వైసీపీ ప్రభుత్వంలో జనం జేబులు గుల్ల

ABN , First Publish Date - 2021-07-27T04:10:02+05:30 IST

రెండేళ్ల జగన్‌ సర్కారు ఎడాపెడా పన్నులు, నిత్యావసర ధరలు పెంచుతూ జనం జేబులు గుల్లచేస్తోందని తెలుగు మహిళ గుంటూరు పార్లమెంటు అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వంలో జనం జేబులు గుల్ల
ఖాళీ సిలిండర్‌, కట్టెలతో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు

గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు  తగ్గించాలి

తెలుగు మహిళా నేత అన్నాబత్తుని జయలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన

గుంటూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల జగన్‌ సర్కారు ఎడాపెడా పన్నులు, నిత్యావసర ధరలు పెంచుతూ జనం జేబులు గుల్లచేస్తోందని తెలుగు మహిళ గుంటూరు పార్లమెంటు అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి  విమర్శించారు. సోమవారం  కాలినడకన లాడ్జిసెంటర్‌ వరకు ఖాళీ గ్యాస్‌ సిలిండర్లు, కట్టెలతో వెళుతున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ కార్యాలయం ఎదుటే నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ సీఎం జగన్‌  రెండేళ్ల పాలనలో 2.50 లక్షల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు. కరోనా కారణంగా దాదాపు 70శాతం మంది ప్రజలు ఉపాధి కోల్పోగా, వారి దుస్థితిని గమనించి ధరలు తగ్గించాల్సిన ప్రభుత్వమే రోజురోజుకు పెంచుతూ బాధ్యతా రాహిత్యంగా పనిచేస్తుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచడమేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 24లక్షల మంది అక్కాచెల్లెళ్లకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల సమస్యలపై, కష్టాలపై పెడితే రాష్ట్రం సుభిక్షంలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి షేక్‌ రిజ్వానా, మహిళా నేతలు పూల విజయలక్ష్మి, మల్లె విజయ, పానకాల వెంకట మహాలక్ష్మి, దాసరి జ్యోతి, చీదెళ్ల మల్లిక, నేపాక పద్మావతి, మల్లినేని రుక్మిణి, షేక్‌ రహమతున్నీసా బేగం, యడ్లపాటి రమాదేవి, కొప్పురావూరి సావిత్రి, సుమతి, శశిసుధ, శైలజ, పేరం అనిత, హారిక, ఉన్నం అనురాఽధ, టీడీపీ నాయకులు పిల్లిమాణిక్యరావు, మానుకొండ శివప్రసాద్‌, కనపర్తి శ్రీనివాసరావు, పోతినేని శ్రీనివాసరావు, రావిపాటి సాయికృష్ణ, ఈరంకి వరప్రసాద్‌, కసుకుర్తి హనుమంతరావు, గుడిమెట్ల దయారత్నం, జిన్నాటవర్‌ సుభాని తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T04:10:02+05:30 IST