కొవిడ్‌ బాధితులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-06-22T07:04:15+05:30 IST

కొవిడ్‌ బారిన పడి అనేక విధాలుగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

కొవిడ్‌ బాధితులను ఆదుకోవాలి
కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చి బయటకు వచ్చిన అనంతరం ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలి 

టీడీపీ నేతల డిమాండ్‌

కలెక్టర్‌కు వినతిపత్రం 

వైరస్‌ నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శ 

ఒంగోలు (కలెక్టరేట్‌), జూన్‌ 21 : కొవిడ్‌ బారిన పడి అనేక విధాలుగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.10వేలు ఆర్థిక సహాయం అందించాలన్నారు. వైరస్‌ తీవ్రత కొనసాగినంత కాలం నెలకు రూ 7500 ఇవ్వాలని కోరారు. ఈమేరకు టీడీపీకి చెందిన ముఖ్యనేతలంతా సోమవారం కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి వినపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద కొద్దిసేపు నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వైరస్‌ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఏడాదిన్నర నుంచి రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకొని ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రమాదాన్ని అంచనా వేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. వైరస్‌ విస్తృతి కారణంగా ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే విషయంలోనూ వెనుకడుగు వేసిందని దుయ్యబట్టారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ కరోనా కాలంలో ఇబ్బందులు పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంతోపాటు, పెండింగ్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌ రెడ్డి, దర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పమిడి రమేష్‌, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎరిక్షన్‌బాబు, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొండ్రగుంట వెంకయ్య, చుండి శ్యాం, కొఠారి నాగేశ్వరరావు, కుసుమకుమారి, రావుల పద్మజ,  పసుపులేటి సునీత, దాయనేని ధర్మ, నావూరి కుమార్‌, గుర్రాల రాజ్‌విమల్‌, పాతూరి పుల్లయ్యచౌదరి, ఎద్దుశశికాంత్‌ భూషణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T07:04:15+05:30 IST