తిరుపతి ఉప ఎన్నికకు టీడీపీ సిద్ధం

ABN , First Publish Date - 2021-01-06T06:58:33+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడేలోగా ప్రజల్లోకి వెళ్ళడానికి అనుసరించాల్సిన వ్యూహాలను చంద్రబాబు ఖరారు చేశారు.

తిరుపతి ఉప ఎన్నికకు టీడీపీ సిద్ధం
తిరుపతి ఉప ఎన్నిక కార్యాచరణ పై చర్చిస్తున్న టీడీపీ నాయకులు





17న ఎన్నికల కార్యాలయం ప్రారంభం... బహిరంగసభ


18 నుంచీ పది రోజుల పాటు ప్రచార యాత్ర


ఫిబ్రవరి 9 నుంచీ మూడు రోజులు ర్యాలీలు, బైక్‌ ర్యాలీలు


పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

     తిరుపతి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): తిరుపతి ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడేలోగా ప్రజల్లోకి వెళ్ళడానికి అనుసరించాల్సిన వ్యూహాలను చంద్రబాబు ఖరారు చేశారు. విజయవాడలో మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరనాధరెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటు కమిటీల అధ్యక్షులు నరసింహయాదవ్‌, పులివర్తి నాని, శ్రీనివాసులురెడ్డి తదితరులతో సమావేశమయ్యారు.ఈ నెల 17వ తేదీన తిరుపతిలో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు ఎన్టీఆర్‌ కూడలిలో సభ కూడా నిర్వహించనున్నారు. మరుసటి రోజు నుంచీ వరుసగా పది రోజుల పాటు  పార్లమెంటు నియోజకవర్గమంతటా విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ ప్రచార యాత్రకు ఇంకా పేరు ఖరారు కానప్పటికీ ధర్మ ప్రచార యాత్ర లేదా ఆత్మగౌరవ యాత్ర అన్న పేర్లలో ఒకటి నిర్ణయించే అవకాశముంది. వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల గురించి ప్రజల్లోకి పెద్దఎత్తున తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. 9వ తేదీ నుంచీ మూడు రోజుల పాటు ర్యాలీలు, బైక్‌ ర్యాలీలు విస్తృతంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడ్డాక నారా లోకేష్‌ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా నిర్ణయించారు. తిరుపతి ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచితీరాలన్న లక్ష్యంతో పనిచేయాలని చంద్రబాబు నేతల్ని ఆదేశించారు.


అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ కమిటీలు ఖరారు

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఉప ఎన్నికల ప్రచార తదితర బాధ్యతలు చూసేందుకు, కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు కమిటీల ఏర్పాటు కూడా దాదాపు ఖరారైంది. ప్రాధమిక సమాచారం మేరకు తిరుపతి సెగ్మెంట్‌ కీలకం కనుక ఎంపీ గల్లా జయదేవ్‌, నల్లారి కిషోర్‌, బత్యాల చంగల్రాయలు తదితరులకు బాధ్యత అప్పగించనున్నారు.శ్రీకాళహస్తి సెగ్మెంట్‌కు ఎమ్మెల్యే రామానాయుడు, రాజంపేట టీడీపీ అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డిలను, సత్యవేడు సెగ్మెంట్‌కు ఆదిరెడ్డి వాసు, గౌనివారి శ్రీనివాసులు, గాలి భానుప్రకాష్‌, గూడూరుకు మాజీ మంత్రి అమరనాధరెడ్డి, పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి, వెంకటగిరికి రాఘవేంద్రరెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, సర్వేపల్లెకు లక్ష్మయ్య నాయుడు, నరహరిప్రసాద్‌లను నియమించగా సూళ్ళూరుపేటకు బీసీ జనార్దన రెడ్డి తదితరులు బాధ్యులుగా నియమితులైనట్టు తెలిసింది.


Updated Date - 2021-01-06T06:58:33+05:30 IST