెరిగాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. వైసీపీ చేసిన అప్పులు, అభివృద్ధిపై చర్చకు వచ్చేందుకు వైసీపీ నేతలకు దమ్ముందా అని సవాల్‌ విసిరారు. మంత్రి అనిల్‌ జగన్‌ చేసిన అప్పులు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ప్రభుత్వం అప్పులు చేసిందని స్వయంగా ఆర్థికశాఖా మంత్రి ప్రకటించిన విషయాన్ని మంత్రి తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డపై రూ.72 వేల అప్పు ఉందని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు మామిడాల మధు, కప్పిర శ్రీనివాసులు, పిట్టి సత్యనాగేశ్వరరావు, పడవల కృష్ణమూర్తి, ఆకుల హనుమంతు, సాబీర్‌ఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T04:40:59+05:30 IST