32 నెలలు... 33 మంది హత్య

Jan 14 2022 @ 03:21AM

  • హత్యకు గురైన నేతల, కార్యకర్తల జాబితా ఇది: టీడీపీ

అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): గత 32 నెలల్లో రాష్ట్రంలో 33 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఆ పార్టీ రూపొందించిన జాబితా ఈ విషయం వెల్లడించింది. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేత తోట చంద్రయ్య దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఆ పార్టీ ఈ హత్యల వివరాలు వెల్లడించింది. ఇందులో బలహీన వర్గాలకు చెందినవారే 20 మంది వరకూ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాలవారీగా చూసినప్పుడు ఎక్కువ హత్యలు గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలోనే జరిగాయి. వైసీపీ  అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పల్నాడులోని దాచేపల్లి మండలం తంగెడ లో బత్తుల సుబ్బులు అనే బీసీ మహిళా కార్యకర్త హత్యకు గురయ్యారు. అదే మండలం భట్రుపాలెంలో తేజావత్‌ రాజు నాయక్‌, తంగెడలో సయ్యద్‌ జాన్‌, గురజాల మండలం పాత అంబాపురంలో దోమతోటి విక్రమ్‌, దాచేపల్లి మండలం నారాయణపురంలో తమ్మిశెట్టి నీలకంఠ బాబు, అదే మండలంలో కాపు సామాజిక వర్గ నేత, మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు, దుర్గి మండలం జంగ మహేశ్వరపాడులో నరెద్దుల కోటయ్య, మాచవరం మండలం పిన్నెల్లిలో ఖాదర్‌ భాషా హత్యకు గురయ్యారు.


2019లో ఎన్నికలకు ముందు నుంచి అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తల హత్యల పరంపర మొదలైంది. ధర్మవరంలో చేనేత కార్మికుడు చంద్రశేఖర్‌, తాడిపత్రి మండలం వీరాపురంలో చింతా భాస్కరరెడ్డి, బత్తులపల్లి మండలం పత్యాపురంలో రాజప్ప, అనంతపురం రూరల్‌ మండలం భైరవ నగర్‌లో ఆదినారాయణ, రాయదుర్గం మండలం మలకాపురంలో గొల్ల గోపాల్‌ హత్యకు గురయ్యారు. ప్రకాశం జిల్లాలో చిన గంజాం మండలం రుద్రమాంబపురంలో మత్స్యకార మహిళను వివస్త్రను చేసి వేధించి ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించారు. ఇదే జిల్లా బల్లికురవ మండలం కొత్తూరులో అర్జున్‌ నాయక్‌, సంతమాగులూరు మండలం కామేపల్లిలో లక్కపోగు సుబ్బారావు హత్యకు గురయ్యారు.


గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఉమా యాదవ్‌, నెల్లూరు జిల్లా మినగల్లుకు చెందిన చిట్టిబోయిన వెంగయ్య, కృష్ణా జిల్లా జి. కొండూరు మండలం గొల్లల మందలో పాలకొల్లు సోమయ్య, ఇదే జిల్లాలో గరికపాటి కృష్ణారావు, నాగాయలంక మండలం పర్రచివరలో తాతా సాంబయ్య, కర్నూలు జిల్లా చింతాళంలో మంజుల వడ్డె సుబ్బారావు, నిడ్డూరులో శ్రీనివాసులు, పెసరవాయిలో మాజీ సర్పంచి వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప రెడ్డి, విజయనగరం జిల్లా బలిజపేట మండలం పెద పెంకి లో దత్తి వెంకటరావు, చిత్తూరు జిల్లా తొట్టెంబేడులో మేలుపాక గోపి, తిరుపతి నగరంలో భరత్‌ యాదవ్‌, కడప జిల్లా కాశినాయన మండలం నరసాపురంలో గురప్ప, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం మండపంలో ఊట్కూరి వీరబాబు, జగ్గంపేట మండలం గొల్లలగుంటలో పీ శ్రీనివాస రెడ్డి హత్యకు గురైన వారిలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.