Advertisement

టీడీపీ సోషల్‌ మీడియా ప్రతినిధి అరెస్టు

Mar 7 2021 @ 00:16AM
పోలీసులు విడుదల చేసిన అనంతరం ప్రత్తిపాటి నివాసంలో మాట్లాడుతున్న టీడీపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి పిల్లి కోటి

టీడీపీ నేతల ఆందోళనతో విడుదల

సీఐ, ఎస్‌ఐ వేధిస్తున్నారంటూ బాధితుడి ఫిర్యాదు 

చిలకలూరిపేట, మార్చి 6: సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి జగన్‌పై పోస్టు పెట్టాడనే కారణంతో టీడీపీ సోషల్‌ మీడియా చిలకలూరిపేట ఇన్‌ఛార్జి పిల్లి కోటిని అర్బన్‌ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో తూర్పు దళితవాడలోని అతని ఇంటి వద్ద అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఉదయాన్నే న్యాయవాదితో కలిసి వస్తామని గర్భిణి అయిన కోటి భార్య చెప్పినా వినకుండా అరగంటలోనే పంపిస్తామని చెప్పి కోటిని తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పందించి మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, తెలుగుయువత నాయకులు బండారు వంశీకృష్ణ, లీగల్‌సెల్‌ అడ్వకేట్‌ మాగులూరు హరిబాబును చిలకలూరిపేట వెళ్లి కోటికి న్యాయసహాయం అందించాలని ఆదేశించారు. శనివారం ఉదయం 10:30 గంటల సమయంలో చిలకలూరిపేట పోలీస్‌ స్టేషన్‌కు టీడీపీ బృందం చేరుకుంది. అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌ ముందు నిరసన వ్యక్తం చేసి పోలీసులు, ప్రభుత్వ చర్యలను ఖండించారు. టీడీపీ నాయకులను పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి కోటిని పంపించవలసినదిగా ఆదేశించడంతో పోలీసులు అతనిని విడుదల చేశారు. 


సీఐ, ఎస్‌ఐలు బెదిరించారు..


అనంతరం ప్రత్తిపాటి నివాసానికి చేరుకున్న పిల్లి కోటి విలేకరులతో మాట్లాడారు. అర్థరాత్రి తన ఇంటిని చుట్టుముట్టి పోలీసులు తీసుకువచ్చారన్నారు. అర్బన్‌ సీఐ బిలాలుద్దీన్‌, సీఐ షఫిలు... దళితుడివి నీకు రాజకీయాలెందుకు అంటూ దూషించారని వాపోయాడు. ఇప్పటికి మూడుసార్లు తనను స్టేషన్‌కు పిలిపించారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


పోలీసుల అరాచకాలకు ప్రజలు విలవిల: ప్రత్తిపాటి


పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ గతంలో సూర్యనారాయణ సీఐగా ఉన్నప్పుడు కూడా పోలీసులు పిల్లి కోటిని అనేకరకాలుగా హింసించారన్నారు. సీఐ, ఎస్‌ఐ చేసే దుర్మార్గాలు, అరాచకాలకు ప్రజలు అల్లాడుతున్నారన్నారు. అధికారపార్టీని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు వెనుకేసుకున్నారని ఆరోపించారు.  స్థానిక ఎమ్మెల్యే ఏది చెబితే అదే చేస్తున్నారన్నారు. సీఐ, ఎస్‌ఐల అరాచకాలపై ఎస్పీ, డీఐజీ, డీజీపీ, కలెక్టర్‌, ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళతామన్నారు. మానవహక్కులసంఘం, ఎస్సీ, ఎస్టీ కేంద్ర కమిటీ దృష్టికి కూడా పిల్లి కోటిపై వేధింపుల విషయాన్ని తీసుకెళతామన్నారు. గణపవరంలో తమ పార్టీ అభ్యర్థి అయిన వృద్ధుడిని నీకెందుకు రాజకీయాలు అంటూ సీఐ, ఎస్‌ఐలు బెదిరిస్తున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ దళితులను అణచివేయడం ద్వారా మిగతా ఓటర్లను ప్రభావితం చేయొచ్చనే దురుద్ధేశంతో అర్థరాత్రి  కోటిని స్టేషన్‌కు తీసుకువెళ్లి హింసించారన్నారు. దళితులపై కుటిల రాజకీయాలు చేయొద్దన్నారు. సమావేశంలో పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి పఠాన్‌ సమద్‌ఖాన్‌, జరీనాసుల్లానా, ఈవూరి బ్రహ్మానందం, బండారుపల్లి సత్యనారాయణ, ఎస్‌ఏఎన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.