బోధలన్నీ వారి కోసమే

ABN , First Publish Date - 2021-09-17T05:30:00+05:30 IST

మనిషి మీద పరిస్థితులు, అనుభవాలు గట్టి ప్రభావం చూపిస్తాయి. అలాగే మంచి ప్రబోధాలు వినడం, చదవడం వల్ల కూడా మనసు ప్రభావితమవుతుంది. ప్రబోధకుల ప్రవచనాలు, నీతి కావ్యాలు విశేషంగా వింటే మనసు తప్పు దారులు తొక్కదు...

బోధలన్నీ వారి కోసమే

మనిషి మీద పరిస్థితులు, అనుభవాలు గట్టి ప్రభావం చూపిస్తాయి. అలాగే మంచి ప్రబోధాలు వినడం, చదవడం వల్ల కూడా మనసు ప్రభావితమవుతుంది. ప్రబోధకుల ప్రవచనాలు, నీతి కావ్యాలు విశేషంగా వింటే మనసు తప్పు దారులు తొక్కదు. అయితే కొందరు ఎన్ని మంచి ప్రబోధాలు విన్నా మారరు, మూర్ఖంగానే ఉంటారు. ‘చేరి మూర్ఖుని మనసు రంజింపలే’మని భర్తృహరి చెప్పిన మాట ఇలాంటి వారి గురించే. వీరు చాలా తక్కువ మంది ఉంటారు. 


అలాగే మరికొందరుంటారు. వారు ప్రబోధాలు వినకపోయినా సహజంగానే మంచి మార్గంలో ఉంటారు. మానవీయంగా ఆలోచిస్తారు. అలాంటివారు ప్రాజ్ఞులు. వీరి సంఖ్య కూడా తక్కువే. మనుషుల్లో ఈ రెండు కోవలకూ చెందనివారే ఎక్కువ మంది ఉంటారు. వారు మంచి ప్రబోధాలు వింటే, తమలోని చెడును తొలగిచుకొని మంచి వైపు మళ్ళుతారు. వారి మీద నైతిక విద్య బలంగా పని చేస్తుంది. దాని ఫలితం వీరిలో బాగా కనిపిస్తుంది. నైతిక విద్య అనేది ఎంత చెప్పినా మారని మూర్ఖుల కోసమో, ఎవరూ చెప్పకపోయినా మంచి కర్మలు చేసే ప్రాజ్ఞుల కోసమో కాదు.. అధికశాతం ఉన్న ఈ విజ్ఞుల కోసమే.

బుద్ధుడు ఈ విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్పాడు. బౌద్ధ సంఘంలో కొందరు మూర్ఖులు ఉండేవారు. ఎంత చెప్పినా చెవికి ఎక్కించుకొనేవారు కాదు. మూర్ఖత్వం వీడేవారు కాదు. కోశంబీ నగరానికి దగ్గరలో ఉన్న ఘోషితారామంలో ఇలాంటివారు కొందరు ఉండేవారు. ఈ మూడు రకాల వారి గురించి బుద్ధుడు ప్రస్తావిస్తూ ‘‘రోగులు మూడు రకాలు. వారికి వచ్చే రోగాలు కూడా మూడు రకాలే. కొన్ని రోగాలు ఔషధం వేయకపోయినా తగ్గిపోతాయి. కొన్ని రోగాలకు ఎన్ని ఔషధాలు వాడినా తగ్గవు. ఇలాంటి రోగాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ, ఎక్కువ రోగాలు ఔషధం తీసుకోవడం వల్ల నయమవుతాయి. వైద్యం, ఔషధాలు ఈ ఎక్కువమంది కోసమే! అలాగే నా ప్రబోధాలు, ధమ్మ ప్రవచనాలు, ధర్మం గురించి విని అధర్మ మార్గం నుంచి మళ్ళే అశేష ప్రజల కోసమే! ఎంత చెప్పినా మారని ఒకరిద్దరు మూర్ఖులు, చెప్పకుండానే తమను తాము సరిదిద్దుకొనే ఒకరిద్దరు ప్రాజ్ఞుల కోసం కాదు’’ అంటూ మనిషిని, మనసులను రోగులతో, వైద్యంతో పోల్చి చెప్పాడు. ఎందుకంటే, మనం చెడు మార్గాల్లో ఉండడం కూడా ఒక మనోరుగ్మతే కాబట్టి. అందుకే బుద్ధుణ్ణి ‘భైషజ్య గురువు’ అంటారు. అంటే ‘వైద్యులకు గురువు’ అని అర్థం.

- బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2021-09-17T05:30:00+05:30 IST