తెలంగాణ ఎంసెట్‌లో సత్తాచాటారు

ABN , First Publish Date - 2022-08-13T06:55:06+05:30 IST

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో విశాఖ విద్యార్థులు ప్రతిభచూపారు.

తెలంగాణ ఎంసెట్‌లో సత్తాచాటారు

విశాఖ విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో 4, 5, 7, 14, 19 ర్యాంకులు


విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో విశాఖ విద్యార్థులు ప్రతిభచూపారు. ఇప్పటివరకు జేఈఈ మెయిన్స్‌, ఏపీ ఈఏపీసెట్‌లో టాప్‌ ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులే తెలంగాణ ఎంసెట్‌లోనూ సత్తాచాటారు. ఇంజనీరింగ్‌ విభాగంలో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు పి.జలజాక్షి నాలుగో ర్యాంకు, మెండ హిమవంశీ ఐదో ర్యాంకు, డి.జాన్‌ జోసెఫ్‌ ఏడో ర్యాంకు, డి.శరణ్య 14, బి.సిద్ధార్థ రాయ్‌ 19, భోగి సిరి 30, కె.సుహాస్‌ 37, అనూప్‌ 66, సీహెచ్‌ అభిజిత్‌ 90వ ర్యాంకు సాధించారు. వీరిలో హిమ వంశీ, జలజాక్షి, సుహాస్‌లు జేఈఈ మెయిన్స్‌లో 100 పర్సంటైల్‌ సాధించారు. కాగా అగ్రికల్చర్‌/ఫార్మశీ కేటగిరీలో శ్రీచైతన్య కళాశాలలకు చెందిన వేగి నితిన్‌సాయి 26, జి.హర్షవర్దన్‌ 59, ఐ.జ్యోతిక 78, దిగుమర్తి వైష్ణవ్‌ 82, డొంకాడ ప్రజ్వల్‌ 95, గోపంశెట్టి నాగవరుణ్‌ 96వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. నగరంలో మిగిలిన కార్పొరేట్‌ కళాశాలల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. అయితే ఏపీ, తెలంగాణ ఎంసెట్‌లో 500 ర్యాంకులోపు వచ్చిన విద్యార్థులు జేఈఈ, నీట్‌లలో ర్యాంకుల ఆధారంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, వైద్య కళాశాలల్లో ప్రవేశాలు తీసుకుంటారు. 


ఎంపీడీవోలకు పదోన్నతులు

విశాఖపట్నం డీఆర్‌డీఏ పీడీగా లక్ష్మీపతి

విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో)కు ఎట్టకేలకు పదోన్నతులు లభించాయి. విజయనగరం ఎంపీడీవో సత్యనారాయణను విశాఖపట్నం జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవోగా నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ ఎంపీడీవో కె.భాగ్యారావును అడ్డతీగలలో డ్వామా ఏపీడీగా, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ఎంపీడీవో బీవీ సత్యనారాయణను విజయనగరం జిల్లా డ్వామా ఏవోగా, నక్కపల్లి ఎంపీడీవో రమేష్‌రామన్‌ను విజయనగరం డ్వామా ఏపీడీగా, నాతవరం ఎంపీడీవో ఈ.నాగలక్ష్మిని విశాఖపట్నం డ్వామా కార్యాలయంలో మానటరింగ్‌ అండ్‌ ఈ-వాల్యూయేషన్‌ అసిస్టెంట్‌ ప్రోగ్రామ్‌ అధికారిగా నియమించారు.  అలాగే మునగపాక ఎంపీడీవో ఉదయశ్రీని నర్సీపట్నం డీఎల్‌డీవో (డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి)గా, పెందుర్తి ఎంపీడీవో మంజులవాణిని అనకాపల్లి డీఎల్‌డీవోగా, దేవరాపల్లి ఎంపీడీవో సుబ్బలక్ష్మిని విశాఖ డీఎల్‌డీవోగా, విశాఖలో డ్వామా విజిలెన్స్‌ అధికారిణిగా వున్న పూర్ణిమాదేవిని అరకులోయ ఏపీడీగా నియమించారు. ఆమె స్థానంలో పద్మనాభం ఎంపీడీవో నిర్మలాదేవిని నియమించారు. ఇంకా కోటవురట్ల ఎంపీడీవో చిట్టిరాజును శ్రీకాకుళం డ్వామా పీడీగా బదిలీ చేశారు. విశాఖపట్నం జిల్లా సమగ్రశిక్షా అభియాన్‌ అడిషనల్‌ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ బి.శ్రీనివాసరావు, విశాఖ డ్వామా పీడీ ఈ.సందీప్‌లకు పదోన్నతులు కల్పిస్తూ అదే పోస్టులో కొనసాగించారు. 

విశాఖపట్నం డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా శ్రీకాకుళం జడ్పీ సీఈవో లక్ష్మీపతిని నియమించారు. ఇప్పటివరకు విశాఖ డీఆర్‌డీఏ పీడీగా ఏపీఐఐసీ డిప్యూటీ కలెక్టర్‌ అనిత ఇన్‌చార్జిగా ఉన్నారు. అలాగే విశాఖ జడ్పీ అకౌంట్స్‌ ఆఫీసర్‌ డి.శాంతలక్ష్మిని తూర్పుగోదావరి జిల్లా డ్వామా కార్యాలయంలో ఫైనాన్స్‌ మేనేజర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. కాగా పదోన్నతులు పొందిన ఎంపీడీవోలు రెండు, మూడు రోజుల్లో నియమించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఖాళీ కానున్న స్థానాల్లో మండల పరిషత్‌ కార్యాలయం ఏవో/ఈవోఆర్డీలకు ఎంపీడీవోలకు అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. 


జడ్పీ ఇన్‌చార్జి సీఈవోగా సత్యనారాయణ

విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ ఇన్‌చార్జి సీఈవోగా సత్యనారాయణకు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఎంపీడీవోల పదోన్నతుల్లో భాగంగా విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న సత్యనారాయణను విశాఖ జడ్పీ డిప్యూటీ సీఈవోగా ప్రభుత్వం నియమించింది. అయితే జడ్పీ సీఈవో పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఇప్పటివరకు గ్రామీణ నీటి సరఫరా విభాగంలో స్వచ్ఛభారత్‌ కో-ఆర్డినేటరు ఎం.విజయకుమార్‌ ఇన్‌చార్జి సీఈవోగా కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఈవోగా నియమితులైన సత్యనారాయణ శుక్రవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకే సీఈవో బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. 

Updated Date - 2022-08-13T06:55:06+05:30 IST