ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంఘాల ర్యాలీ

ABN , First Publish Date - 2020-11-27T06:07:29+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు గురువారం నగరంలో వర్షంలోనే ర్యాలీ నిర్వహించాయి.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంఘాల ర్యాలీ
ప్రదర్శన నిర్వహిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు

గుంటూరు(విద్య), నవంబరు 26: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు గురువారం నగరంలో  వర్షంలోనే ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి రంగాన్ని ప్రైవేటీకరించే పనిలో పాలకులు ఉన్నారన్నారు. కరోనా సంక్షోభంలోనూ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బసవలింగారావు, యూటీఎఫ్‌ కోశాధికారి  ఎం కళాధర్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా  కార్యదర్శి నరసింహారావు, లక్ష్మీకాంత్‌ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.

జేఏసీ ఆధ్వర్యంలో.. 


గుంటూరు(కార్పొరేషన్‌): దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈదులమూడి మధుబాబు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు చెందిన కార్మికుల సంక్షేమం కోసం రాజ్యాంగంలో అంబేద్కర్‌ రూపొందించిన చట్టాలను ప్రస్తుత ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. సోమి శంకర్‌రావు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు ఆరు నెలలుగా ఉన్న హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బందెల రవికుమార్‌ మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, ఔట్‌సోర్సింగ్‌ కార్పోరేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం ర్యాలీగా హిందూ కళాశాల కూడలి వరకు వెళ్లి అక్కడ మానవహారం చేపట్టారు. 

Updated Date - 2020-11-27T06:07:29+05:30 IST