రైతులను పీడిస్తారా..

ABN , First Publish Date - 2022-01-25T05:39:09+05:30 IST

‘గోదావరి జిల్లా రైతులు వ్యవసాయం మీదే ఆధారపడేవారు. వీరి వద్ద కొన్న ధాన్యానికి సొమ్ములు ఇవ్వరు. సాగు, తాగునీటికి అవసరమైన పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తారు. నిర్వాసితులను ముప్పుతిప్పలు పెడతారు. పరిహారం ఊసెత్తకపోగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతారు.

రైతులను పీడిస్తారా..
ఏలూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న పార్టీ ముఖ్య నాయకులు

పోలవరం దగ్గర నుంచి అన్నింటా వైఫల్యం

వైసీపీ హయాంలో అన్ని రంగాలు నాశనం

అక్రమ కేసులకు భయపడేది లేదు

రైతు, ప్రజా వ్యతిరేక సమస్యలపై పోరాటం

వచ్చే నెలలో పోలవరానికి పార్టీ బృందం

సచివాలయాల ఎదుట ఇక నిరసనలు

అధికారంలోకి రానున్నది తెలుగుదేశమే

టీడీపీ సమన్వయ కమిటీలో కీలక నిర్ణయాలు


(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

‘గోదావరి జిల్లా రైతులు వ్యవసాయం మీదే ఆధారపడేవారు. వీరి వద్ద కొన్న ధాన్యానికి సొమ్ములు ఇవ్వరు. సాగు, తాగునీటికి అవసరమైన పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తారు. నిర్వాసితులను ముప్పుతిప్పలు పెడతారు. పరిహారం ఊసెత్తకపోగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతారు. అన్ని రంగాల్లోనూ ఈ సర్కారు విఫలమైంది. అందుకే దశల వారీ ఆందోళనలకు దిగుతాం, అందరి సత్తా చూపిస్తాం’ అని తెలుగుదేశం కరాఖండీగా తేల్చింది. ఇక సర్కారుపై తాడోపేడో తేల్చేందుకు సిద్ధమేనని ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఏలూరు కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి నేతలంతా హాజరయ్యారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు టీడీపీ హయాంలో 72 శాతానికి పైగా పనులు పూర్తికాగా, ఈ ప్రభుత్వ హయాంలో కేవలం రెండు శాతం మాత్రమే పనులు జరిగాయని, ఈ విషయంలో వైసీపీ సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్టుందని, రైతుల ఆశలను గాలికి వదిలేశారని నేతలు అభిప్రాయపడ్డారు. 

పోలవరం మీ వల్ల అయ్యిందా ?

‘పోలవరం గురించి సీఎం జగన్‌ ఎన్నో చెప్పారు. పనులను పూర్తి చేసి 2021 నాటికి నీళ్లు ఇస్తామన్నారు. అసెంబ్లీలోని బీరా లు పోయారు. ఇప్పుడు ఏమైంది ? పనులు ఎక్కడ ? పోలవరం గురించి ప్రశ్నిస్తే ఇరిగేషన్‌ మంత్రితో సహా అందరూ హేళన చేస్తూ మాట్లాడతారు. నిర్వాసితులను గాలికొదిలేశారు. మరో మంత్రి కన్నబాబు ఏకంగా వరి పండించవద్దంటారు. మెట్టలో మోటార్లకు మీటర్లు బిగిస్తారు. రైతును సర్వత్రా నిలువు దోపిడీకి ఈ ప్రభుత్వం తెగించింది’ అని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అధికారం తెలుగుదేశానిదేనని స్పష్టం చేశారు. 

కాలువ గట్లనూ వదల్లేదు 

 గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో సర్వీసు రోడ్లు వేసి రైతులను ఆదుకోవాలని మాజీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఇదే విషయం మరోసారి గుర్తు చేయబోతున్నారు. ఎత్తిపోతల పథకాల కాలువ గట్ల మట్టి దోపిడీ చేస్తారు. మంచినీటి సమస్యను గాలికొదిలేసి సత్యసాయి పథకాన్ని నీరుగార్చిన ప్రభుత్వమిది అంటూ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మరింత పొడిగించి రైతులను ఆదుకోవాల్సింది పోయి  లెక్కాపత్రం లేకుండా వ్యవహరిస్తున్నారు. రైతులకు పరిహారంగా చెల్లించాల్సిన సొమ్ము విషయంలోను ఇప్పటికీ ఒక స్పష్టత లేకపోగా అంతా గందరగోళమే. పార్టీ కార్యక్రమాలను మెరుగు పర్చుకోవాలి. సీఎం ఓడిపోవడం ఖాయం. చంద్రబాబు గెలుస్తారని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ అన్నారు. పోలవరం నత్తనడకన సాగడానికి ప్రభుత్వ వైఫల్యాలే కారణమని మరో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు దుయ్యబట్టారు.


అంతా రివర్స్‌ పాలనే : చింతమనేని

 రాష్ట్రంలో నడుస్తున్నది అంతా రివర్స్‌ పరిపాలనే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాడుచేయని రంగమంటూ ఏదీ మిగలలేదని మాజీ ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ విరుచుకుపడ్డారు. ఈ మూడేళ్లల్లో రాష్ట్రం సర్వ నాశనమైందని, 50 ఏళ్లు పనిచేసినా పక్క రాష్ట్రం (తెలంగాణ) స్థాయికి తీసుకువెళ్ళలేమని ఆవేదన వ్యక్తం చేశారు. మన మీద పెట్టే కేసులన్నీ మిగిలేవి కాదు.. కాని సీఎం జగన్‌పై ఉన్న కేసులు ఆయనను నిద్రపోనివ్వవని ఎద్దేవా చేశారు. ఎన్ని రోజులు గృహ నిర్బంధం చేస్తారో చేసుకోండి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలుపు ఖాయమని ప్రభాకర్‌ తేల్చి చెప్పారు.  సంక్షేమం నిర్వీర్యమైంది. అన్ని కార్పొరేషన్లు దివాళా తీశాయి. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన, అక్రమ అరెస్టులు తప్ప ఇంకేముంది. పోలవరం నీరుగార్చారు. ఇప్పటి నవరత్నాల కన్నా అప్పట్లో చంద్రబాబు రెండింతలు సంక్షేమం చేశారు. పార్టీ కేడర్‌ సమైక్యంగా కదలాలి, పోరాడాలని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు.


ప్రజల తరపున పోరాటం : జవహర్‌, గన్ని

 ప్రజల తరపున పోరాడాలి, అందుకు పార్టీ యంత్రాంగం యావత్తు సిద్ధంగా ఉండాలని రాజమహేంద్రవరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు జవహర్‌ పిలుపునిచ్చారు. భవిష్యత్‌ తరాలు నష్టపోకుండా అప్రమత్తం చేయాల్సిన తరుణమిది అన్నారు. పార్టీ కోసం నిరంతరం పనిచేయడానికి అందరూ సిద్ధమేనని, ఏ సమస్య వచ్చినా కలిసి మెలిసి సాగాలని, ఇందుకు కార్యాచరణ రూపొందించుకుంటే అమలు చేసి తీరాలని ఏలూరు పార్లమెంటరీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు.

 రైతు పక్షాన ఉద్యమించాల్సిందే. కక్షపూరిత పనులను అడ్డుకోవాలని ఎమ్మెల్సీ పాందువ్వ శ్రీను అన్నారు. ఎగువ మధ్యతరగతి, దళితులు టీడీపీవైపే ఉన్నారని ఏలూరు కన్వీ నర్‌ చంటి అన్నారు. సీఎం ఇంట్లో కూర్చొని సమస్యలు పరి ష్కరించలేరని మాజీ జడ్పీ చైర్మన్‌ జయరాజు పేర్కొనగా, తాడేపల్లిగూడెంలో ఎడాపెడా అవినీతి జరుగుతోందని,  ఇకపై జిల్లా పార్టీ పెద్దలంతా టిడ్కో ఇళ్ల దగ్గర నుంచి ఇతర కార్యక్రమాలను నియోజకవర్గాల్లో నిర్వహించాలని పార్టీ కన్వీనర్‌ వలవల బాబ్జీ పేర్కొంటూ సీఎం పథకాల వల్ల సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌ ఖాళీ అయిపోయిందని ఎద్దేవా చేశారు. పోలవరం లేకపోతే రెండో పంట కష్టమేనని నరసాపురం కన్వీనర్‌ రామరాజు పేర్కొనగా, పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని పోలవరం కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఏలూరు తెలుగు రైతు అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్‌ను గద్దె దించేందుకు అందరూ ప్రయత్నించాలని కోరగా, మరో రైతు అధ్యక్షుడు రాంప్రసాద్‌ రైతుల పట్ల ప్రభుత్వానికిది సవతి తల్లి ప్రేమని దుయ్యబట్టారు. సమావేశంలో పాలి ప్రసాద్‌, చందు, మహేష్‌ యాదవ్‌, గౌరి నాయుడు, జానీ, వేగి ప్రసాద్‌, సాయిబాబు, శీలం వెంకటేశ్వరరావు, గొర్రెల శ్రీధర్‌, మీరా సాహెబ్‌, మెంటే పార్ధసారధి, కోళ్ళ నాగేశ్వరరావు, నరసింహారావు, గాంధీ, ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పాల్గొన్నారు.


 తీర్మానాలివి :

 గోదావరి జిల్లాల రైతులపై కక్ష పూరిత పాలనపై ఉద్యమానికి సిద్ధం. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తి. ఈ మూడేళ్లల్లో ఒక్కపని ముందుకు సాగ లేదు. దీనికి నిరసనగా ఫిబ్రవరి మొదటి వారంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రతినిధులు ప్రాజెక్టు సందర్శనకు నిర్ణయం. నిర్వాసితుల పరిహారంలో వైఫల్యం కారణంగా వారు చేస్తున్న దీక్షలకు అండగా ఉందాం. జిల్లాలో ఐదుచోట్ల రైతు సదస్సుల నిర్వహించాలి.  రైతు సమస్యలపై వచ్చే నెలలో సచివాలయాల ఎదుట నిరసనలు. ధాన్యం బకాయిల దగ్గర నుంచి ఇతర సమస్యలపై వీలైనప్పుడల్లా నిరసనలు చేపట్టాలి. 


Updated Date - 2022-01-25T05:39:09+05:30 IST