‘టెట్‌’ ఆశలు ఆవిరి!

ABN , First Publish Date - 2022-10-01T09:24:01+05:30 IST

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)పై అభ్యర్థుల ఆశలు ఆవిరయ్యాయి. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం విఫలం కావడంతో ఏకంగా 1,18,474 మంది పరీక్షలకు దూరమయ్యారు. వీరంతా రూ.500 చొప్పున చెల్లించిన దరఖాస్తు రుసుము దాదాపు

‘టెట్‌’ ఆశలు ఆవిరి!

కొందరికి నూరుశాతానికి పైగా మార్కులు .. ఆపై దిద్దుబాటు 


అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)పై అభ్యర్థుల ఆశలు ఆవిరయ్యాయి. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం విఫలం కావడంతో ఏకంగా 1,18,474 మంది పరీక్షలకు దూరమయ్యారు. వీరంతా రూ.500 చొప్పున చెల్లించిన దరఖాస్తు రుసుము దాదాపు రూ.6 కోట్లు వృథాగా మారింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో అభ్యర్థులు పరీక్షలకు దూరం కాలేదు. 2018 తర్వాత నిర్వహిస్తుండటంతో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టెట్‌కు ఏకంగా 5,25,803 మంది దరఖాస్తు చేసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ కేవలం 150 పరీక్ష కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసింది. వీటిలో చాలావరకూ ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఉండటంతో ఏపీలో కేంద్రాలు దొరకని వారు పరీక్షలు రాయలేకపోయారు.  


ఐదుగురికి 150 మార్కులు 

ఈ ఏడాది టెట్‌ రాసిన 4,07,329 మందిలో 2,36,535 (58.07ు) మంది అర్హత సాధించారు. వారిలో ఐదుగురికి 150 మార్కులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనరల్‌ అభ్యర్థులకు 60శాతం, బీసీ అభ్యర్థులకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీ్‌సమన్‌ కోటా అభ్యర్థులకు 40శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు. పరీక్షలకు ఎక్కువ సమయం ఇవ్వకపోవడంతో చాలామంది అనర్హులుగా మిగిలిపోయారు. మరోవైపు టెట్‌ ఫలితాల్లో వింతలు చోటుచేసుకున్నాయి. 150 మార్కులకు పరీక్ష నిర్వహించగా కొందరికి నూరు శాతానికి పైగా మార్కులు రావడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన వడ్ల మంజుల 150కి గాను 150.26958 మార్కులు వచ్చాయి. మరో అభ్యర్థికి 150.86, ఇంకొకరికి 15.64 మార్కులు రావడంతో వారిలో ఆందోళన మొదలైంది. సాయంత్రానికి వీటిని సరిదిద్దడంతో ఊపిరి పీల్చుకున్నారు.  

Updated Date - 2022-10-01T09:24:01+05:30 IST