Teachers' fight: హవ్వ.. ఈ ముగ్గురు టీచర్లు పబ్లిక్‌గా.. అందరూ చూస్తున్నా పట్టించుకోకుండా..

ABN , First Publish Date - 2022-10-04T03:34:23+05:30 IST

గాంధీ జయంతి రోజున ఓ పాఠశాలకు చెందిన ఓ ముగ్గురు టీచర్లు బాహాబాహీకి దిగారు.

Teachers' fight: హవ్వ.. ఈ ముగ్గురు టీచర్లు పబ్లిక్‌గా.. అందరూ చూస్తున్నా పట్టించుకోకుండా..

ఇంటర్నెట్ డెస్క్: గాంధీ జయంతి రోజున ఓ పాఠశాలకు చెందిన ముగ్గురు టీచర్లు బాహాబాహీకి దిగారు. విద్యార్థులకు మంచిచెడులు చెప్పాల్సిన వారు.. కనీస విచక్షణ కూడా మర్చిపోయి కలబడి కొట్టుకున్నారు. ఎంతలా అంటే.. పిల్లలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినిపించుకోకుండా నానా రభసా సృష్టించారు. దాదాపు 45 నిమిషాల పాటు వాళ్ల పంచాయితీ కొనసాగింది. చివరికి మ్యాటర్ జిల్లా విద్యాధికారి వద్దకు చేరడంతో ఆ ముగ్గురూ తగిన మూల్యమే చెల్లించుకున్నారు. ఉత్తరప్రదేశ్(Uttarpradesh) హమీర్‌పూర్(Hamirpur) జిల్లాలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


జిల్లాలోని కురారా ప్రాంతంలో ఓ బాలికల మాధ్యమిక పాఠశాల ఉంది. గాంధీ జయంతి కావడంతో పాఠశాల అంతా సందడిగా ఉంది. వివిధ కార్యక్రమాలు, డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొనేందుకు పిల్లలు రెడీ అవుతున్నారు. ఈలోపు పాఠశాల ప్రిన్సిపాల్..ప్రీతీ నిగమ్ ఓ తరగతి గదిలోకి వచ్చారు. సమయం మించిపోక ముందే.. జెండా వందనం కార్యక్రమం ప్రారంభించాలని చెప్పారు. పిల్లలు బయటి గ్రౌండ్‌లో నిలబడమని పురమాయించారు. అయితే.. అక్కడే ఉన్న నహీద్ హష్మీ అనే సహాయ ఉపాధ్యాయురాలు ఆమెతో వాదనకు దిగారు. ఇది చిలికి చిలికి గాలివానగా మారడంతో వారిద్దరూ కలబడి కొట్టుకోవడం ప్రారంభించారు. పక్కనే ఇదంతా నిలబడి చూస్తున్న మరో టీచర్ పుష్పలతా పాండే ఆ గొడవను ఫోన్‌లో రికార్డు చేయడం ప్రారంభించారు. 


ఇది గమనించిన ప్రిన్సిపాల్ ప్రితీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె వద్ద ఉన్న పర్సు లాక్కోవడంతో పాటూ వీడియో డిలీట్ చేయాలంటూ గొడవకు దిగారు. దీంతో.. వారి మధ్య కూడా గొడవ మొదలైంది. కొంతసేపటికి వారు తగాదా విరమించినప్పటికీ జరగవలసిన నష్టం అప్పటికే జరిగి పోయింది. జిల్లా విద్యాశాఖాధికారికి ఈ తగాదా గురించి తెలియడంతో ..ఆ ముగ్గురు టీచర్లూ సస్పెండ్ అయ్యారు. 

Updated Date - 2022-10-04T03:34:23+05:30 IST