
రాజమండ్రిలో హత్యలకు తెగబడుతున్న బ్లేడ్ బ్యాచ్‌కు అధికార వైసీపీ అండదండలు ఉన్నాయా? తెలుగుదేశం పార్టీ నేతలకు ఈ బ్యాచ్‌తో సంబంధాలున్నాయనంటూ వైసీపీ నేతలు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదా? బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు రాజకీయ రంగు పులుముకోవడానికి కారణమేంటి. అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
రెచ్చిపోతోన్న బ్లేడ్ బ్యాచ్..
ప్రశాంతంగా ప్రవహించే గోదారి చెంతన ఉండే రాజమహేంద్రవరాన్ని బ్లేడ్ బ్యాచ్ బెంబెలెత్తిస్తోంది. ఒంటరి వ్యక్తులే లక్ష్యంగా ఈ బ్యాచ్ రెచ్చిపోతోంది. ఇటీవల కాలంలో వీరి ఆగడాలు ఎక్కువైపోవడంతో ప్రజలు ఆందోళనచెందుతున్నారు. అయితే ఈ బ్యాచ్‌పై కిందటి సారి ఎన్నికల నుంచి రచ్చ మొదలైంది. అప్పట్లో వైసీపీ తరపున పోటీచేసిన రౌతు సూర్యప్రకాశరావు బ్లేడ్‌బ్యాచ్‌కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అత్తింటి కుటుంబంతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఇక ఎంపీ మార్గానీ భరత్ కూడా తన ఎన్నికల ప్రచారంలో బ్లేడ్‌బ్యాచ్‌ను అరికడతామని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడిచింది. కానీ ఈ బ్యాచ్ ఆగడాలు మరింత పెరిగాయి. పైగా వైసీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు.

రౌడీషీటర్లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు
ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు రౌడీషీటర్లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ తో పాటు, కొందరు రాజకీయ నేతలకు బ్లేడ్ బ్యాచ్ నిందితులు అనుచరులుగా ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో టీడీపీ కార్యనిర్వాహ కార్యదర్శి ఆదిరెడ్డి వాసు రాజమండ్రి అభివృద్ధి పనుల నాణ్యతను ప్రశ్నించారు. నాణ్యతాలోపానికి ఎంపీ మార్గాని భరత్ వ్యవహారశైలే కారణమని ఆరోపించారు. దీనిపై ఎంపీ అనుచరులు పాలిక శ్రీనివాస్, అజ్జరపు వాసు ప్రతివిమర్శలకు దిగారు. ఆదిరెడ్డి వాసు బ్లేడ్ బ్యాచ్ కు డాన్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

దీంతో ఆదిరెడ్డి వాసు తీవ్రంగా స్పందించారు. 2019 ఎన్నికలలో వైసీపీ నేతలు ఇటువంటి ఆరోపణలే చేశారని, కానీ ప్రజలు విశ్వసించలేదని అందుకే రాజమండ్రిలో 30వేల మెజార్టీతో గెలవగలిగామన్నారు. ఎంపీ మార్గాని భరత్‌కు రాజమండ్రి, రాజమండ్రి రూరల్‌లో కూడా మెజార్టీ తగ్గిందని, తాము నిజంగా బ్లేడ్ బ్యాచ్‌కు డాన్‌గా ఉంటే ప్రజలను తమను ఆదరించేవారా అంటూ కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి రాగానే బ్లేడ్ బ్యాచ్ కథ తేలుస్తామన్న వైసీపీ నాయకులు గద్దెనెక్కి మూడేళ్ళవుతున్నా ఏంచేయగలిగారంటూ ప్రశ్నించారు.

బ్లేడ్ బ్యాచ్ వ్యవహారంపై జనం ఆగ్రహం
ఎంపీ భరత్ పదిరోజుల్లోగా బ్లేడ్ బ్యాచ్‌ను అరెస్ట్ చేయించాలని, లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసరడం రాజమండ్రిలో సంచలనమైంది. మొత్తం మీద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బ్లేడ్ బ్యాచ్ వ్యవహారంపై జనం ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ నేతలు కూడా ఆరోపణలతో కాలం వెళ్ళదీయడం ఎందుకు, నిందితులను అరెస్ట్ చేయించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. మరి వైసీపీ నేతలకు ఈ ప్రశ్నలు వినపడతాయో, లేదా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విషయాన్ని వచ్చే ఎన్నికల దాకా సాగదీస్తారో చూడాలి.