టీచర్ల గగ్గోలు!

Published: Sat, 25 Jun 2022 23:35:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టీచర్ల గగ్గోలు! జీవో నెంబర్‌ 117ను రద్దు చేయాలని ఇటీవల కలెక్టరేట్‌ ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు (ఫైల్‌)

మిగులుగా 2,363 పోస్టులు

937 కొత్త పోస్టులు అవసరం

టీచర్ల పునర్విభజన ఉత్తర్వుల ఫలితం

ఎవరిపై వేటుపడుతుందోనని ఆందోళన

పోస్టులు కాపాడుకునేందుకు సంప్రదింపులు

రంగంలోకి దిగిన సంఘాలు, ఎమ్మెల్సీలు

ప్రభుత్వం నుంచి కరువైన స్పందన

ఒంగోలు(విద్య), జూన్‌ 25 : 

జాతీయ విద్యా విధానంతో వేలాది కొత్త పోస్టులు మంజూరవుతాయని అనుకున్న ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. కొత్త పోస్టులు మంజూరు మాట అటుంచి ఉన్నవే వేలాదిగా మిగులుగా తేలడంతో అందరూ హతాశులయ్యారు. దీంతో తత్వం బోధపడి పదోన్నతులపై ఆశలు వీడి తమ పోస్టు పరిస్థితి ఏంటోననే విచారణలో ఉన్నారు. ఇప్పటికైనా మంజూరైన పోస్టులను కాపాడుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలు, టీచర్ల ఎమ్మెల్సీలు ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించారు. ప్రభుత్వం వీరు చేప్పేది ఆలకిస్తుందే తప్ప పాజిటివ్‌ స్పందన కరువైంది. దీంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవోను పరిశీలిస్తే జిల్లాలో 2,363 టీచర్‌ పోస్టులు మిగులుగా తేలనున్నాయి. 937 మాత్రమే కొత్త పోస్టులు మంజూరవుతాయి.


జాతీయ విద్యా విధానంతో వేలాది మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు స్కూలు అసిస్టెంట్లుగా, జూనియర్‌ లెక్చరర్లుగా, స్కూలు అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు లభిస్తాయని ప్రభుత్వం ఊదరగొట్టింది. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు అమాంతం పెరిగిపోతాయని ప్రచారం చేసింది. తీరా వాస్తవాల్లోకి వస్తే ప్రభుత్వ ప్రచారంలో డొల్లతనం బట్టబయలైంది. పాఠశాలల మ్యాపింగ్‌, ఉపాధ్యాయుల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులతో టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం, ఉపాధ్యాయుల పునర్విభజన అంశాలు ఆ వర్గాలను కలవరపెడుతున్నాయి. పదోన్నతులు సంగతి పక్కనపెడితే పునర్విభజనతో అసలు వేలాది పోస్టులు మిగులుగా తేలనున్నాయి. దీంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.  


నిర్వీర్యం చేస్తున్న జీవో 117

ఉపాధ్యాయుల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవో నెంబరు 117 మార్గదర్శకాలు పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 40 శాతం ఏకోపాధ్యాయ బడులుగా మిగలనున్నాయి. పైకి విద్యాశాఖ మంత్రి అలాంటిదేమీ లేదని చెబుతున్నా.. గత అనుభవాలను బట్టి చూస్తే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏముందో అదే అమలు చేయడం పరిపాటిగా మారింది. జీవో ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతులకు 1 నుంచి 5 తరగతులకు 30మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ను ఇస్తారు. విద్యార్థుల నమోదు 30 దాటితేనే రెండో టీచర్‌ను ఇస్తారు. అలాగే విద్యార్థుల సంఖ్య 121 దాటితేనే ప్రాథమిక పాఠశాలకు హెచ్‌ఎంను ఇస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో 195మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలలను హైస్కూలుగా అప్‌గ్రేడ్‌ చేస్తారు. 98మంది లోపు విద్యార్థులు ఉంటే ప్రాథమికోన్నత పాఠశాల నుంచి స్కూలు అసిస్టెంట్‌ పోస్టును తప్పించి ప్రతి 30మంది విద్యార్థులకు ఒక్కరు చొప్పున సెకండరీ గ్రేడ్‌ టీచర్లను ఇస్తారు. ఈ విధంగా విభజించడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


2,363 మిగులు పోస్టులు

ఉపాధ్యాయుల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులతో  జిల్లాలో గరిష్ఠంగా 2363 టీచర్‌ పోస్టులు మిగులుగా తేలనున్నాయి. మిగులు పోస్టుల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లదే సింహభాగం. అశాస్త్రీయమైన పునర్విభజన ఉత్తర్వుల వల్ల పాఠశాలలు రాబోయే రోజుల్లో ఉనికిని కోల్పోవడం ఖాయమనే ఆందోళన ఉపాధ్యాయు వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

- ప్రభుత్వ, మండల పరిషత్‌ ప్రాథమిక, ప్రాథమకోన్నత పాఠశాలల్లో మొత్తం 1,907 సెకండరీ గేడ్ర్‌ టీచర్‌ పోస్టులు మిగులుగా తేలుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 34 ఎస్జీటీ పోస్టులు మంజూరు కాగా 23 పోస్టులకు సరిపడే విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దీంతో 11 పోస్టులు మిగులుగా తేలుతున్నాయి. ప్రభుత్వ మండల పరిషత్‌  పాఠశాలల్లో మొత్తం 7,199 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు మంజూరు కాగా 5,292 పోస్టులకు సరిపడా మాత్రమే పిల్లలు ఉన్నారు. దీంతో నికరంగా 1,907 ఎస్జీటీ పోస్టులు మిగులుగా తేలాయి.

- స్కూలు అసిస్టెంట్‌ హిందీ పోస్టులు 97 మిగులుగా తేలాయి. మొత్తం 650 పోస్టులు మంజూరు కాగా 553పోస్టులు మాత్రమే అవసరం. దీంతో 97 పోస్టులు మిగులుగా తేలాయి. హైస్కూళ్లలో 17 సెక్షన్ల వరకు ఒక హిందీ పోస్టు మాత్రమే కేటాయించడంతో అవి మిగులుగా తేలాయి.

- ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 359 పోస్టులు మిగులుగా తేలాయి. 121 మంది కంటే అదనంగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు మాత్రమే ఈ పోస్టులు  కేటాయించడంతో 466కుగాను 107 మాత్రమే సర్దుబాటయ్యాయి. దీంతో 359 పోస్టులు మిగులుగా తేలాయి.


937 కొత్తపోస్టులు అవసరం

ఉపాధ్యాయుల పునర్విభజనలో 937 పోస్టులు అవసరమని తేల్చారు. హైస్కూళ్లకు 34 హెచ్‌ఎం పోస్టులు, స్కూలు అసిస్టెంట్‌ తెలుగు 27, ఇంగ్లీషు 320, గణితం 212, ఫిజికల్‌ సైన్స్‌ 11, బయాలజికల్‌ సైన్స్‌ 93, సోషల్‌ స్టడీస్‌ 62, ఎస్‌ఏపీఈ 118 పోస్టులు అదనంగా అవసరమని తేల్చారు. వీటిలో హెచ్‌ఎం పోస్టులను 100శాతం పదోన్నతుల ద్వారా భర్తీచేస్తారు. మిగిలిన స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను 70శాతం పదోన్నతుల ద్వారా 30శాతం నేరుగా డీఎస్సీ ద్వారా భర్తీచేస్తారు. తాజా అంచనాల ప్రకారం జిల్లాలో 700మందికి స్కూలు అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉంది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.