పరీక్షల రద్దుకు డెడ్‌లైన్‌

ABN , First Publish Date - 2021-04-23T10:12:48+05:30 IST

పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోవడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి 48గంటల డెడ్‌లైన్‌ విధించారు. లేనిపక్షంలో విద్యార్థులు,

పరీక్షల రద్దుకు డెడ్‌లైన్‌

48 గంటల్లో స్పందించకుంటే ఉద్యమం: లోకేశ్‌


అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోవడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి 48గంటల డెడ్‌లైన్‌ విధించారు. లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. పది, ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దుచేయాలని, ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఆయన ఆన్‌లైన్‌లో డిజిటల్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో విద్యార్థి సంఘనేతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో పిల్లల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం నిరాకరిస్తోందని లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘మొదటిదశతో పోలిస్తే రెండో దశలో చిన్నారులు, విద్యార్థులు ఎక్కువమంది కరోనా బారిన పడుతున్నారు. ‘రాష్ట్రంలో పాజిటివ్‌ రేటు 24శాతం ఉంది. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు జరిపి కోటి మంది విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, వారి కుటుంబాలను ప్రమాదంలో పడవేయడం అవసరమా’ అని ప్రశ్నించారు.


‘సచివాలయంలోనే జాగ్రత్తలు తీసుకోలేని వాళ్లు పరీక్షా కేంద్రాల్లో ఏం తీసుకుంటారు? అనేకచోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకుతోంది. కేంద్రం సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌సఈ పరీక్షలు రద్దుచేసింది. ఉద్యోగాల భర్తీ, ప్రవేశపరీక్షలు కూడా వాయిదా వేసింది. తెలంగాణ సహా 8 రాష్ట్రాలు బోర్డు పరీక్షలు రద్దుచేశాయి. మరో 8రాష్ట్రాలు వాయిదా వేశాయి. అన్ని రాష్ట్రాలు ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు వాయిదా వేశాయి. ఏ పరీక్షా వాయిదా వేసేది లేదని మూర్ఖంగా వ్యవహరిస్తోంది ఏపీ ప్రభుత్వం మాత్రమే’ అని అన్నారు. పరీక్షలు వద్దనుకొనేవారు 94441 90000 వాట్సాప్‌ నంబర్‌కు సీబీఈ 2021కు మెసేజ్‌ చేసి పరీక్షలు రద్దయ్యే వరకూ పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా, టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-04-23T10:12:48+05:30 IST