సార్లు పక్కదార్లు!

Published: Tue, 15 Feb 2022 23:42:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సార్లు పక్కదార్లు!

విధులకు ఎగనామం.. సర్వం సొంత వ్యాపారం

రియల్‌ఎస్టేట్‌ నుంచి ఆనలైన బిజినెస్‌ల వరకు

చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారాల్లో వారిదే పైచేయి

పాఠాలు చెప్పాల్సిన వేళల్లో పచ్చళ్లు, చీరల అమ్మకాలు

కొందరు ఉపాధ్యాయుల తీరుతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన


ఖమ్మం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : తప్పటడుగుల నుంచి తప్పించాల్సినవారే తప్పు పనులు చేస్తున్నారా? పిల్లలను సక్రమమార్గంలో నడిపి బావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వారే అక్రమమార్గం వైపు అడుగులు వేస్తున్నారా? అంటే ప్రస్తుతం అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు బతకలేక బడిపంతులు అన్న సామెతకు భిన్నంగా ఇప్పటి పరిస్థితులు మారాయి. అప్పట్లో ఉపాధ్యాయుల జీతాలు తక్కువగా ఉండటంతో ఆ సామెత రాగా.. ప్రస్తుతం వృత్తి ఆరంభంలోనే వేల రూపాయలు.. కొన్ని ఏళ్లు అనుభవజ్ఞులకైతే పెద్ద మొత్తంలోనే జీతం అందుతోంది. ప్రస్తుతం విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉపాధ్యాయులు. దేశాభివృద్ధిలో వారి భూమిక అంత ప్రధానమైనదిగా గుర్తించిన ప్రభుత్వాలు వారి జీతాలు విషయంలో రాజీపడటం మానేసి ప్రభుత్వ విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఉపాధ్యాయ లోకానికి ఎంత వెన్నుదన్నుగా నిలిస్తే విద్యారంగం అంత బలోపేతమవుతుందన్నది ప్రభుత్వాల భావన. మరి ప్రభుత్వం ఆశించిన మేర ఉపాధ్యాయులు అంతటిస్థాయిలో పనిచేస్తున్నారా? అంటే సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తోందని.. కొందరు విద్యారంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ విద్యను అందించాల్సిన ఉపాధ్యాయులు ఉత్తుత్తి బోధన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారన్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా కొందరు ప్రభుత్వ టీచర్లు పక్కదారి పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయుల్లో కొద్ది శాతం మినహా మిగిలిన వారంతా తమ సొంత వ్యాపారాలకోసం వేలమంది విద్యార్థుల భవిష్యత్తును బలిపెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు టీచర్లు వృత్తిని మరిచి ప్రవృత్తుల్లో మునిగిపోయారన్న విమర్శలు వినిపిస్తుండగా.. ఆయా ఉపాధ్యాయుల తీరు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. 


సొంత వ్యాపారాలతో బిజీబిజీ..

ఆర్థిక వృద్ధికోసం సొంత వ్యాపారాలు చేసుకోవడం తప్పుకాదు.. కానీ విధులకు ఎగనామం పెట్టి మరీ సొంత వ్యాపారాలు, ప్రైవేటు సేవల్లో మునిగిపోతున్నారు కొందరు ఉపాధ్యాయులు. అయితే విధులను పక్కనపెట్టి వాటికి ప్రాధాన్యమిస్తుండటం ఆందోళనకర పరిణామంగా పరిగణించాల్సిన అవసరం ఉందని కొందరు ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తించే చాలామంది ఉపాధ్యాయులు ఖమ్మం నగరంతోపాటు మధిర, సత్తుపల్లి, వైరా, కల్లూరు, భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలోని పలు పట్టణ ప్రధాన కేంద్రాల్లో అత్యధికంగా నివాసం ఉంటున్నారు. అయితే తాము ఉంటున్న ప్రాంతం నుంచి పాఠశాలకు వెళ్లి వచ్చేందుకే సమయం ఎక్కువ పట్టే నేపథ్యంలో కొందరు ఉపాధ్యాయులు తమ వృత్తిని పక్కన పెట్టి వ్యాపారాభివృద్ధి కోసం తాపత్రయపడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.


ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం మొదలుకుని ఎల్‌ఐసీ ఏజెంట్లు, చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారాలు, ఆన్‌లైన్ బిజినెస్‌లు, చైన్ స్కీం విక్రయాల వరకు జిల్లాలో సగానికి పైగా వారిచేతులమీదనుంచే నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇతర వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్న ఉపాధ్యాయులు ఆయా వ్యాపారాల్లో అక్రమాలకు పాల్పడటం మొత్తం విద్యారంగ వ్యవస్థకే మచ్చతెచ్చిపెడుతోంది. రియల్‌ ఎస్టేట్‌లో దొంగ వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయించడం మొదలు.. చిట్టీలు, గిరిగిరి, ఫైనాన్స్ వ్యాపారాలు, ఇటీవల వెలుగులోకి వచ్చిన క్రిప్టో కరెన్సీ లాంటి ఆన్‌లైన్‌ లావాదేవీలు.. ఇలా ఒకటేంటి బోలెడన్ని అక్రమాలకు పాల్పడుతున్నారనడానికి ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న పలు సంఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. 


కొందరు తెలివైన ఉపాధ్యాయులైతే విధులకు హాజరవుతూనే వ్యాపారాల్లో మునిగి తేలుతుంటే.. ఇంకొందరేమో రియల్టర్లు, ఫైనాన్స్ వ్యాపారుల అవతారమెత్తుతున్నారు. కొందరు ఉపాధ్యాయులు భార్యల పేర్లతో వారే వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 


పురుషులకు ధీటుగా మహిళా టీచర్లు

ఉపాధ్యాయుల కంటే తామేమి తక్కువ కాదని నిరూపిస్తున్నారు కొందరు మహిళా టీచర్లు. పాఠాలు చెప్పాల్సిన వేళ్లల్లో పచ్చళ్లు, చీరల వ్యాపారాలు చేస్తూ ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా  తాము పనిచేస్తున్న ప్రాంతాల్లోనే  చీరల వ్యాపారం చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఉదయం పాఠశాలకు వెళ్లేటప్పుడు పచ్చళ్ల శాంపిళ్లను, చీరల మూటలను వెంటపెట్టుకుని వెళ్తున్న వారు ఉన్నారంటే వారి వ్యాపార ధోరణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రతీ మండలంలో విధులకు ఎగనామం పెట్టి వ్యాపారాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకరిని చూసి మరొకరు కొత్త వ్యాపారాలు మొదలు పెడుతున్నారని విద్యార్ధులే చెప్పేస్థాయికి వచ్చారంటే టీచర్ల సొంత వ్యాపారాలు ఏ మేరకు విస్తరించాయో అర్థమవుతోంది.


వారి తీరుతో తల్లిదండ్రుల్లో ఆందోళన

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి కొందరు ఉపాధ్యాయుల తీరే కారణమని భావిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. కొందరు ఉపాధ్యాయులు ఇలా సొంతవ్యాపారాలు చేసుకుంటూ సరైన బోధన చేయడంలేదని వాపోతున్నారు. నాణ్యమైన విద్య అందని కారణంగా ఆర్థికంగా భారమైనా ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్నామని చెబుతున్నారు. కానీ అంతా ప్రైవేటు బాట పట్టలేరు కదా... ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించలేక సర్కారు బడులకు పంతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇలాంటి ఉపాధ్యాయుల తీరుతో విసుగుచెందుతున్నారు. తమ బిడ్డలకు చదువు సరిగ్గా అబ్బదేమోనని ఆందోళన చెందుతున్నారు. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మరింత దిగజారడంతోపాటు విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోయే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విధులకు ఎగనామం పెట్టి సొంతవ్యాపారాలు చేసుకుంటున్న టీచర్లపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఖమ్మం Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.