కార్తీక్‌ Xపంత్‌

ABN , First Publish Date - 2022-08-16T10:14:19+05:30 IST

ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టులో ప్రతీ స్థానానికి గట్టి పోటీ నెలకొంది. ఐపీఎల్‌ పుణ్యమా అని నైపుణ్యం కలిగిన యువ ఆటగాళ్ల రాకతో టీమిండియా రిజర్వ్‌ బెంచ్‌ అత్యంత..

కార్తీక్‌ Xపంత్‌

 ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టులో ప్రతీ స్థానానికి గట్టి పోటీ నెలకొంది. ఐపీఎల్‌ పుణ్యమా అని నైపుణ్యం కలిగిన యువ ఆటగాళ్ల రాకతో టీమిండియా రిజర్వ్‌ బెంచ్‌ అత్యంత పటిష్టంగా మారింది. అందుకే ఎన్నడూ లేని రీతిలో ఇటీవలి కాలంలో రెండు భారత జట్లతో సిరీ్‌సలను ఆడిస్తున్నారు. కెప్టెన్ల విషయంలోనూ పలు ప్రత్యామ్నాయాలు ఉండడం విశేషం. ఇలాగే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను యువ ఆటగాళ్లతో ధవన్‌ కెప్టెన్సీలో ఆడించారు. అయినా సిరీస్‌ను జట్టు గెలుచుకుంది. ఆసియాకప్‌ కోసం సీనియర్లు విశ్రాంతి తీసుకుంటుండడంతో ఇప్పుడు కూడా జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ ఆధ్వర్యంలో ద్వితీయ శ్రేణి జట్టే వెళ్లింది. ఆటగాళ్లంతా సత్తా చాటుతుండడంతో ప్రతీ విభాగంలోనూ బెర్త్‌ కోసం విపరీతమైన పోటీ నెలకొంది.


ఓపెనింగ్‌, మిడిలార్డర్‌లకు తగ్గట్టుగానే వికెట్‌ కీపింగ్‌ కోసం రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ ఎదురుచూస్తున్నారు. వీరిలో పంత్‌ నెంబర్‌వన్‌ కీపర్‌గా కొనసాగుతున్నా, అతడికి డీకే నుంచి గట్టి సవాలే ఎదురవుతోంది. అందుకే రానున్న ఆసియాకప్‌లో ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరికీ చోటు లభిస్తుందా? లేక ఒక్కరినే కొనసాగిస్తారా? అనే విషయం తేలాలి. ఇద్దరూ మ్యాచ్‌ విన్నర్లే కావడంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. తమదైన రోజున స్వల్ప వ్యవధిలోనే ఆట స్వరూపాన్ని మార్చేయగల సత్తా వీరి సొంతం. మరోవైపు తమ మధ్య ఉన్న పోటీ గురించి ఎలాంటి ఆందోళన లేదని పంత్‌ స్పష్టం చేస్తున్నాడు. వందశాతం అంకితభావంతో ఆడేందుకే తాము చూస్తామని, తుది జట్టులో ఎవరిని ఆడించాలనేది పూర్తిగా కోచ్‌, కెప్టెన్‌ నిర్ణయమని తేల్చాడు. చివరి 10 ఇన్నింగ్స్‌లో వీరి ఆటను పరిశీలిస్తే పంత్‌ అత్యధిక స్కోరు 44 కాగా, అతను మొత్తం 171 పరుగులు చేశాడు.


దినేశ్‌ కార్తీక్‌ 55 పరుగుల అత్యధిక స్కోరుతో 155 రన్స్‌ సాధించాడు. ఈ మ్యాచ్‌ల్లో పంత్‌ ఓపెనింగ్‌, మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయగా.. డీకే ఫినిషర్‌గానే బరిలోకి దిగాడు. ఇటీవలి ఇంగ్లండ్‌, టీ20 సిరీ్‌సల్లో ఇద్దరూ తుది జట్టులో ఉండడం విశేషం. మరోవైపు పంత్‌, కార్తీక్‌లలో ఒక్కరినే ఆడించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా అయితేనే జట్టు సమతూకంగా ఉంటుందన్నారు.టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు భారత జట్టు ఆసియాకప్‌ ఆడనుంది. ఈ సమస్య పరిష్కారానికి ఈ టోర్నీ చక్కటి వేదిక కానుంది. అలాగే ఆసియా కప్‌ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతోనూ టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఏదిఏమైనా మెగా టోర్నమెంట్‌ కోసం చివరి నిమిషంలో తుది జట్టును ఖరారు చేయడానికి బదులు ఈ టోర్నీల ద్వారానే టీమ్‌ మేనేజ్‌మెంట్‌.. టైటిల్‌ వేటగాళ్లపై స్పష్టతకు రావాల్సిన అవసరం ఉంది.

                                                           - (ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

Updated Date - 2022-08-16T10:14:19+05:30 IST