వారిని ఎస్టీలుగా గుర్తించాలని అప్పుడే కేంద్రాన్ని కోరాం: కాల్వ శ్రీనివాసులు

Sep 19 2021 @ 17:45PM

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకి, బోయల ఎస్టీ హోదా సాధనకు దేశంలోని వాల్మీకి నాయకులు సహకరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు కోరారు. ఢిల్లీలోని మహారాష్ట్ర భవన్లో ఆదివారం జరిగిన అఖిల భారత వాల్మీకి ప్రతినిధుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దశాబ్దాల నుండి వాల్మీకి, బోయలు తమ న్యాయమైన ఎస్టీ హోదా సాధనకోసం నిరంతరం పోరాడుతున్న విషయాన్ని ఆయన సదస్సు దృష్టికి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో నాలుగేళ్ళ కిందటే చంద్రబాబు ప్రభుత్వం వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరిందన్నారు. అయితే ఇప్పటిదాకా కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. తమ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునేలా సదస్సులో పాల్గొన్న కేంద్రమంత్రి రాందాస్ అత్తవాలే చొరవ చూపాలని అభ్యర్థించారు.


ప్రాంతాల కతీతంగా వాల్మీకి నాయకులు సామాజిక వర్గ సమస్యలపై ఐక్యమత్యంగా పనిచేయాలని కాలవ శ్రీనివాసులు సూచించారు. అప్పుడే దేశవ్యాప్తంగా వాల్మీకుల్లో ఐకమత్యం సాధ్యపడుతుందన్నారు. జాతీయస్థాయిలో ఉన్నతస్థాయు కమిటీ ఏర్పాటు అవసరమని పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి వారసులమైనప్పటికి సామాజిక,ఆర్థిక, రాజకీయ రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాధికారంలో సముచిత భాగస్వామ్యం లభించినప్పుడే ఇతర రంగాల్లో రాణించే అవకాశాలుంటాయన్నారు. ఆ దిశగా దేశవ్యాప్తంగా వాల్మీకుల్లో చైతన్యానికి మఠాధిపతులు కూడా ఆశీర్వదించాలని కోరారు. భవిష్యత్తు కార్యక్రమాలకు తమవంతు సహకారముంటుందని పేర్కొన్నారు.


సదస్సులో మాట్లాడిన కేంద్రమంత్రి రాందాస్ అత్తవాలే దేశంలోని వాల్మీకుల సామాజిక హోదాలో అంతరాలుండడం విచారకరమన్నారు. ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని వాల్మీకులు ఎస్సి లేదా ఎస్టీ జాబితాలో లేకపోవడం వల్ల వారు రిజర్వేషన్లకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. వీరికి న్యాయం చేయడానికి తప్పక సహకరిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి,బోయలు త్వరలో తనను కలవాలని సూచించారు. సదస్సులో లోకసభ మాజీ డిప్యూటీ స్పీకర్ చరణ్ జిత్ అత్వాల్,  కర్ణాటక మాజీమంత్రి సతీష్ జర్కుహోళితో పాటు ఆంధ్ర,తెలంగాణల  నుండి బిజెపి జాతీయ బీసీ మోర్చా కార్యదర్శి డాక్టర్ పి.పార్థసారథి, వాల్మీకి జేఏసీ నాయకులు ప్రొఫెసర్ జగదీశ్వర రావు, పొగాకు రామచంద్ర, బి.వెంకట రమణ,డి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.