కల చెదిరింది!

Published: Mon, 28 Mar 2022 04:14:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కల చెదిరింది!

వరల్డ్‌కప్‌ నుంచి భారత్‌ అవుట్‌

సౌతాఫ్రికా చేతిలో ఓటమి

చిన్న తప్పిదం.. టీమిండియా వరల్డ్‌కప్‌ ఆశలను అడియాశలు చేసింది. అనేక మలుపులు తిరుగుతూ.. చివరి బంతి వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో.. భారత్‌ను అదృష్టం వెక్కిరించింది. ఒక్క నోబాల్‌తో మ్యాచ్‌ ఫలితం మొత్తం తారుమారైంది. సెమీస్‌ చేరాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడి మిథాలీ సేన ఇంటిముఖం పట్టింది. 


క్రైస్ట్‌చర్చ్‌: భారత మహిళల వరల్డ్‌కప్‌ కల మరోసారి భగ్నమైంది. సెమీస్‌ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో గత రన్నరప్‌ టీమిండియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (71), షఫాలీ వర్మ (53), మిథాలీ రాజ్‌ (68) అర్ధ శతకాలతో రాణించారు. ఛేదనలో దక్షిణాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 275/7 స్కోరు చేసి నెగ్గింది. లారా ఉల్వెర్డ్‌ (80), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ మిగ్నాన్‌ డు ప్రీజ్‌ (52) సఫారీల గెలుపులో కీలకపాత్ర పోషించారు. వెన్ను నొప్పి కారణంగా జులన్‌ గోస్వామి ఈ మ్యాచ్‌కు దూరమైంది. ఈ ఓటమితో 7 మ్యాచ్‌ల నుంచి మొత్తం 6 పాయింట్లు సాధించిన భారత్‌.. ఐదో స్థానంతో ఇంటిముఖం పట్టింది. 


కొంపముంచిన నోబాల్‌:

నాటకీయ పరిణామాల మధ్య.. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ వీక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి ఓవర్‌లో ప్రొటీస్‌ విజయానికి 7 పరుగులు అవసరమవగా.. దీప్తి తొలి నాలుగు బంతుల్లో 4 రన్స్‌ మాత్రమే ఇచ్చింది. త్రిష (7) రనౌట్‌ అయింది. ఇక చివరి రెండు బంతుల్లో 3 పరుగులు కావాల్సి ఉండగా.. ఐదో బంతికి డు ప్రీజ్‌ క్యాచ్‌ అవుట్‌ అయింది. కానీ, దీప్తి ఓవర్‌స్టెప్‌ అయిందంటూ అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించడంతో టీమిండియా ఆనందం ఆవిరైంది. ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు సింగిల్స్‌తో సౌతాఫ్రికా గెలిచింది. అంతకుముందు ఉల్వెర్డ్‌, లారా (49) రెండో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. కానీ, ఒత్తిడి పెంచాల్సిన సమయంలో భారత ఫీల్డింగ్‌ వైఫల్యాలు అవకాశాలను దెబ్బతీశాయి. 45వ ఓవర్‌లో డు ప్రీజ్‌ ఇచ్చిన క్యాచ్‌ను మంధాన వదిలేయడంతో.. భారత్‌ భారీమూల్యం చెల్లించుకుంది. 


ఆరంభం అదిరినా..:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు స్మృతి, షఫాలీ.. తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు పునాది వేశారు.  షఫాలీ రనౌట్‌ కాగా.. యాస్తిక (2) బౌల్డ్‌ అయింది. కానీ, మంధాన, మిథాలీ మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతున్న సమయంలో.. క్లాస్‌ బౌలింగ్‌లో ట్రయాన్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో మంధాన పెవిలియన్‌ చేరింది. ఆ తర్వాత మిథాలీ, హర్మన్‌ప్రీత్‌ (48) ఎదురుదాడి చేయడంతో.. ఓ దశలో భారత స్కోరు 300 మార్క్‌ దాటేలా కనిపించింది. కానీ, మిథాలీ అవుటైన తర్వాత స్కోరు వేగం మందగించింది. పూజ (3), రిచా (8), హర్మన్‌ పెవిలియన్‌ చేరడంతో.. డెత్‌ ఓవర్లలో భారత్‌ ధాటిగా ఆడలేక పోయింది. 


స్కోరుబోర్డు

భారత్‌:

స్మృతి మంధాన (సి) ట్రయాన్‌ (బి) క్లాస్‌ 71, షఫాలీ (రనౌట్‌/లూస్‌) 53, యాస్తిక (బి) ట్రయాన్‌ 2, మిథాలీ (సి) ట్రయాన్‌ (బి) క్లాస్‌ 68, హర్మన్‌ప్రీత్‌ (బి) ఖాకా 48, పూజ (సి) లూస్‌ (బి) ఇస్మాయిల్‌ 3, రిచా (సి) లూస్‌ (బి) ఇస్మాయిల్‌ 8, స్నేహ్‌ (నాటౌట్‌) 1, దీప్తి (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 50 ఓవర్లలో 274/7; వికెట్ల పతనం: 1-91, 2-96, 3-176, 4-234, 5-240, 6-268, 7-271; బౌలింగ్‌: షబ్నిం ఇస్మాయిల్‌ 10-1-42-2, మరిజన్నే కాప్‌ 9-0-56-0, అయోబంగ ఖాకా 9-0-58-1, ట్రయాన్‌ 10-0-51-1, మస్తబా క్లాస్‌ 8-0-38-2, సునే లూస్‌ 4-0-26-0. 


దక్షిణాఫ్రికా:

లిజెల్లీ లీ (రనౌట్‌/హర్మన్‌) 6, లారా ఉల్వెర్డ్‌ (బి) హర్మన్‌ 80, లారా (స్టంప్డ్‌) రిచా (బి) గైక్వాడ్‌ 49, లూస్‌ (ఎల్బీ) హర్మన్‌ 22, మిగ్నన్‌ డు ప్రీజ్‌ (నాటౌట్‌) 52, ఖాప్‌ (రనౌట్‌/రిచా) 32, ట్రయాన్‌ (సి అండ్‌ బి) రాజేశ్వరి 17, త్రిష చెట్టి (రనౌట్‌/హర్మన్‌) 7, ఇస్మాయిల్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 50 ఓవర్లలో 275/7; వికెట్ల పతనం: 1-14, 2-139, 3-145, 4-182, 5-229, 6-255, 7-270; బౌలింగ్‌: మేఘన 6-0-37-0, దీప్తి 10-0-41-0, స్నేహ్‌ రాణా 10-0-54-0, రాజేశ్వరీ గైక్వాడ్‌ 10-0-61-2, పూజ 6-1-37-0, హర్మన్‌ప్రీత్‌ 8-0-42-2.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.