
రైతు రాజ్యం దేవుడెరుగు...
బతికుంటే అదే పదివేలన్నట్లుంది
జగన్‌ని చూసి జనం పరార్: లోకేశ్
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి దరిద్రపాదం ఎఫెక్ట్‌తో రైతు రాజ్యం సంగతి దేవుడెరుగు... రైతు బతికుంటే అదే పదివేలు అనేలా దుస్థితి ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. జగన్‌రెడ్డి తన పాలనలో రైతులకు జరిగిన అన్యాయం, వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లడంపై తొలుత సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ద్వారా రైతుల మెడకు ఉరితాడు బిగించారన్నారు. సీఎం జగన్‌రెడ్డికి 17 ప్రశ్నలు సంధిస్తూ లోకేశ్ సోమవారం ఒక లేఖను విడుదల చేశారు. అందులో వ్యవసాయ, రైతు సంక్షేమ ఆధారిత వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై ప్రశ్నలు సంధించారు. జగన్ దెబ్బకు జనం పరార్ అని ఎద్దేవా చేశారు. రైతుల్ని దగాచేసిన జగన్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అనడానికి ఇంతకన్నా అధారాలు కావాలా?...అని సీఎం సభలో ఖాళీ అయిపోయిన కుర్చీల ఫోటోలు పెట్టి ప్రశ్నించారు.