‘టీడీఎస్‌’ భారం

ABN , First Publish Date - 2022-08-10T06:46:45+05:30 IST

రిజిస్ట్రేషన్ల శాఖ మరో కొత్త నిబంధన అమల్లోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఈనెల 6న జారీ చేసింది.

‘టీడీఎస్‌’ భారం

 స్థిరాస్తి క్రయ విక్రయాలపై గురి

ఆస్తి, స్టాంపు డ్యూటీ విలువ రూ.50 లక్షలు మించితే ఒక శాతం టీడీఎస్‌ తప్పనిసరి

ప్రభుత్వానికి పెరగనున్న ఆదాయం 

పన్ను ఎగవేతను అరికట్టేందుకు కొత్త మార్గం 

 నిబంధన తీసుకువచ్చిన ప్రభుత్వం 

పెద్దాపురం, ఆగస్టు 9 : రిజిస్ట్రేషన్ల శాఖ మరో కొత్త నిబంధన అమల్లోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఈనెల 6న జారీ చేసింది. తక్షణమే ఈ నిబంధనను అమలుచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎవరైనా రూ.50 లక్షలు  దాటిన స్థిరాస్తిని కొనుగోలు చేసినట్టయితే దానిపై ఆదాయ పన్ను కట్టి చలానాను సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సమర్పించాలి. అప్పుడే ఈ డాక్యుమెంటును రిజిస్టర్‌ చేస్తారు. ఇప్పటివరకూ ఎంత ఖరీదైన ఆస్తి కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్‌ శాఖకు 7.5 శాతం ఫీజు కడితే సరిపోయేది. ఆదాయపన్ను శాఖ అధికారులు తర్వాత వీటిని పరిశీలించి పన్ను పరిధిలోకి వస్తే ఆ తర్వాత వారితో కట్టించుకునేవారు. ఇకపై తక్షణమే టీడీఎస్‌ (ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌) కట్టేలా నిబంధనను పెట్టారు. గుర్తింపు పొందిన వాణిజ్య బ్యాంకులో చెల్లించి, ఆ చలానాతోపాటు పాన్‌ కార్డు నంబరు, 26 క్యూ బీ  ఫారం పూర్తిచేసి సబ్‌ రిజిస్ట్రార్‌కు సమర్పించాలి. అప్పుడు రిజిస్ర్టేషన్‌ జరుగుతుంది.

వ్యవసాయ భూమికి మినహాయింపు..

స్థిరాస్తి క్రయవిక్రయాలపై వచ్చిన ఈ కొత్త నిబంధనలో వ్యవసాయ భూమిని మినహాయించారు. బడ్జెట్‌లో ప్రస్తుతం స్థిరాస్తులకు సంబంధించి అమ్మకపు విలువపై టీడీఎస్‌ వర్తిస్తుంది. ఇకపై కొనుగోలు చేసే సమయంలో రూ. 50 లక్షలకు మించితే అమ్మకపు విలువ లేదా స్టాంపు డ్యూటీ విలువల్లో ఏది ఎక్కువైతే దానిపై ఒక్క శాతం టీడీఎస్‌ (ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌) చెల్లింపు తప్పనిసరి చేసింది. సాధారణంగా ఆస్తుల కొనుగోళ్లలో స్టాంపు డ్యూటీ విలువ వాస్తవ విలువకంటే తక్కువగా ఉంటుంది. అంటే బహిరంగ మార్కెట్‌ రేట్లకు దీనికి సంబంధం ఉండదు. దీంతో వ్యక్తుల మధ్య జరిగే డబ్బు చెల్లిం పు ఎక్కువ ఉంటుంది. అదీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ కింద ఉంటుంది.  

పన్ను ఎగవేతను అరికట్టేందుకే..

తాజాగా తీసుకువచ్చిన విధానం ద్వారా పన్ను ఎగవేతను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తి ఇల్లు రూ.60 లక్షలకు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌ స్టాంపు డ్యూటీకి సుమారుగా రూ.72 లక్షలు అనుకుంటే పాత నిబంధనల ప్రకారం రూ.60 లక్షలకే టీడీఎస్‌ చేయాలి. కానీ తాజా ప్రతిపాదనల ప్రకారం రూ.72 లక్షల మీద ఒక శాతం టీడీఎస్‌ చెల్లించాలి. దీనివల్ల టీడీఎస్‌ మొత్తం పెరుగుతుంది. అంతేకాకుండా క్యాపిటల్‌ గెయిన్స్‌ లెక్కించడానికి ఎక్కు వ మొత్తాన్నే పరిగణలోకి తీసుకుంటారు. ఇకపై కొత్త నిబంధనల ప్రకారం ఆస్తి అమ్మకపు విలువ స్టాంపు డ్యూటీ విలువ రూ.50 లక్షలు దాటితేనే టీడీఎస్‌ రూల్స్‌ వర్తించనున్నాయి. ఈ చర్యలతో ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరుగుతుంది. కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి ఎక్కువ మొత్తం పన్నుని రికవరీ చేసి టీడీఎస్‌ ఖాతాలో జమ చేస్తారు. అయితే ఈ జమ అమ్మే వ్యక్తి సొంత ఖాతాలో పన్ను చెల్లించినట్టుగా పడుతుంది. అమ్మే వ్యక్తి పన్ను చెల్లించాల్సి ఉంటే టీడీఎస్‌ను పరిగణలోకి తీసుకుని మిగతా మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ పూర్తిగా మినహాయింపు పొందే వ్యక్తికి ఈ టీడీఎస్‌ మొత్తం రిఫండ్‌ రూపంలో వస్తుంది. అలా వచ్చేవరకూ అది ప్రభుత్వం వద్దనే ఉంటుంది. రిఫండ్‌ వచ్చాక సరేసరి. అంటే ప్రభుత్వం ముందుగానే ఎక్కువ టీడీ ఎస్‌ వసూలు చేసి అసెస్‌మెంట్‌ తరువాత వెనక్కు ఇస్తుంది. దీనివల్ల ఆయా వర్గాలకు అదనపు భారమే అవుతుంది.

ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమే

స్థిరాస్తి క్రయవిక్రయాలపై టీడీఎస్‌ తప్పనిసరి చేస్తూ ఆదే శాలు వచ్చిన మాట నిజమే. ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. ఆస్తి, స్టాంపు డ్యూటీ విలువ రూ.50 లక్షలు దాటి తే ఒక శాతం టీడీఎస్‌ తప్పనిసరిగా చెల్లించాలి. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. 

- వి.వెంకటేశ్వరరావు, సబ్‌రిజిస్ట్రార్‌, పెద్దాపురం





Updated Date - 2022-08-10T06:46:45+05:30 IST