అధికారముందని విర్రవీగితే... గుణపాఠం చెప్పే శక్తి రాజ్యాంగం ఇచ్చింది: లోకేశ్‌

ABN , First Publish Date - 2022-01-27T08:35:10+05:30 IST

‘‘ప్రభుత్వాన్ని నడిపేవారికి అధికారం రాజ్యాంగం ప్రసాదించిన భిక్ష. అది మరచి ఆకాశం నుంచి దిగొచ్చినట్లుగా విర్రవీగుతూ స్వార్థం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారికి సరైన గుణపాఠం

అధికారముందని విర్రవీగితే... గుణపాఠం చెప్పే శక్తి రాజ్యాంగం ఇచ్చింది: లోకేశ్‌

అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వాన్ని నడిపేవారికి అధికారం రాజ్యాంగం ప్రసాదించిన భిక్ష. అది మరచి ఆకాశం నుంచి దిగొచ్చినట్లుగా విర్రవీగుతూ స్వార్థం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారికి సరైన గుణపాఠం చెప్పే శక్తిని కూడా ఇదే రాజ్యాంగం ఇచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాతల దార్శనికత అలాంటిది’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘రాజ్యాంగ పరిరక్షణ భారత పౌరులుగా మన బాధ్యత. ఆ బాధ్యతను సదా నిర్వహిస్తూ, ప్రజాస్వామ్యానికి అండగా ఉండేందుకు మనందరం కృషి చేద్దాం’’ అని పిలుపు ఇచ్చారు. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ భూశంకర్‌ ఏకంగా సీఎం జగన్‌రెడ్డిని కలవడాన్ని తప్పుపట్టారు. ‘‘యథా లీడర్‌ తథా కేడర్‌. పాలకులే నేరగాళ్లయితే వాళ్ల అనుచరులు పాల్పడే ఘోరాలకు అంతే ఉండదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ రైట్‌ హ్యాండ్‌ భూశంకర్‌ నిరూపించాడు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన భూశంకర్‌ లాంటి వైసీపీ బూచోళ్లు రాష్ట్రంలో ఊరికొకడున్నాడు. ఎన్ని నేరాలు చేసినా, తమ అధినేత జగన్‌రెడ్డి కాపాడతాడనే ధైర్యం వల్లే ఈ అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది’’ అని లోకేశ్‌ విమర్శించారు. కాగా, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నారా లోకేశ్‌ బుధవారం ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-01-27T08:35:10+05:30 IST