అంతలోనే కలిశారు

ABN , First Publish Date - 2021-03-07T06:28:36+05:30 IST

ఉదయం చిలికిచిలికి గాలివానలా మారిన బెజవాడ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ..

అంతలోనే కలిశారు

విజయవాడ టీడీపీ నాయకుల మాటల యుద్ధం

అధినేత పర్యటనపై సమాచారంలోపం

ఎంపీ కేశినేనిపై బుద్దా, బొండా, నాగుల్‌మీరా విమర్శలు

వెంటనే స్పందించిన అధిష్ఠానం

సాయంత్రానికల్లా సద్దుమణిగిన వివాదం


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఉదయం చిలికిచిలికి గాలివానలా మారిన బెజవాడ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ అధిష్ఠానం జోక్యంతో సాయంత్రానికే చల్లబడింది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌పై తొలుత నేతల మధ్య ఏర్పడిన పంతాలు విలేకరుల సమావేశాలు పెట్టి విమర్శలు గుప్పించుకునే స్థాయికి వెళ్లాయి. చివరికి ఒకరికొకరు స్నేహహస్తం అందుకున్నా మున్సిపల్‌ ఎన్నికల వేళ ఈ పోట్లాటలు ఎంతవరకు కరెక్టు అనే వాదనలు వినిపిస్తున్నాయి. నగర టీడీపీలో సమన్వయలోపం ఉన్నమాట వాస్తవమేనని పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం అంగీకరించారు.


మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో పర్యటించనున్నారు. అధినేత టూర్‌ షెడ్యూల్‌ విషయంలో బుద్దా వెంకన్న, బొండా ఉమా, నాగుల్‌మీరా వంటి నాయకులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఏయే ప్రాంతాల్లో అధినేత పర్యటించాలన్న అభిప్రాయాలను తీసుకోలేదు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో ఈ ముగ్గురు నేతలకు కొంతకాలంగా పొసగడం లేదు. దీంతో చంద్రబాబు టూర్‌ షెడ్యూల్‌ విషయంలో నాని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తమకు సమాచారం ఇవ్వలేదని భావించారు. దీంతో శనివారం ముగ్గురు నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఎంపీ కేశినేని నాని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తప్ప మరెవరూ తమకు అధిష్ఠానం కాదని బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నాని ఒంటెత్తు పోకడలు, అవమానకరమైన ప్రవర్తన, నాయకుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడటం, బీసీలు, కాపులను చులకనగా మాట్లాడటం చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. బుద్దా వెంకన్న మాట్లాడుతూ దైవసమానుడైన పార్టీ అధినేత చంద్రబాబును ఏకవచనంతో కించపరిచేలా ఎంపీ నాని మాట్లాడటం, అంతా తానేనన్న అహంతో వ్యవహరిస్తుండటంతో ఓపిక నశించి మాట్లాడాల్సి వస్తోందన్నారు.


20ఏళ్లుగా వన్‌టౌన్‌లో పార్టీని భుజాన వేసుకుని మోస్తున్న బలహీన వర్గాలకు చెందిన తనకు గానీ, నాగుల్‌మీరాకు గానీ చంద్రబాబు పర్యటన గురించి చెప్పకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తారా? అని నిలదీశారు. తాను చచ్చే వరకు చంద్రబాబుతోనే ఉంటానని, నాని ప్రమాణం చేసి అదే మాట చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆశీసులతో విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థిగా తాను టీడీపీ తరఫున పోటీ చేస్తానని, ఈరోజు నుంచే విజయవాడ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతానని ప్రకటించారు. 


సాయంత్రానికి సీన్‌ రివర్స్‌

వివాదం వివరాలు తెలియగానే అధిష్ఠానం అప్రమత్తమైంది. అధినేత చంద్రబాబు సూచనల మేరకు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నాయకులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీంతో సాయంత్రానికి సీన్‌ రివర్స్‌ అయింది. ఉదయం ఆవేశంగా మాట్లాడిన నేతలు నాని కుమార్తె శ్వేతతో కలిసి మళ్లీ విలేకరుల ముందుకొచ్చారు. శ్వేత నేరుగా బొండా ఉమా ఇంటికి వెళ్లి ముగ్గురు నేతలతో సమావేశమయ్యారు. అనంతరం అందరం కలిసి పార్టీ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీ లైన్‌ దాటి వ్యవహరించే ఉద్దేశం తమకు లేదని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. నాని వైఖరిపైనే తమకు అభ్యంతరం అన్నారు. శ్వేతను మేయర్‌గా గెలిపించే బాధ్యత తమదన్నారు. కాగా, తనకు పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేవని, ఎవరిపైనా అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేదని ఎంపీ నాని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశిస్తే మరుక్షణం పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధమేనన్నారు. 

Updated Date - 2021-03-07T06:28:36+05:30 IST