దర్శిలో టీడీపీ జయకేతనం

ABN , First Publish Date - 2021-11-18T05:53:57+05:30 IST

దర్శి నగర పంచాయతీలో 20 వార్డులుండగా ఒకటి ఏకగ్రీవమైంది. మిగిలిన 19 వార్డులకు సోమవారం పోలింగ్‌ నిర్వహించారు. బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. 13 వార్డుల్లో టీడీపీ, ఆరుచోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా గెలుచుకున్న వార్డుతో కలిపి వైసీపీ బలం ఏడుకు చేరింది. 13వార్డుల్లో గెలుపు ద్వారా నగర పంచాయతీ పాలక మండలి టీడీపీ వశమైంది.

దర్శిలో టీడీపీ జయకేతనం
దర్శినగర పంచాయతీలో గెలుపొందిన అభ్యర్థులతో టీడీపీ నేతలు

 నగర పంచాయతీ ఎన్నికల్లో

13 వార్డులు కైవసం

ఏడింటికే పరిమితమైన వైసీపీ

టీడీపీకి కలిసొచ్చిన 

నారపుశెట్టి కుటుంబం, నేతల ఐక్యత

ఫలించని ఎమ్మెల్యే మద్దిశెట్టి ఒంటరిపోరు

దెబ్బతీసిన అతి ధీమా 

స్వపక్షంలోని వారే వెన్నుపోటు 

పొడిచారని ఫిర్యాదు

 ఆంధ్రజ్యోతి, ఒంగోలు


దర్శి నగరపంచాయతీకి జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. అతి ధీమాతో ముందుకు సాగిన వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 20 వార్డుల్లో 13 కైవసం చేసుకున్న టీడీపీకి బీసీలకు రిజర్వు అయిన ఆరు వార్డుల్లోనూ విజయం దక్కింది. దళితులకు రిజర్వు అయిన మూడింటిలో రెంటింటిని చేజిక్కించుకుంది. ఆపార్టీ తరఫున రంగంలోని దిగిన కాపు సామాజికవర్గం వారు అత్యధిక వార్డుల్లో గెలుపొందారు. వైసీపీ నుంచి విజయం సాధించిన ఏడుగురిలో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గం వారే. జిల్లాలో కొంతకాలంగా ప్రజాసమస్యలపై టీడీపీ నాయకులు సాగిస్తున్న పోరాటం, వారిలో నెలకొన్న ఐక్యత కలిసొచ్చింది. ప్రధానంగా స్థానికంగా నారపుశెట్టి కుటుంబం పట్ల ఉన్న అభిమానాన్ని సద్వినియోగం చేసుకోవటంలోనూ తెలుగు తమ్ముళ్లు సఫలీకృతులయ్యారు. 

దర్శి నగర పంచాయతీలో 20 వార్డులుండగా ఒకటి ఏకగ్రీవమైంది. మిగిలిన 19 వార్డులకు సోమవారం పోలింగ్‌ నిర్వహించారు. బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. 13 వార్డుల్లో టీడీపీ, ఆరుచోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా గెలుచుకున్న వార్డుతో కలిపి వైసీపీ బలం ఏడుకు చేరింది. 13వార్డుల్లో గెలుపు ద్వారా నగర పంచాయతీ పాలక మండలి టీడీపీ వశమైంది. 

బీసీ. దళిత, కాపు సామాజికవర్గాల్లో టీడీపీకి ఆధిక్యం

తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కాపు, బీసీ, దళిత వర్గాల్లో మంచి ఆదరణ కనిపించింది. మొత్తం ఆరు వార్డులు బలహీనవర్గాలకు రిజర్వుకాగా అన్నింటినీ ఆ పార్టీ కైవసం చేసుకుంది. దళితులకు రిజర్వు అయిన మూడు వార్డుల్లో రెండింటిని గెలుచుకోగలిగింది. అలాగే ఓటర్లలో రెండోస్థానంలో ఉన్న కాపు సామాజికవర్గం నుంచి కూడా టీడీపీకే ఆదరణ లభించింది. ఆ వర్గం నుంచి మొత్తం ఏడుగురిని రంగంలోకి దించగా ఐదుగురు గెలుపొందారు. వైసీపీ కాపు సామాజికవర్గం నుంచి ఐదుగురిని బరిలోకి దింపగా ఒకరు మాత్రమే విజయం సాధించారు. దళితులకు కేటాయించిన మూడు స్థానాల్లో మాదిగవర్గం నుంచి టీడీపీ ఇద్దరిని రంగంలోకి దింపగా వారు గెలుపొందారు. మాల సామాజికవర్గం ఆధికంగా ఉన్న వార్డులో మాత్రమే వైసీపీ విజయం సాధించారు. బలమైన ఓటు బ్యాంకు ఉన్న రెడ్డి సామాజికవర్గం నుంచి వైసీపీ ఆరుగురిని  బరిలోకి దింపగా ఒకరు ఏకగ్రీవమయ్యారు. పోటీలో నిలిచిన ఐదుగురులో నలుగురు గెలుపొందగా ఒకరు ఓటమి చెందారు. 

ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీలో ఐక్యత

ఆయా అంశాలపై ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవటంలో టీడీపీ సఫలీకృతమయ్యింది. ప్రధానంగా అభివృద్ధి పనులు ఆగిపోవటం, పెరిగిన ధరలు, స్ధానికంగా ఉన్న అవినీతి వ్యవహారాలను ప్రచారం చేయటంలో టీడీపీ నాయకులు విజయం సాధించారు. స్థానికంగా మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ఆయన కుటుంబంపట్ల ప్రజలకు ఉన్న అభిమానాన్ని సొమ్ము చేసుకోగలిగారు. వీటికితోడు కొద్దినెలలుగా జిల్లాలో ప్రజా సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు సమరభేరి మోగించటంతోపాటు,  ఆపార్టీ నాయకత్వం మొత్తం ఐక్యంగా పయనిస్తోంది. ఇక్కడ కూడా స్థానిక నాయకుడు పాపారావు, ఇన్‌చార్జి రమేష్‌ను ముందుంచి మిగిలినవారంతా అండగా పనిచేశారు. చంద్రబాబు అనునిత్యం పర్యవేక్షించడం కూడా కలిసొచ్చింది. 

వైసీపీలో అతివిశ్వాసం, అనైక్యత

అధికారపార్టీ నుంచి ఎమ్మెల్యే వేణుగోపాల్‌, ఆయన సోదరుడు శ్రీధర్‌ అంతా తామై పనిచేశారు. ఆ కింద కీలక బాధ్యతలు కూడా ఆయన తరఫున నియోజకవర్గంలో పనిచేస్తున్న మండలాల ఇన్‌చార్జులే చూశారు. స్థానికంగా పట్టు ఉన్న బూచేపల్లి కుంటుంబ సభ్యుల పాత్ర మచ్చుక కనిపించ లేదు. ఇటీవల ఎమ్మెల్యే మద్దిశెట్టి, బూచేపల్లి మధ్య పెరిగిన అఘాతమే అందుకు కారణం. చివర్లో మంత్రి బాలినేని జోక్యం చేసుకుని మద్దిశెట్టితో బూచేపల్లికి ఫోన్‌ చేయించి ప్రచార ముగింపు సభకు వారిని పిలిపించారు. ఇటీవల కురిచేడులో జరిగిన ఒక సభలో ఎమ్మెల్యే వేణుగోపాల్‌ వచ్చే ఎన్నికల్లో తనమీద పోటీచేసేవారు లేరనే రీతిలో చేసిన ప్రసంగం, రెండు రోజుల తరువాత దర్శిలో టీడీపీ జెండా ఎగిరే ప్రసక్తే లేదని చేసిన హెచ్చరిక సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా అప్రమత్తమై గట్టిగా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి వర్గీయుల నుంచి మద్దతు లభించలేదన్న అభిప్రాయంలో ఎమ్మెల్యే వర్గీయులు ఉన్నప్పటికీ రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉన్న వార్డుల్లో మాత్రమే వైసీపీకి విజయం లభించటం గమనార్హం. 

జగన్‌ అక్షింతలు.. చంద్రబాబు అభినందనలు

దర్శిలో ఓటమిపై ఎమ్మెల్యే వేణుగోపాల్‌ మీద ముఖ్యమంత్రి జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక విషయంలోనే తాను ఇచ్చిన సూచనలను పాటించలేదన్న అసంతృప్తితో ఉన్న ఆయన ఫలితాల అనంతరం సీరియస్‌ అయ్యారు.  బుధవారం సాయంత్రం మంత్రి బాలినేని, సజ్జలను ఎమ్మెల్యే వేణుగోపాల్‌ కలిసి పార్టీలో కొందరు నాయకుల వెన్నుపోటే ఓటమికి కారణమని చెప్పిట్లు తెలిసింది. పరోక్షంగా బూచేపల్లి సహకరించలేదని, టీడీపీ వారికి నగదు సహాయం కూడా చేశారని ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్‌చేసి పార్టీ నాయకులను అభినందించారు.




Updated Date - 2021-11-18T05:53:57+05:30 IST