NDA Chandrababu: ఎన్డీఏలో టీడీపీ చేరబోతుందన్న ప్రచారంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-01T22:08:27+05:30 IST

నాలుగేళ్ల కిందట తెగతెంపులు చేసుకుని వెళ్లిన టీడీపీ (TDP)ని తిరిగి ఎన్‌డీఏ (NDA)లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..?

NDA Chandrababu: ఎన్డీఏలో టీడీపీ చేరబోతుందన్న ప్రచారంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అమరావతి: నాలుగేళ్ల కిందట తెగతెంపులు చేసుకుని వెళ్లిన టీడీపీ (TDP)ని తిరిగి ఎన్‌డీఏ (NDA)లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఆంధ్ర, తెలంగాణల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ (BJP) యోచిస్తోందా..? తాజా రాజకీయ పరిణామాలు వీటినే సూచిస్తున్నాయని రిపబ్లిక్‌ టీవీ చానల్‌ (Republic TV Channel)  ఓ కథనం ప్రసారం చేసింది. ఎన్డీఏలో టీడీపీ చేరబోతుందన్న ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అలా ప్రచారం చేస్తున్నవారే.. దానికి సమాధానం చెప్పాలన్నారు. ఈ విషయంపై తానే ఇప్పుడేం స్పందించనని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు ఎన్డీఏ నుంచి బయటకువచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. 


రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి గట్టి ఓటు బ్యాంకు ఉందని, తెలంగాణలో దానికి 10-20 శాతం ఓట్లు ఉన్నాయని, అందుచేత వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సానుకూలంగా ఉందని రిపబ్లిక్‌ టీవీ చానల్‌ వెల్లడించింది. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా ఇటీవల చంద్రబాబు ఢిల్లీ (Delhi)లో పర్యటించినప్పుడు ప్రధాని మోదీ (Prime Minister Modi)తో కరచాలనం చేసి.. ఐదు నిమిషాలు ముచ్చటించిన విషయాన్ని ప్రస్తావించింది. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థులకు టీడీపీ మద్దతిచ్చిందని.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చంద్రబాబు.. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారని గుర్తుచేసింది. ప్రత్యేక హోదాపై తెగతెంపులు.. ‘2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ తెగతెంపులు చేసుకున్నాయి. హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ టీడీపీ మోదీ కేబినెట్‌ నుంచి వైదొలగింది. ఇటు బీజేపీ కూడా ఆంధ్రలో చంద్రబాబు మంత్రివర్గానికి గుడ్‌బై చెప్పింది.


రాజకీయ అవకాశవాదానికి టీడీపీ పాల్పడిందని ఆరోపించింది. రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నం కావడానికి ప్రత్యేక హోదా ప్రధాన కారణమని.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఒత్తిడి కారణంగా హోదా డిమాండ్‌పై చంద్రబాబు పట్టుబట్టారు. కేంద్రం పట్టించుకోలేదు’ అని రిపబ్లిక్‌ తెలిపింది. పైగా కేంద్రానికి ఎక్కడి నుంచో నిధులు వచ్చిపడడం లేదని.. కేంద్ర నిధులపై ప్రతి రాష్ట్రానికీ సమాన హక్కు ఉంటుందని నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన వ్యాఖ్యలతో పరిస్థితులు తారుమారయ్యాయని పేర్కొంది. కాగా.. టీడీపీ ఎన్‌డీఏలో చేరే అవకాశముందని రెండ్రోజుల కిందట సీనియర్‌ జర్నలిస్టు కూమి కపూర్‌ కూడా ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాశారు.



Updated Date - 2022-09-01T22:08:27+05:30 IST