ఉపాధ్యాయుల గర్జన

ABN , First Publish Date - 2022-01-21T05:33:33+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన రివర్స్‌ పీఆర్సీపై ఉపాధ్యాయులు భగ్గుమన్నారు. పీఆర్సీ, ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, పింఛను, డీఏలకు సంబంఽధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని గర్జించారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లాలోని 38 మండలాల్లోని ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాలకు చెందిన సుమారు ఐదువేల మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల గర్జన
కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

- రివర్స్‌ పీఆర్సీపై ఆందోళన

- ప్రభుత్వ తీరుకు నిరసనగా కలెక్టరేట్‌ ముట్టడి

- జీవోలను రద్దు చేస్తారా.. లేదా గద్దెదిగుతారా?

- నినదించిన ఫ్యాప్టో

గుజరాతీపేట, జనవరి 20: ప్రభుత్వం ప్రకటించిన రివర్స్‌ పీఆర్సీపై ఉపాధ్యాయులు భగ్గుమన్నారు. పీఆర్సీ, ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, పింఛను, డీఏలకు సంబంఽధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని గర్జించారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లాలోని 38 మండలాల్లోని ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాలకు చెందిన సుమారు ఐదువేల మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకొని మూడు గంటల పాటు నినాదాలతో హోరెత్తించారు. చీకటి పీఆర్సీ జీవోలను రద్దు చేస్తారా.. లేదా గద్దె దిగుతారా అని ప్రభుత్వానికి అల్టిమేట్‌ జారీ చేశారు. ఉపాధ్యాయుల ఆందోళన నేపథ్యంలో కలెక్టరేట్‌ వద్ద జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఉపాధ్యాయులు వెనక్కి తగ్గలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు తీవ్రనష్టం కలిగించే పీఆర్సీ జీవోలను రద్దు చేయాల్సిందేనంటూ కలెక్టరేట్‌ను ముట్టడించారు. డీఎస్పీ మహేంద్ర కలుగజేసుకొని ఉద్యమాన్ని విరమించాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. తొలుత కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్‌ కొమ్ము అప్పలరాజు, కో-చైర్మన్లు పొందూరు అప్పారావు, ఎస్వీ రమణమూర్తి, మజ్జి మదన్‌మోహన్‌, టెంకా చలపతిరావు, రాష్ట్ర బాధ్యుడు చౌదరి రవీంద్ర, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ బగాది తాతారావులు మాట్లాడారు. ప్రతి ఐదేళ్లకొకసారి పీఆర్సీ ప్రకటించాలని.. సచివా లయ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్‌ చేయాలని, అశుతోష్‌మిశ్రా నివేదికను బహిర్గతం చేసి దానిని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడున్న ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ను పెంచి ఇవ్వాలని, హెచ్‌ఆర్‌ఏ పాతశ్లాబ్‌లను కొనసాగించాలని, పెన్షనర్లకు క్వాంటమ్‌ పాతపద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపా ధ్యాయులను అనేక రకాల యాప్‌లతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనం ప్రక్రియతో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శిం చారు. అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తానని పాదయాత్రలో మాట ఇచ్చిన జగన్‌.. ఇప్పుడు రెండున్నరేళ్లు అవుతున్నా ఆ ఊసే లేదన్నారు. చేతనకాని సీఎంగా వెంటనే గద్దెదిగాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ జీవోలన్నీ మోసపూరితమేనని, వీటిని అర్ధరాత్రి విడుదల చేయడం జగన్మోహన్‌రెడ్డి పాలనకు పరాకాష్ట అని అన్నారు. ఈ జీవోలను రద్దుచేసి కొత్త పీఆర్సీని ప్రకటించాలని, లేనియెడల పాత ఐఆర్‌, హెచ్‌ఆర్‌ఏలతోనే జీవోలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాలైన ఏపీహెచ్‌ఎం, యూటీఎఫ్‌, ఎస్‌టీయూ, ఏపీటీఎఫ్‌-257, ఏపీటీఎఫ్‌-1938, డీటీఎఫ్‌, బీటీఏ, ఏపీపీటీఏల ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యలను దుయ్యబట్టారు.  ఫ్యాప్టో చేపట్టిన ముట్టడి కార్యక్రమానికి ఏయూపీఎస్‌, పీఈటీ, ఆర్‌యూపీపీ, ఎస్‌ఎల్‌టీఏ, సీపీఎస్‌యూఎస్‌, సీపీఎస్‌ఈఏ, ఎస్‌జీటీఎఫ్‌, ఎల్‌ఎఫ్‌ఎల్‌, ఫార్టో, జీటీఏ వంటి ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఏపీఎన్జీవో, సీఐటీయూ, పెన్షనర్ల అసోసియేషన్‌లు మద్దతు తెలిపాయి. ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. 


 ఉద్యోగుల గొంతు నొక్కడం అన్యాయం 

హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల గొంతులను పోలీ సులు నొక్కడం అన్యాయమని ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సా యిరాం అన్నారు. ఫ్యాప్టో చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడికి మద్దతు ప్రకటించి నందుకు తనను గురువారం ఉదయం 4.30 గంటలకు పోలీసులు శ్రీకాకుళం 2వ పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించి నిర్భందించడం దారుణమన్నారు.  దీన్ని జిల్లా ఎన్జీవో సంఘం తరఫున ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు 2వ పట్టణ పోలీసు స్టేషన్‌ ఎదుట ఎన్జీవో నాయకులతో కలిసి ఆయన నినాదాలు చేశారు. 


వినూత్న నిరసన

పొందూరు: రివర్స్‌ పీఆర్‌సీని వ్యతిరేకిస్తూ పొందూరు మండలం మజ్జిలపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వావిలపల్లి సత్యనారాయణ కలెక్టరేట్‌ వద్ద వినూత్న నిరసన తెలిపారు. నడిరోడ్డుపై తలకిందులుగా శీర్షాసనం వేశారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా రివర్స్‌ పీఆర్సీ ప్రకటించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-21T05:33:33+05:30 IST