టీడీపీకి ‘పేట’ ఎమ్మెల్యే రాజీనామా

ABN , First Publish Date - 2021-04-07T05:30:00+05:30 IST

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత..

టీడీపీకి ‘పేట’ ఎమ్మెల్యే రాజీనామా

కారెక్కిన ఆ ఒక్కడు!

సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక

టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనం కోరుతూ లేఖ

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రతో కలిసి స్పీకర్‌కు అందజేత

సభాపతి ఆమోదంతో ఇకపై అధికార పార్టీ ఎమ్మెల్యేగా వెంకటవీరయ్య 

నియోజకవర్గ అభివృద్ధి కోసమే గులాబీగూటికి : మెచ్చా


అశ్వారావుపేట(ఖమ్మం): రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీడీపీ మరో భారీ కుదుపునకు గురైంది. రాష్ట్రంలో ఉన్న ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మెచ్చా నాగేశ్వరరావు బుధవారం సైకిల్‌ దిగి కారెక్కారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం తెలుగుదేశం శాసనసభ పక్షాన్ని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలంటూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి లేఖ ఇవ్వడం, దాన్ని స్పీకర్‌ ఆమోదించడం వెంట వెంటనే జరిగాయి. దీంతో ఇన్నిరోజులు సాంకేతిక కారణాలతో అధికార పార్టీకి మద్దతుదారుడిగా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య కూడా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా అధికారికంగా గుర్తింపుపొందారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీకి భవిష్యత్‌ లేదని, అలాగే తన నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎంను కలసి తాను టీఆర్‌ఎస్‌లో చేరినట్టు ఆయన వివరించారు. ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికే మూడు సంవత్సరాలు కావొస్తోందని, ఇప్పటి వరకు తాను ఎలాంటి పనులు చేయలేకపోయాయని, ప్రజలకు మరింత సేవలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. సీఎం కేసీఆర్‌ కూడా రైతులు, గిరిజనుల అభ్యున్నతికి నిధులిస్తామని సీఎం హామీ ఇచ్చారని, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే ఆయన నేతృత్వంలో నడిచేందుకు గులాబీకండువా కప్పుకొన్నానన్నారు. అయితే ‘ప్రాణం ఉన్నంత వరకు టీడీపీని వీడను’ అని గతంలో అన్నారు కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్‌ లేదని అర్థమైందని, ఆ విషయాన్ని గుర్తించే పార్టీని వీడినట్టు తెలిపారు. 


క్రియాశీల కార్యకర్త నుంచి ఎదిగిన మెచ్చా..

టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీలో క్రియాశీల కార్యకర్తగా, నాయకుడిగా, ఆ తర్వాత తాటిసుబ్బన్నగూడెం సర్పంచ్‌గా పనిచేసిన మెచ్చా నాగేశ్వరరావు 2014లో అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుపై 13వేలకుపైగా మెజారిటీతో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తదనంతర పరిణామాలతో మెచ్చా టీడీపీని వీడతారని ప్రచారం జరిగినా.. ఆయన దాన్ని కొట్టిపారేశారు. అయినా మెచ్చా టీడీపీని వీడతారంటూ తరచూ ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం హఠాత్తుగా మెచ్చా గులాబీ కండువాకప్పుకోవడంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేయడమే కాకుండా.. టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌శాసనసభా పక్షంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు.


ఇదిలాఉంటే మెచ్చా టీఆర్‌ఎస్‌లో చేరడంలో నియోజకవర్గ రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ఇప్పటి వరకు వచ్చే ఎన్నికల్లో తమకే అవకాశం ఉంటుందని భావిస్తూ వచ్చిన టీఆర్‌ఎస్‌ నేతల భవిష్యత్‌ ఏంటా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జారే ఆదినారాయణ 2014 ఎన్నికలలో ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తాటి వెంకటేశ్వర్లు గెలుపొందారు. తదంతనర పరిణామాల్లో ఆయన వైసీపీనుంచి టీఆర్‌ఎస్‌లో చేరడంతో 2018 ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం తాటికే సీటు ఇచ్చింది. దీంతో ఆదినారాయణకు భంగపాటు తప్పలేదు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలుపొందారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తమకు సీటు వస్తుందనే ఆశతో జారె ఆదినారాయణ, తాటి వెంకటేశ్వర్లు ఉండి.. పోటాపోటీగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. అయితే బుధవారం జరిగిన రాజకీయ పరిణామాలతోవారిలో తీవ్ర నిరాశను నింపాయి. టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన మెచ్చా నాగేశ్వరరావుకే వచ్చే ఎన్నికల్లో సీటు ఖరారైందని ప్రచారం జరుగుతుండగా.. అదే జరిగితే ఇప్పటి వరకు అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితేంటా అన్న చర్చ జరుగుతోంది.


ఇక గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పనిచేసిన నేతలంతా ఒకే గూటిలో పనిచేసే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయా అనేది చర్చనీయాంశమైంది. అయితే మెచ్చా టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం వెనుక నియోజకవర్గ అభివృద్ధి అంశమే కాంకుడా.. ఆయనకు కేసీఆర్‌ కేబినేట్‌లో త్వరలో చోటు విషయంలో కూడా హామీ లభించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక టీఆర్‌ఎస్‌లో ఓ సీనియర్‌ నాయకుడు, మెచ్చ నాగేశ్వరరావు తన గురువుగా చెప్పుకొనే నాయకుడు కీలక పాత్ర పోషించారనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే నియోజకవర్గంలోనే కాక ఉమ్మడి జిల్లా రాజకీయ సమీకరణల్లో పెనుమార్పులు సంభవించే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


గెలిచిన పార్టీలకు కలిసిరాని నియోజకవర్గం..

అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన పార్టీలు ఆ తరువాత కనిపించకుండా పోయాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఏర్పాడిన అశ్వారావుపేట నుంచి తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా వగ్గెల మిత్రసేన గెలుపొందారు. ఆ తరువాత ఎన్నికలలో ఆ పార్టీ ప్రాభవం లేకుండా పోయింది. 2014లో తాటి వెంకటేశ్వర్లు వైసీపీ అభ్యర్థిగా గెలవగా.. ఆ తరువాత ఆయన పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో టీడీపీ అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావు గెలుపొందారు. ఆయన కూడా బుధవారం టీడీపీనీ వీడి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు.. వారు గెలిచిన పార్టీలను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం విశేషం. 




Updated Date - 2021-04-07T05:30:00+05:30 IST