టీడీపీ జాబితా విడుదల

ABN , First Publish Date - 2021-03-02T06:19:20+05:30 IST

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను తెలుగుదేశం పార్టీ సోమవారం రాత్రి విడుదల చేసింది.

టీడీపీ జాబితా విడుదల

జీవీఎంసీలో 91 వార్డులకు అభ్యర్థుల ప్రకటన

31, 33, 36, 37, 49, 72, 78 వార్డులు పెండింగ్‌

72, 78 వామపక్షాలకు కేటాయింపు?

ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు బీఫారాలు అందజేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

అభ్యర్థులకు పంపిణీ రేపు


విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి):


గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను తెలుగుదేశం పార్టీ సోమవారం రాత్రి విడుదల చేసింది. మొత్తం 98 వార్డులకు గాను 91 వార్డులకు అభ్యర్థులను ఖరారుచేసింది. మరో ఏడు వార్డులకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.


అభ్యర్థుల నియామకంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఉదయం నుంచి జిల్లా పార్టీ కార్యాలయంలో జీవీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులతో దఫదఫాలుగా సమావేశాలు నిర్వహించారు. భీమునిపట్నం, విశాఖ తూర్పు, పశ్చిమ, పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల పరిధిలో గల వార్డులకు అభ్యర్థుల ఎంపికపై మధ్యాహ్నానికి నేతలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు అనకాపల్లి, పెందుర్తి, విశాఖ పశ్చిమ, తూర్పు, భీమిలి సెగ్మెంట్‌లకు సంబంధించిన బీఫారాలను ఎమ్మెల్యేలు/ఇన్‌చార్జులకు అచ్చెన్నాయుడు అందజేశారు. కాగా విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో 49, దక్షిణ నియోజకవర్గంలో 31, 33, 36, 37, గాజువాక నియోజకవర్గ పరిధిలోని 72,78 వార్డులపై ఇంకా స్పష్టత రాలేదు. ఉత్తరంలో 49వ వార్డు నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన పైలా ముత్యాలనాయుడు తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం పార్టీ నేతలకు తెలియజేశారు. బరి నుంచి తప్పుకోవాలని ముత్యాలనాయుడుకు ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో ఇండిపెండెండెంట్‌గా నామినేషన్‌ వేసిన సురేష్‌, ఎర్రునాయుడు, కృష్ణంరాజులో ఒకరికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో నేతలు ఉన్నారు. అయితే సురేష్‌ రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ అల్లుడు కావడంతో మిగిలిన ఇద్దరిలో ఒకరి పేరు పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే దక్షిణ నియోజకవర్గంలో 31వ వార్డు కోసం వానపల్లి రవికుమార్‌, దొడ్డి బాపూఆనంద్‌ పోటీ పడుతుండంతో పెండింగ్‌లో పెట్టారు. ఇదే వార్డుకు ఆనుకుని వున్న 33వ వార్డుకు ఇద్దరు, ముగ్గురు పోటీ పడడంతో ఎవరినీ ఖరారు చేయలేదు. ఇంకా 36, 37 వార్డుల నుంచి గతంలో నామినేషన్లు దాఖలు చేసి, అనంతరం వైసీపీ కండువాలు కప్పుకున్న కేదారి లక్ష్మి, బంగారు రవిశంకర్‌లకు ప్రత్యామ్నాయ అభ్యర్థులను చూస్తున్నారు. గాజువాక నియోజకవర్గ పరిధిలోని 72, 78 వార్డులు వామపక్షాలకు కేటాయించే అవకాశం వున్నందున పెండింగ్‌లో ఉంచారు. 


మేయర్‌ అభ్యర్థి పీలా


విశాఖపట్నం, మార్చి 1 (ఆంరఽధజ్యోతి): జీవీఎంసీ ఎన్నికలలో టీడీపీ తరపున మేయర్‌ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరు ఖరారైంది. మేయర్‌ అభ్యర్థిత్వానికి పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు కూడా పరిశీలించారు. అయితే పార్టీ అధిష్ఠానం పీలా వైపు మొగ్గు చూపడంతో జీవీఎంసీ ఎన్నికల బరి నుంచి బాబ్జీ తప్పుకున్నారు. దీంతో 95వ వార్డుకు బాబ్జీకి బదులుగా దాట్ల మధు అభ్యర్థిత్వం ఖరారు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత పీలా శ్రీనివాసరావు పేరు అధికారికంగా వెల్లడించనున్నారు. 

Updated Date - 2021-03-02T06:19:20+05:30 IST