హాజరు.. బేజారు

ABN , First Publish Date - 2022-08-17T06:40:26+05:30 IST

ఇప్పటి వరకు పడుతున్న యాప్‌ కష్టాలు సరిపోవన్నట్లు కొత్తగా హాజరు కోసం ప్రవేశపెట్టిన సిమ్స్‌ ఏపీ యాప్‌తో ఉపాధ్యాయులు కుస్తీ పడాల్సి వచ్చింది.

హాజరు.. బేజారు
పెదకాకాని: వెనిగండ్ల జడ్పీస్కూల్‌లో గుంపులుగా చేరి హాజరు నమోదు కోసం ఉపాధ్యాయుల ఆగచాట్లు

ఉపాధ్యాయులకు యాప్‌ కష్టాలు

ముఖ హాజరు నమోదుకు సర్వర్‌ సమస్య

ఉమ్మడి జిల్లాలో 20 శాతానికి మించని వైనం

ఎన్నిసార్లు లాగిన్‌ అయినా నమోదు విఫలమే

నూతన విధానంపై ఉపాధ్యాయులు, సంఘాలు విముఖత

బాపట్ల జిల్లాలో 20, పల్నాడులో 10 శాతం మందే యాప్‌ డౌన్‌లోడ్‌


ఉపాధ్యాయులకు హాజరు సమస్య వచ్చింది. ప్రభుత్వం మంగళవారం నుంచి ప్రవేశపెట్టిన ముఖ హాజరుతో ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. గతంలో ప్రవేశ పెట్టిన బయోమెట్రిక్‌ స్థానే ప్రభుత్వం కొత్తగా ఎస్‌ఐఎమ్‌ఎస్‌ ఏపీ యాప్‌ ద్వారా ముఖ హాజరు విధానం ప్రవేశ పెట్టింది. ఈ విధానంలో హాజరు నమోదు కోసం ఉపాధ్యాయులు తరగతి గదుల్ని వదిలేసి పాఠశాల ఆవరణలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. హాజరు నమోదుకు నిర్ధిష్ట సమయం మాత్రమే కేటాయించడంతో ఉపాధ్యాయులు ఉమ్మడి  జిల్లావ్యాప్తంగా అవస్థలు పడాల్సి వచ్చింది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ అందని ప్రాంతాల సంగతి అటుంచితే జిల్లా కేంద్రాలకు సమీప ప్రాంతాల్లోని పాఠశాలల్లో సిగ్నల్‌ సమస్యలు, సాంకేతిక సమస్యలు వేధించడంతో ఉపాధ్యాయులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ముఖ హాజరు నమోదు ఉమ్మడి జిల్లాలో 20 శాతం కూడా  కాలేదని ఉపాఽధ్యాయ సంఘాల సమాచారం.   సిమ్స్‌ ఏపీ యాప్‌లో హాజరు కోసం ఉదయం, మధ్యాహ్నం ఉపాధ్యాయులు కుస్తీ పడటంతో విద్యాబోదన సజావుగా సాగలేదు.  


గుంటూరు(విద్య), తెనాలి అర్బన్‌, పిడుగురాళ్ల, నరసరావుపేట /బాపట్ల (ఆంధ్రజ్యోతి) ఆగస్టు 16: ఇప్పటి వరకు పడుతున్న యాప్‌ కష్టాలు సరిపోవన్నట్లు కొత్తగా హాజరు కోసం ప్రవేశపెట్టిన సిమ్స్‌ ఏపీ యాప్‌తో  ఉపాధ్యాయులు కుస్తీ పడాల్సి వచ్చింది. సిమ్స్‌ ఏపీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రతి ఉపాధ్యాయులు హాజరు కోసం పడిన కష్టాలు అంతా ఇంతాకాదు.  ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన హాజరు విధానం(ముఖ హాజరు నమోదు) ఉపాధ్యాయులకు కొత్తకష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఉపాధ్యాయులతో  సంప్రదించకుండా ప్రవేశపెట్టిన ఈ విధానం వారిలో గందరగోళ పరిస్థితికి కారణమౌతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రాథమిక, జడ్పీ, ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు దాదాపు 4500 వరకు ఉండగా అందులో దాదాపు 15 వేల మందికిపైగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. మంగళవారం నుంచి తప్పనిసరిగా యాప్‌ ద్వారా సెల్‌ఫోన్‌ నుంచి ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 9 గంటలలోగా హాజరు నమోదు చేసుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆ రోజు సెలవుగా పరిగణిస్తామని కూడా ప్రభుత్వం తెలిపింది. ఉపాధ్యాయులు తమ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడు చేసుకుని అందులో హాజరు నమోదు చేసుకోవాలి. దీనిని ఉపాధ్యాయలు వ్యతిరేకిస్తున్న క్రమంలో యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడు  చేసుకోవాల్సిందేనని ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారు.  క్షేత్రస్థాయిలో పనిచేసే సీఆర్పీలు, హెచ్‌ఎంలపై ఎంఈవో, డిప్యూటీ డీఈవోలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు.   యాప్‌డౌన్‌లోడు చేసుకోకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడో మారుమూల  సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ అందని ప్రాంతాల సంగతి అటుంచితే గుంటూరుకి సమీపంలోని పాఠశాలల్లో కూడా సాంకేతిక సమస్యలు వేధించడంతో ఉపాధ్యాయులు తీవ్ర అసహనానికి గురయ్యారు. సాంకేతిక సమస్యలు, సిగ్నల్‌ లోపం కారణంగా ఉపాధ్యాయుల హాజరు నమోదు కాలేదు. ఉపాధ్యాయులు ఎన్ని సార్లు లాగిన్‌ చేసి హాజరు నమోదుకు ప్రయత్నించిన ‘లాగిన్‌ ఫెయిల్‌ ట్రై ఎగైన్‌’ అంటూ సెల్‌ఫోన్‌ స్ర్కీన్‌పై కనిపించడంతో ఉపాధ్యాయులు విసిగిపోయారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మంగళవారం 20శాతం కూడా హాజరు నమోదు కాలేదని సమాచారం. స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించడం తెలియని ఉపాధ్యాయులు మరింతగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఫెషియల్‌ రికగ్నేషన్‌ హాజరు కోసం తోటి వారి సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పుణ్యకాలం కాస్తా ముగిసింది. ఈ విధానంపై కనీసం శిక్షణ కూడా ఉపాధ్యాయులకు ఇవ్వలేదని సంఘాల నాయకులు చెబుతున్నారు. హాజరు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్‌ తమ వ్యక్తిగత భద్రతకు ముప్పునకు భంగం కలిగించే విధంగా ఉందని పలువురు ఉపాఽధ్యాయులు ఆరోపిస్తున్నారు.   


హాజరైనా అబ్సంటే

పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల ఎల్‌ పాఠశాల, జానపాడు దళితవాడలోని ప్రాథమిక పాఠశాల, పిడుగురాళ్లలోని ఎస్‌ఆర్‌పీటీ పాఠశాలల్లో సకాలంలో ఉపాధ్యాయులు విధులకు హాజరైనా ముఖ హాజరుతో కుస్తీ పడినా ఫలితం లేకుండా పోయింది. ఉదయం 9.30 వరకు స్మార్ట్‌ఫోన్‌లో ముఖ హాజరు కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరకు పాతపద్ధతిలో సంతకాలతో సరిపుచ్చుకున్నారు. గురజాల నియోజకవర్గ పరిఽధిలో నాలుగు మండలాల్లో సుమారు 1456 మంది ఉపాధ్యాయులు వేలాది మంది విద్యార్థులున్నారు. మంగళవారం సెమ్స్‌ ఏపీయాప్‌లో 99శాతం ఉపాధ్యాయులు ముఖ హాజరుకోసం నానా కష్టాలు పడ్డా చివరకు ఆబ్సెంటే లెక్కలోకి వచ్చింది. బడికి వచ్చి హాజరు పడకపోవడంపై ఉపాధాయ్యయులు అసహనం వ్యక్తం చేశారు. 


యాప్‌ డౌన్‌లోడ్‌ అంతంతే..

హాజరుపై ప్రభుత్వం ప్రవేశపెట్టి విధానంపై ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా 20శాతం మంది ఉపాధ్యాయులు కూడా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. పల్నాడు జిల్లాలో అయితే 10 శాతం మంది కూడా డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. డౌన్‌లోడ్‌ చేసుకున్న ఉపాధ్యాయులకు యాప్‌ ద్వారా హాజరు నమోదు కాలేదు. అరగంట ముందుగానే అంటే 8.30 గంటలకే పాఠశాలకు వెళ్లి ముఖ హాజరుకోసం యాప్‌ ఓపెన్‌ చేస్తే సర్వర్‌ డౌన్‌ అని.. నెట్‌వర్క్‌ ఫెయిల్డ్‌ అని.. లోడింగ్‌ క్యాప్చర్‌ ఫెయిల్డ్‌ అని వస్తుండటంతో పదే పదే ఉపాధ్యాయులు గంటల కొద్ది కుస్తీ పడాల్సి వచ్చింది. గంటల తరబడి హాజరు నమోదుకు ప్రయత్నించినా సర్వర్‌ పని చేయలేదు. హాజరు నమోదుపై పల్నాడు ఇన్‌చార్జి డీఈవో వెంకటప్పయ్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించ లేదు. 


ఆందోళనకు తరలిన ఉపాధ్యాయులు 

హాజరు కోసం ప్రవేశపెట్టిన నూతన యాప్‌లను రద్దుపై ఆందోళనకు ఏపీటీఎఫ్‌ పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో మంగళవారం పలువురు ఉపాధ్యాయులు విజయవాడ ధర్నా చౌక్‌కు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు తరలివెళ్లారు. వెంటనే యాప్‌లను రద్దుచేయాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బసవలింగారావు తదితరులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివన్నారాయణ, ఎన్‌ రాంబాబు, విజయశ్రీ, వెంకటలక్ష్మి,  రాజేంద్రప్రసాద్‌, ఎం వెంకయ్య, రాష్ట్ర కౌన్సిలర్స్‌ మునగా వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. 

 

Updated Date - 2022-08-17T06:40:26+05:30 IST