ఆర్టీసి చార్జీల పెంపుపై టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2022-07-03T05:43:06+05:30 IST

ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ శనివారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.

ఆర్టీసి చార్జీల పెంపుపై టీడీపీ నిరసన
వెంకటాచలం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు

కందుకూరు, జూలై 2:  ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ శనివారం సాయంత్రం  స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ నమ్మి ఓట్లేసిన నిరుపేదల నడ్డిని సీఎం జగన్మోహన్‌రెడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఆర్టీసి చార్జీలను నెలలోనే రెండుసార్లు పెంచి పేదలంటే తనకు ఉన్న ప్రేమ ఎలాంటిదో  నిరూపించుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక్కసారి ఆర్టీసి చార్జీలు పెంచితే అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ నానారాద్ధాంతం చేశారన్నారు. అమరావతిని పాడుపెట్టిన జగన్‌ రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేయటమే గాక ప్రస్తుతం ఆ భూములను అమ్మాలని ప్రయత్నిస్తుండటం దుర్మార్గమన్నారు.  పేదలు  జగన్‌ను సాగనంపేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. ఆందోళనలో టీడీపీ నాయకులు జి. మోషే, దామా మల్లేశ్వరరావు, ఎన్‌వి సుబ్బారావు, చిలకపాటి మధు, ఎన్‌. రమణయ్య, సలాం, రఫీ, కలవకూరి యానాది, రెబ్బవరపు మాల్యాద్రి, శిఖామణి, ఆదెమ్మ, శైలజ, మాదాల మాల్యాద్రి పాల్గొన్నారు.

వెంకటాచల : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలపై టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. అనంతరం ఆపార్టీ మండలాధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్‌ మాట్లాడుతూ ఇప్పటికే రెండు సార్లు పెంచిన చార్జీల భారంతో ప్రజలు సతమతమవుతున్నారన్నారు. జగన్‌రెడ్డి మోసాలకు పెరిగిన ఆర్టీసీ చార్జీలే నిదర్శనమన్నారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని  డిమాండ్‌  చేశారు. కార్యక్రమంలో వల్లూరు రమేష్‌ నాయుడు, దొడ్ల అశోక్‌, పఠాన్‌ఖయ్యూమ్‌ఖాన్‌, ఎం. రాజేష్‌, యాకల రవి, శ్రీకాంత్‌ నాయుడు, పాలెపు మణి, సండి రమణయ్య, డి.లక్ష్మమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T05:43:06+05:30 IST