విలువలేని ‘విరమణ’.. ప్రమోషన్‌ లేకుండానే ఉపాధ్యాయుల రిటైర్మెంట్‌

ABN , First Publish Date - 2021-02-28T05:00:09+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో అన్ని అర్హతలు ఉన్నా ఉద్యోగంలో ఉన్నతి పొందకుండానే విరమణ పొందుతున్నామని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ధాల పాటు కష్టపడ్డా చివరికి కనీసం గుర్తింపులేని స్థితిలో వృత్తిని వదిలేయాల్సి వస్తోందని మదన పడుతున్నారు.

విలువలేని ‘విరమణ’.. ప్రమోషన్‌ లేకుండానే ఉపాధ్యాయుల రిటైర్మెంట్‌

అన్ని అర్హతలు ఉన్నా అందని ‘ఉన్నతి’

ఒక్క విద్యాశాఖలోనే ఈ ధోరణి

పేపర్‌ ప్రమోషన్‌ ఇచ్చి గౌరవించాలంటున్న టీచర్లు

‘సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్‌ నగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, వేంసూరులో మరో 

ఉపాధ్యాయిని బయాలజీ స్కూల్‌ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. వీరిలో ఒకరు ఈ నెల 28న, మరొకరు మార్చి నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఉద్యోగ విరమణ సహజమే కానీ ప్రమోషన్లు రాకుండానే ఏళ్ల తరబడి సేవలందించిన వారు రిటైరవుతుండడంతో ఆవేదన చెందుతున్నారు.. ఇలా ఉమ్మడి జిల్లాలో అనేకమంది ప్రభుత్వ ముందుచూపు లేమితో ఉద్యోగంలో ఉన్నతి లేకుండానే నిష్క్రమిస్తున్నారు.’

సత్తుపల్లి, ఫిబ్రవరి 27: రాష్ట్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో అన్ని అర్హతలు ఉన్నా ఉద్యోగంలో ఉన్నతి పొందకుండానే విరమణ పొందుతున్నామని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ధాల పాటు కష్టపడ్డా చివరికి కనీసం గుర్తింపులేని స్థితిలో వృత్తిని వదిలేయాల్సి వస్తోందని మదన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా అనేకమంది ఉపాధ్యాయులు ఉద్యోగోన్నతి పొందకుండానే రిటైర్‌ అవుతున్నారు. ఇటీవల పేనల్‌ గ్రేడ్‌ ప్రధానోపాధ్యాయులుగా అర్హత గల వారి వివరాలతో ఖమ్మం జిల్లా విద్యాశాఖ విడుదల చేసిన పదోన్నతుల పట్టిక చూస్తే పలు విషయాలు స్పష్టమవుతున్నాయి. పేనల్‌ ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం జనవరిలో విద్యాశాఖ విడుదల చేసిన పట్టికలో పైన ఉదహరించిన ఉపాధ్యాయుల పేర్లు 68, 15 క్రమసంఖ్యల్లో ఉన్నాయి. అనుకున్న వెంటనే పదోన్నతుల కౌన్సెలింగ్‌ జరిగి ఉంటే వారు పేనల్‌ గ్రేడ్‌ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొంది తదనంతరం ఉద్యోగ విరమణ చేసే వారు. కారణాలేమైనా సకాలంలో పదోన్నతులు జరగకపోవడంలో వచ్చే రెండు మూడు నెలల్లో అనేకమంది ఉపాధ్యాయులు కనీసం పేపర్‌ ప్రమోషన్‌ కూడా పొందకుండా ఉద్యోగ విరమణ చేయనున్నారు.  

ఒక్క విద్యాశాఖలోనే ఈ ధోరణి

పేనల్‌ గ్రేడ్‌ ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల పట్టిక ప్రకారం అర్హత గల వారిలో 1963లో జన్మించి ఈ సంవత్సరం వివిధ నెలల్లో ఉద్యోగ విరమణ చేస్తున్న వారు 30మంది వరకూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పదోన్నతులకు అన్ని అర్హతలు ఉన్నా అనేకమంది ఉపాధ్యాయులు ప్రభుత్వ ముందు చూపు లేమితో నిరాశతో ఉద్యోగ విరమణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ధోరణి ఒక్క విద్యాశాఖలోనే కనిపించడం విచారకరమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖలో ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ వివాదం న్యాయస్థానంలో నలుగుతోంది. ఈ విషయంపై ఉపాధ్యాయులు, ప్రభుత్వం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. కారణాలేమైనా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపటం లేదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. న్యాయస్థానంలో వివాదం తేలే వరకూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా అన్ని అర్హతలు కలిగి ఉద్యోగ విరమణ చేస్తున్న వారికి ఆ నెలలో పదోన్నతిని ఉత్తర్వుల రూపంలో (పేపర్‌ ప్రమోషన్‌) ఇస్తే కనీసం గౌరవంగా ఉద్యోగ విరమణ చేస్తారని కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరమైన అంశాలవైపు వెళ్లకుండా మేనేజ్‌మెంట్ల వారీగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయానికి వచ్చిందని, ఆ మేరకు పదోన్నతుల జాబితాను రూపొందించినట్టు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. కానీ ఉద్యోగోన్నతులు అమలు చేయకుండా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలను సాకుగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దినెలల్లో ఉద్యోగ విరమణ చేసే వారిని ఏదో ఒక పాఠశాలలో నియమిస్తే త్వరలోనే పోస్టు ఖాళీ అయి ఆ పాఠశాల తదుపరి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఏడాది వ్యవధిలో ఉద్యోగ విరమణ చేసే వారికి కనీసం పేపర్‌ ప్రమోషన్‌ అయినా ఇవ్వటం సముచితంగా ఉంటుందని చెబుతున్నారు. మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల వద్ద విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు వారుప్రధానోపాధ్యాయులుగా పనిచేసే స్థాయికి ఎదిగారు. వీరు మాత్రం మూడు దశాబ్దాలుగా ఒకే పోస్టులో పని చేసి ఉద్యోగ విరమణ చేస్తున్నారు. 

అర్హతలున్నా దక్కని ‘ఉన్నతి’

స్కూల్‌ అసిస్టెంట్లు పీజీతోపాటు ఎంఈడీ విద్యార్హతలు కలవారు కూడా ఉన్నారు. వీరు జూనియర్‌ కళాశాలల్లో ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో (డైట్‌) పని చేసే అర్హతలున్నా.. పదోన్నతులు లేక నష్టపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డైట్‌ శిక్షణ  కేంద్రాల్లో 95శాతం పోస్టులు ఖాళీగా ఉండి నామమాత్రం సిబ్బందితో నడుస్తున్నాయి. ప్రభుత్వం పదోన్నతులు విస్మరించటంతో ఇటు విద్యార్థులకు నష్టం, అటు ఉపాధ్యాయులకు మనోవేదనను మిగులుస్తోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పక్కనే ఆంధ్రప్రదేశ్‌లో గత ఆరేళ్లుగా క్రమం తప్పకుండా పదోన్నతులు జరుగుతున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం సరైన విధానాన్ని ప్రభుత్వం అనుసరించకపోవటంతో తాము నష్టపోతున్నామని అర్హత గల ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. 

Updated Date - 2021-02-28T05:00:09+05:30 IST