వ్యాపారులకు అండగా..

ABN , First Publish Date - 2022-08-18T06:13:25+05:30 IST

వ్యాపారులకు అండగా..

వ్యాపారులకు అండగా..
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నారా లోకేశ్‌. చిత్రంలో బొండా ఉమా, బచ్చుల అర్జునుడు తదితరులు

వ్యాపారుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌

చంద్రబాబుది సమర్థత.. జగన్‌ది అసమర్థత..

అధికారంలోకి వస్తే భారాలన్నీ రద్దు చేస్తామని హామీ

వేలాదిగా తరలివచ్చిన వ్యాపారులు


వన్‌టౌన్‌, ఆగస్టు 17 : చిరు వ్యాపారులకు నిరంతరం టీడీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి  నారా లోకేశ్‌ అభయమిచ్చారు. టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ఏ-కన్వెన్షన్‌ హాల్లో వ్యాపారుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన లోకేశ్‌ వైసీపీ పాలనలో వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు. అనంత రం ఆయన వ్యాపారులను ఉద్దేశించి మాట్లాడారు. చేయూత, చేదోడు అంటూ మోసం చేస్తున్నారని, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆదరణ పథకాలను రద్దు చేశారని, వివిధ వర్గాలకు కార్పొరేషన్లను ఏర్పాటుచేసి హడావుడి చేశారే తప్ప, పైసా రుణం ఇవ్వలేదని, కనీసం చైర్మన్లకు కుర్చీలు కూడా లేవని మండిపడ్డారు. ఇసుకను దోచేస్తూ నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారన్నారు. కార్మికులు, కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులపై వివిధ పన్నుల రూపంలో మోపిన భారాన్ని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తుందని లోకేశ్‌ హామీ ఇచ్చారు. 

‘చెత్త’ ముఖ్యమంత్రి జగన్‌ : టీడీపీ నాయకులు

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో చిరువ్యాపారులకు స్వర్ణయుగంలా సాగిందన్నారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక చెత్త ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడని, ఎన్నడూ లేని విధంగా చెత్తపై పన్నువేసి ప్రజలపై భారం మోపాడన్నారు. వివిధ రకాల పన్నుల పేరుతో వ్యాపారులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో వ్యాపారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుది సమర్థ నాయకత్వం, జగన్‌ది అసమర్థ నాయకత్వమని రుజువైందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు కరెంట్‌ చార్జీలు పెంచలేదన్నారు. ఇప్పుడు కరెంటు చార్జీల మొదలు పన్నుల పేరుతో వ్యాపారులను ఎడాపెడా బాదేస్తున్నారన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మాట్లాడుతూ జగన్‌రెడ్డి వ్యవస్థలను నీరుగార్చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో వ్యాపారుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. పార్టీ అధికార ప్రతినిధి నాగుల్‌మీరా మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వచ్చాక వ్యాపారులు నష్టపోయారనడానికి ఉదాహరణ తానేనన్నారు. తనకు శక్తి వక్కపొడి వ్యాపారం ఉంటే, ఒకప్పుడు 500 మంది పనిచేసేవారని, ఇప్పుడు 200 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం పన్నులపై పన్నులు వేయడం వల్లే ఈ పరిస్థితి అని పేర్కొన్నారు. టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగన్‌రెడ్డి ప్రభుత్వంలో వ్యాపారులు వణికిపోతున్నారన్నారు. లోకేశ్‌ గోరును కూడా జగన్‌రెడ్డి కదల్చలేడని భావోద్వేగంగా అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకుల అంతు చూస్తామని, పగ తీర్చుకుంటామని, ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జగన్‌ భాగస్వామి అని ఆరోపించారు. టీడీపీ వాణిజ్య విభాగం నాయకుడు దువ్వాడ రామారావు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ఏనాడూ వ్యాపారులపై పన్నుల భారం లేదన్నారు. జగన్‌రెడ్డి అన్ని రకాల పన్నులు విధిస్తున్నాడన్నారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జగన్‌రెడ్డి అరాచక పాలనతో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయన్నారు. టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాపారులు  తరలిరావడంతో సమావేశ మందిరం కిక్కిరిసిపోయింది. కార్యకర్తల సహాయనిధికి గానూ గుంటూరు జిల్లాకు చెందిన హరికృష్ణ రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చారు. టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు ఆధ్వర్యంలో సమావేశానికి హాజరైన వారికి 5వేల వాటర్‌ బాటిళ్లను అందజేశారు. అనంతరం బాదుడే బాదుడు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, పి.అశోక్‌బాబు, వ్యాపారవేత్త భరత్‌, ఎమ్మెల్యే   గద్దె రామ్మోహన్‌, నెట్టెం రఘురాం తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-18T06:13:25+05:30 IST