‘గీతం’ కూల్చివేత కక్షసాధింపే

ABN , First Publish Date - 2020-10-25T08:08:31+05:30 IST

విశాఖలోని గీతం విశ్వ విద్యాలయంపై దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించడం ప్రభుత్వ టెర్రరిజానికి నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి,

‘గీతం’ కూల్చివేత కక్షసాధింపే

ఇది ప్రభుత్వ టెర్రరిజానికి నిదర్శనం: చంద్రబాబు


అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): విశాఖలోని గీతం విశ్వ విద్యాలయంపై దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించడం ప్రభుత్వ టెర్రరిజానికి నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. ట్విటర్‌లో శనివారం దీనిపై స్పందించారు. ‘ఈ రాష్ట్రంలో ప్రభుత్వ టెర్రరిజం ఉందని ముద్ర పడటంతో ఇప్పటికే విద్యా వైద్య పారిశ్రామిక సంస్థలు ఏపీకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ రాష్ట్రాన్ని దక్షిణాది బిహార్‌ అని పిలుస్తూ అనేక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ప్రభుత్వ వైఖరికి గీతం సంఘటన మరోసారి అద్దం పట్టింది. అత్యున్నత విద్యా సంస్థ ‘గీతం’ కూల్చివేతను ఖండిస్తున్నాను. కోర్టులో ఉన్న వివాదంపై ఏ ఆదేశాలు రాకముందే కూల్చి వేయడం వైసీపీ కక్ష సాధింపునకు నిదర్శనం. ప్రతిష్టాత్మక విద్యాసంస్థపై ఇటువంటి విధ్వంసానికి దిగడం రాష్ట్ర ప్రగతికి చేటు. మొన్న మాజీ మేయర్‌ సబ్బం హరి ఇంటిపై దాడి చేశారు. ఇప్పుడు గీతంపై పడ్డారు. రాజకీయ కక్ష సాధింపులకు ఇది ప్రత్యక్ష నిదర్శనం’ అని చంద్రబాబు విమర్శించారు. కట్టడం చేతగాని వాళ్లకు కూల్చే హక్కు లేదు.. రాష్ట్రానికి... ఉత్తరాంధ్రకు గర్వకారణమైన గీతం సంస్థలపై  దాడి తుగ్లక్‌ చర్య అని పేర్కొన్నారు. కాగా, నెల్లూరు జిల్లాలో దళిత రైతు గాలి జైపాల్‌పై పోలీసు వేధింపులను చంద్రబాబు మరో ట్వీట్‌లో ఖండించారు. ‘జైపాల్‌కు ఉన్నది మూడు ఎకరాలు. పద్దెనిమిది ఎకరాలు లీజుకు తీసుకొని ఏభై పుట్ల ధాన్యం విక్రయించినట్లు పౌర సరఫరాల వెబ్‌సైట్‌లో ఎలా నమోదైంది? దీనిపై చర్యలు తీసుకోవాలని కోరిన దళిత రైతును అభినందించాల్సిందిపోయి ఈడ్చుకెళ్లి పోలీసు జీపులో పడేస్తారా? జైపాల్‌ పేరుతో దళారులు సొమ్ము చేసుకొంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకొంది. దళారుల అక్రమాలను కప్పిపెట్టడానికి దళిత రైతును వేధించడం దుర్మార్గం. రైతును వేధించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలి’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-10-25T08:08:31+05:30 IST