పారదర్శకంగా పదోన్నతులు, బదిలీలు

ABN , First Publish Date - 2021-01-17T06:19:26+05:30 IST

పారదర్శకంగా పదోన్నతులు, బదిలీలు

పారదర్శకంగా పదోన్నతులు, బదిలీలు
పదోన్నతుల కౌన్సెలింగ్‌లో మాట్లాడుతున్న డీఈవో రాజ్యలక్ష్మి, వేదికపై ఆర్జేడీ నరసింహారావు, ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ ప్రతాపరెడ్డి

మచిలీపట్నం టౌన్‌, జనవరి 16: తమ రీజియన్‌ పరిధిలో పారదర్శకంగా పదోన్నతులు, బదిలీలు నిర్వహించినట్టు ఆర్జేడీ నరసింహారావు పేర్కొన్నారు. డీఈవో కార్యాలయంలో ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌ కార్యక్రమాన్ని ఆర్జేడీ నరసింహారావు, ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ ప్రతాపరెడ్డి శనివారం సందర్శించారు. రీజియన్‌ పరిధిలో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆన్‌లైన్‌లో 3,696 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, 5,254 మంది ఎస్జీటీలు బదిలీ అయ్యారని ఆర్జేడీ తెలిపారు. హెచ్‌ఎంలు, భాషా పండితులకు మరో వారం రోజుల్లో బదిలీల ఉత్తర్వులు అందుతాయన్నారు. ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లకుండా ప్రధానోపాధ్యాయులు, భాషా పండితులకు అడ్‌హాక్‌ పదోన్నతులు కల్పిస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో బదిలీలు అయ్యాక అడ్‌హాక్‌లో పదోన్నతులు పొందిన వారు మళ్లీ ఆన్‌లైన్‌లో బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

మేలో పది పరీక్షలు

ఈ ఏడాది పని దినాలకు అనుగుణంగా సిలబస్‌ను తగ్గించామని ఆర్జేడీ తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు మే నెలలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 18వ తేదీ నుంచి 6వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామన్నారు. ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ..విద్యార్థుల పఠనాభివృద్ధిపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. శనివారం 28 మంది స్కూల్‌ అసిస్టెంట్లను గ్రేడ్‌ 2 ప్రధానోపాధ్యాయులుగా అడ్‌హాక్‌ ప్రమోషన్లు కల్పించేందుకు కౌన్సెలింగ్‌ నిర్వహించామని డీఈవో ఎం.వి.రాజ్యలక్ష్మి తెలిపారు. 39 మంది తెలుగు స్కూల్‌ అసిస్టెంట్లకు, 32 మంది హిందీ స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించామన్నారు. సాయంత్రం మాన్యువల్‌గా 57 మంది తెలుగు భాషా పండితులు, 21 మంది హిందీ బాషా పండితులకు బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించామన్నారు. ఏడీ అవధాని, సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు, పవన్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-17T06:19:26+05:30 IST