మహా.. ఉత్సాహం

ABN , First Publish Date - 2022-05-28T06:48:08+05:30 IST

తమ్ముళ్లు ఒంగోలు బాట పట్టారు. రెండేళ్ల తర్వాత వచ్చిన మహా పండుగకు తరలివెళ్లారు. ఆహ్వానాలు లేవని అలకపూనలేదు.. ఏర్పాట్లతో సంబంధం లేదు.. వాహనాలు లేవని వెనుకంజ వేయలేదు.. మహానాడుకు వెళ్లడమే ధ్యేయమన్నట్లుగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి తెలుగు తమ్ముళ్లు శుక్రవారం ఒంగోలుకు తరలివెళ్లారు.

మహా.. ఉత్సాహం

ఒంగోలు బాటలో తమ్ముళ్లు

పసుపు పండుగలో తెలుగు దండు  

మహానాడులో నాయకులు, కార్యకర్తల సందడి

పార్టీ కోటాను మించి జిల్లా ప్రతినిధులు భారీగా హాజరు

పోలవరంపై ఆనందబాబు, వ్యవసాయంపై  నరేంద్ర తీర్మానాలు

నేటి బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లేందుకు కార్యకర్తలు సమాయత్తం


పసుపు పండుగ మహానాడుకు మహా ఉత్సాహంగా తమ్ముళ్లు తరలివెళ్తున్నారు. తొలి రోజు శుక్రవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి  ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఒంగోలుకు తరలివెళ్లారు. పసుపు జెండాలతో అలంకరించిన వాహనాల శ్రేణి.. పసుపు వస్త్రాల ధరించిన నాయకులు, కార్యకర్తలతో ఆయా ప్రాంతాలు పసుపుమయంగా మారాయి.  తొలి రోజు మహానాడు ప్రతినిధుల సభ అయినప్పటికీ కార్యకర్తలు ఎవరికివారు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివెళ్లారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి తరలివెళ్లిన వారి సందడితో మహానాడు ప్రాంగణం దద్దరిల్లింది. పార్టీ నిర్ణయించిన కోటాను మించి జిల్లా నుంచి ప్రతినిధులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మహానాడు తొలి రోజున పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయ రంగంపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రలు తీర్మానాలు చేశారు. శనివారం జరిగే బహిరంగ సభకు భారీగా తరలివెళ్లేందుకు ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  అయితే పల్నాడు జిల్లాలో పోలీసులు, రవాణాశాఖ అధికారులు ట్రావెల్స్‌ వాహనాలు మహానాడుకు వెళ్లకుండా చేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా తగ్గేదేలేదని నాయకులు, కార్యకర్తలు చెప్తున్నారు.


 


గుంటూరు, మే 27 (ఆంధ్రజ్యోతి): తమ్ముళ్లు ఒంగోలు బాట పట్టారు. రెండేళ్ల తర్వాత వచ్చిన మహా పండుగకు తరలివెళ్లారు. ఆహ్వానాలు లేవని అలకపూనలేదు.. ఏర్పాట్లతో సంబంధం లేదు.. వాహనాలు లేవని వెనుకంజ వేయలేదు.. మహానాడుకు వెళ్లడమే ధ్యేయమన్నట్లుగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి తెలుగు తమ్ముళ్లు శుక్రవారం ఒంగోలుకు తరలివెళ్లారు. పసుపు చొక్కాలు, కండువాలు ధరించి పార్టీ జెండాను చేబూనిన కార్యకర్తల హడావుడితో మూరుమూల పల్లెల నుంచి మున్సిపల్‌, నియోజకవర్గ కేంద్రాల్లో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు సందడి నెలకొంది. ఒంగోలులోని మండువవారిపాలెంలో జరుగుతున్న మహానాడుకు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ నుంచి 757, బాపట్ల పార్లమెంటు నుంచి 608, నరసరావుపేట పార్లమెంటు నుంచి 364 మందికి మాత్రమే తొలిరోజు సభకు ఆహ్వానం అందింది. అయితే వీరికి తోడు అదనంగా మరో 16 వేల మంది తొలిరోజు సభకు హాజరయ్యారని నేతలు చెబుతున్నారు. పార్టీ నుంచి ఎలాంటి పిలుపూ లేకపోయినా ఎవరికి వారుగా ఒంగోలు బాట పట్టారు. బస్సులు, రైళ్లు, కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలు.. ఇలా ఎలా వీలైతే అలా ఎవరికి వారుగా ఒంగోలు చేరుకున్నారు. ప్రతినిధుల సభలో   మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి తెనాలి శ్రావణ్‌కుమార్‌, గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసులు, కొమ్మాలపాటి శ్రీధర్‌, వైవీ ఆంజనేయులు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, జడ్పీ మాజీ చైర్మన్‌ విజయమ్మ, కనపర్తి శ్రీనివాస్‌ తదితరులు సభలో సందడి చేశారు.


రెండోరోజుకు భారీగా ఏర్పాట్లు.. 

తొలిరోజు సభ ఇచ్చిన ఊపుతో జిల్లా నేతలు రెండోరోజు బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నిర్ణయించిన జిల్లా కోటా 20 వేలు కాగా ఈ సంఖ్య మరో రెండు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లాలోని ఒక్కో నియోజకవర్గం నుంచి 20 నుంచి 25 బస్సులు, 30 ఇన్నోవా కార్లను నేతలు సిద్ధం చేశారు. శుక్రవారంనాటి పరిస్థితిని చూసి అదనపు ఏర్పాట్లు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రజలు ఎవరికి వారే స్వచ్ఛందంగా ఒంగోలు చేరుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

 

గ్రామాల నుంచి భారీగా..

పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో శుక్రవారం ఉదయం కార్యకర్తలు, నాయకులు కార్లలో ర్యాలీగా మహానాడుపండుగకు తరలివెళ్లారు. పార్టీ అనుబంధ సంఘాలతో పాటు వివిధ పదవుల్లో ఉన్న ప్రతినిధులు ఉత్సాహంగా వెళ్లారు. శనివారం జరిగే సభలో పాల్గొనేందుకు యువకులు ద్విచక్రవాహనాలలో ర్యాలీగా వెళ్లడానికి సిద్ధమయ్యారు. చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల నుంచే దాదాపు 30,000 మంది బహిరంగసభకు హాజరవుతారని అంచనా.  నియోజకవర్గాల ఇన్‌చార్జిలు వాహనాలను ఎక్కడికక్కడ సమకూరుస్తున్నారు. 


తమ్ముళ్లకు రవాణా కష్టాలు 

 నరసరావుపేట: మహానాడుకు కార్లు, జీపులు వెళ్లకుండా పోలీసులు, రావాణాశాఖ అధికారులు అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారని టీడీపీ నాయకులు తెలిపారు. పబ్లిక్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న వాహనాలు మహానాడుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతున్నది. మహానాడుకు జిల్లా నుంచి భారీగా తరలి వెళ్లేందుకు నాయకులు ముందుగానే వాహనాలకు అడ్వాన్స్‌లు ఇచ్చి రిజర్వు చేసుకున్నారు. అయితే నరసరావుపేట ట్రావెల్స్‌ నిర్వాహకులతో సమావేశమైన రవాణాశాఖ అధికారులు వంద వాహనాలను వైసీపీ బస్సు యాత్రకు పంపాలని తేల్చి చెప్పారు. మహానాడుకు ముందుగానే అడ్వాన్స్‌లు తీసుకున్నామని నిర్వహకులు చెబుతున్నా అధికారులు వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇదే పరిస్థితి జిల్లా అంతటా నెలకుంది. ఈ నేపఽథ్యంలోనే మహానాడుకు వెళ్లే వాహనాలను అధికారులు అడ్డుకుంటారన్న వాదనను టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకే రోజు మహానాడు, వైసీపీ బస్సు యాత్ర జరుగుతుండటంతో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. 


తగ్గేదేలేదు..

అడ్డుకుంటే ఆందోళనలు


మహానాడు రెండో రోజు బహిరంగ సభ శనివారం జరగనున్నది. తొలిరోజు ప్రతినిధుల సభకే తమ్ముళ్ల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా శనివారం ఒంగోలు మహానాడు ప్రాంగణంలో జరిగే బహిరంగ సభకు జిల్లా నుంచి కార్యకర్తలు తరలివెళ్లకుండా చేసేందుకు ప్రభుత్వం పోలీసులు, రవాణాశాఖల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు నాయకులు ఆరోపిస్తున్నారు. ముందుగానే అడ్వాన్సులు ఇచ్చి మహానాడుకు ట్రావెల్స్‌ల నుంచి వాహనాలను నాయకులు సమకూర్చుకున్నారు. అయితే ట్రావెల్స్‌ నిర్వాహకులతో నరసరావుపేటలో రవాణాశాఖ అధికారులు సమావేశం నిర్వహించి మహానాడుకు వాహనాలు పంపకూడదని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికారులు అడ్డుకుంటే తగ్గేదేలేదని ఘంటాపథంగా చెప్తున్నారు. ఎలాగైనా మహానాడుకు తరలివేళ్తామని ఎక్కడైనా అడ్డుకుంటే అక్కడే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. పల్నాడు జిల్లా నుంచి 30 వేల మంది వరకు మహానాడుకు తరలివెళ్లే విధంగా ఏర్పాట్లు చేశామని  పోలీసులు, రవాణా శాఖ అధికారులు వాహనాలను అడ్డుకుంటే సహించేది లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీఎస్‌ ఆంజనేయులు తెలిపారు. 


  పల్నాడులో ఉత్కంఠ

ఒక వైపు శనివారం ఒంగోలులో జరిగే మహానాడుకు టీడీపీ శ్రేణులు తరలివెళ్లేందుకు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే వారికి వాహనాలకు లేకుండా చేసేందుకు అధికారుల ద్వారా వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అదేరోజు నరసరావుపేటలో సామాజిక న్యాయభేరి పేరుతో వైసీపీ బస్సు యాత్ర ఏర్పాటు చేసింది. టీడీపీ, వైసీపీ నాయకులు వారివారి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి ఆయా కార్యక్రమాలకు భారీ జన సమీకరణకు నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పల్నాడులో ఉద్రిక్తత నెలకొంది.   


 


వంకాయలపాడు వద్ద భోజనశాల

భాష్యం ప్రవీణ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

25 వేల మందికి సరిపడ ఆహారం తయారీ

15 రకాల శాఖాహార, మాంసాహార వంటకాలు


యడ్లపాడు: మహానాడు బహిరంగసభకు తరలి వెళ్లే టీడీపీ శ్రేణులకు జాతీయ రహదారిపై యడ్లపాడు మండలం వంకాయలపాడు సమీప పొలాల్లో భాష్యం ప్రవీణ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒంగోలుకు తరలి వెళ్లే వారి కోసం సుమారు ఆరెకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల శ్రేణులకు ఇప్పటికే ట్రస్టు నిర్వాహకులు తెలియజేశారు. సుమారు 200 మంది వంట వారితో 25 వేల మందికి సరిపడ భోజనం తయారు చేస్తున్నారు. పది బఫే కౌంటర్లను ఏర్పాటు చేశారు. 15 రకాల శాఖాహార, మాంసాహార వంటకాలను తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచే ఒంగోలు తరలి వెళ్లే పార్టీ శ్రేణులకు ఇక్కడ భోజనం అందిస్తారు. ఆయా ఏర్పాట్లను టీడీపీ నాయకులు కొండ్రగుంట శ్రీనివాసరావు, రాజేష్‌ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.  

Updated Date - 2022-05-28T06:48:08+05:30 IST