ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండ

ABN , First Publish Date - 2021-03-01T08:49:08+05:30 IST

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యకాండకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండ

పోలీసులు, ఎన్నికల సంఘం ప్రేక్షక ప్రాత: అచ్చెన్న 


విశాఖపట్నం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యకాండకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆదివారం విశాఖలో మాట్లాడుతూ, విపక్షాలను.. ముఖ్యంగా టీడీపీ తరఫు అభ్యర్థులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత మేయర్‌, చైర్మన్‌ పదవులను కైవసం చేసుకోడానికి కార్పొరేటర్లు/కౌన్సిలర్లు చేజారిపోకుండా ఆయా పార్టీలు శిబిరాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణమని, కా నీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాపాడుకోవడానికి శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన దుస్థితిని అధికార పార్టీ తీసుకువచ్చిందన్నారు. ఒక పార్టీ తరఫున పోటీ చేయడానికి బీ ఫారం ఇచ్చిన వ్య క్తులను బెదిరించి, బలవంతంగా వైసీపీ కండువా వేసి నామినేషన్‌ ఉపసంహరణకు ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఇక, ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. లొంగని అభ్యర్థుల ఆస్తులు, వ్యాపారాలను టార్గెట్‌ చేస్తున్నారన్నారు.  పట్టణ ఓటర్లు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని గుర్తించిన వైసీపీ నాయకులు.. విపక్షాల అభ్యర్థులను భయపెట్టి,  తప్పుకునేలా చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ బెదిరింపులకు ఓటర్లు మాత్రం భయపడరన్నారు. రాష్ట్రంలో భయాందోళనకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ పోలీసులు, ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర వహించడం దారుణమని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. 

Updated Date - 2021-03-01T08:49:08+05:30 IST