జగన్.. తస్మాత్ జాగ్రత్త: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-23T01:43:09+05:30 IST

సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో

జగన్.. తస్మాత్ జాగ్రత్త: చంద్రబాబు

అమరావతి: టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముప్పై ఆరు గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీక్ష ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో రోజులు ఇలానే ఉండవని, జగన్ తస్మాత్‌ జాగ్రత్త అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటివరకు తాను మూడుసార్లు నిరాహార దీక్ష చేశానన్నారు. పార్టీ కార్యాలయంపై వైసీపీ ఉగ్రవాద దాడి చేసిందన్నారు. డీజీపీ ఆఫీస్, సీఎం ఇల్లు, బెటాలియన్ దగ్గర్లోనే ఉన్నాయన్నారు. 


ఏపీ నుంచే గంజాయి సరఫరా

ఏపీ నుంచే వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోందని చంద్రబాబు ఆరోపించారు. గుజరాత్‌లో హెరాయిన్ డంప్ పట్టుకున్నారని, దీనికి ఏపీకి లింకులున్నాయన్నారు. ఇంతటి పెద్దఎత్తున మత్తు మందులు సరఫరా జరుగుతోంటే ప్రభుత్వం అలెర్ట్ కావద్దా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ నేతలపై దాడులు జరిగితే సహించామన్నారు. కానీ డ్రగ్స్ వల్ల పిల్లల భవిష్యత్ పాడవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే డ్రగ్స్‌పై టీడీపీ పోరాటం మొదలుపెట్టిందన్నారు. పోరాటానికి  ప్రజల నుంచి సహకారం వచ్చిందని, కానీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. సీఎంకు భయపడి అందరూ సరెండర్ అవ్వాలా అని ఆయన ప్రశ్నించారు. 




 ఏ సీఎం అయినా మద్యం వ్యాపారం చేసారా?


ఇంత మంది సీఎంలు వచ్చారు,  ఏ సీఎం అయినా మద్యం వ్యాపారం చేయడానికి సాహసించారా అని ఆయన నిలదీశారు. దొంగ సారా వ్యాపారంతో డబ్బులు గుంజుతున్నారని ఆయన ఆరోపించారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్, మద్యం ఆదాయాన్ని 25 ఏళ్లు తాకట్టు పెట్టారన్నారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం ఆడబిడ్డల తాళిబొట్లని తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. మద్యపానం నిషేధం పేరుతో రేట్లు పెంచేశారన్నారు. మద్యం ధరలు పెంచితే మద్యపానం తగ్గుతుందా అని ఆయన నిలదీసారు. పక్క రాష్ట్రానికి పోయి మద్యం తెస్తున్నారన్నారు. శానిటైజర్లు తాగేస్తున్నారన్నారు. మద్యం ధరలు పెరగడం వల్ల తక్కువ ధరకు లభించే గంజాయికి అలవాటు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

 డ్రగ్స్‌, గంజాయి గురించి ఆనందబాబు మాట్లాడితే నోటీసులిచ్చారని ఆయన అన్నారు. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు సీఎం జగనుకు సమీక్ష జరిపే సమయం కూడా లేదా అని ఆయన ప్రశ్నించారు. "మేం ఆధారాలిస్తాం.. పోలీసులు చొక్కాలిప్పేయండి.. ఆ ఇన్వేస్టిగేషన్ మేమే చేస్తాం" అని ఆయన పేర్కొన్నారు. 


బూతులు మాట్లాడుతున్నారు..

ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసానికి తెరలేపారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఫేక్‌ రిపోర్ట్‌లు తయారు చేయడంలో జగన్‌రెడ్డి సిద్ధహస్తుడని ఆయన ఆరోపించారు. తనకు బూతులు రావని, తెలియవని, ఏమైనా ఉంటే గట్టిగా మాట్లాడుతానని ఆయన పేర్కొన్నారు. నీ చెల్లెలికి న్యాయం చేయలేని నువ్వు తన గురించి మాట్లాడే అర్హత లేదని చంద్రబాబు అన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజా సేవలో వెనక్కి తగ్గమని చంద్రబాబు స్పష్టం చేసారు. నీవు చరిత్ర తెలియకుండా ఆలోచిస్తున్నావని చంద్రబాబు అన్నారు. తాను ఇప్పటి వరకు పట్టాభి వాడిన పదమే వినలేదని, తనకు బూతులు రావన్నారు. అలాంటి పదానికి ఏదో అర్థం వెతికి, రీసెర్చ్ చేసి తల్లిని కూడా లాక్కొచ్చారని ఆయన తెలిపారు. తల్లి మీద జగన్‌కు ఎంత మమకారమో అని ఆయన ఎద్దేవా చేసారు. 

జగన్ జైలుకెళ్తే తల్లిని ఉపయోగించుకుని ఊరూరా తిప్పావని, తర్వాత చెల్లిని పెట్టి జగనన్న బాణం అన్నాడని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆ బాణం తెలంగాణలో తిరుగుతోందని ఆయన అన్నారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్, నీవు నాకు నీతులు చెబుతావా అని ఆయన ప్రశ్నించారు. 




నేను చేసేది  ధర్మయుద్దం

తాను చేసేది ధర్మయుద్దమని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తల గురించి జగనుకు ఏమీ తెలీయదని ఆయన హెచ్చరించారు. తప్పుడు కేసులతో వేధిస్తే చూస్తూ ఊరుకోమని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఊరుకోమని చంద్రబాబు హెచ్చరించారు. 

నా సంకల్పం ఉక్కు సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేసారు. ధర్మపోరాటం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయన్నారు. పోలీసులు చేయకూడని తప్పులు చేస్తున్నారని ఆయన అన్నారు. రోజులు ఇలానే ఉండవని, తస్మాత్‌ జాగ్రత్త అని చంద్రబాబు పేర్కొన్నారు. 




Updated Date - 2021-10-23T01:43:09+05:30 IST