కదిలిస్తే కన్నీరే.. సీతమ్మా..!

ABN , First Publish Date - 2021-07-27T04:35:42+05:30 IST

సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ నిర్మించిన దుమ్ముగూడెం ఆనకట్ట కారణంగా పాడి, పంటలతో విరాజిల్లిన గ్రామాలు నేడు వరుస ప్రాజెక్టులు రావటంతో సాగు భూములు కోల్పోయాయి.

కదిలిస్తే కన్నీరే.. సీతమ్మా..!
ప్రాజెక్ట్‌ పనులనుఅడ్డుకుంటున్న నిర్వాసిత రైతులు

  సీతమ్మసాగర్‌ నిర్వాసితుల గోడు పట్టేదెవరికి?

సర్వం కోల్పోతున్న అమ్మగారిపల్లి రైతులు

ఎకరాకు రూ.8లక్షలు ప్రకటించిన ప్రభుత్వం

రూ.25లక్షలు డిమాండ్‌ చేస్తున్న రైతులు

అశ్వాపురం, జూలై 26: సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ నిర్మించిన దుమ్ముగూడెం ఆనకట్ట కారణంగా పాడి, పంటలతో విరాజిల్లిన గ్రామాలు నేడు వరుస ప్రాజెక్టులు రావటంతో సాగు భూములు కోల్పోయాయి. ఉన్న కొద్దిపాటి భూములను సాగుచేసుకుంటున్న రైతులకు మరో ప్రాజెక్ట్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సీతమ్మసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంతో అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి, కుమ్మరిగూడెం గ్రామాల సాగుభూములను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూములు ఇవ్వటానికి కూడా రైతులు సిద్ధపడ్డారు. కానీ తగిన పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించకపోవడంతో ఆందోళన బాటపట్టారు. సీతమ్మసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా  దుమ్ముగూడెం, చర్ల, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో 3500ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా 1,816ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. పరిహారం కింద ప్రభుత్వం రూ.8లక్షలు ప్రకటించింది. అయితే మిగతా మండలాల పరిస్థితి ఒకవిధంగా ఉంటే అశ్వాపురం మండల పరిస్థితి భిన్నంగా ఉంది. మండలంలోని పై గ్రామాల్లో రైతులు ఇప్పటికే మణుగూరు హెవీవాటర్‌ ప్లాంట్‌, సీతారామప్రాజెక్ట్‌, మిషన్‌ భగీరథ ప్రాజెక్ట్‌ల్లో భూములు కోల్పోయారు. తాజాగా సీతమ్మసాగర్‌ ప్రాజెక్ట్‌తో ఉన్న భూమిని కూడా కోల్పోతుండటంతో జీవనోపాధి కోల్పోతున్నామని, తమకు మెరుగైన ప్యాకేజీ ద్వారా ఎకరాకు రూ.25లక్షలు ఇవ్వటంతో పాటు, ప్రాజెక్టులో ఉపాధి కల్పించాలని ఇక్కడి రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

హైకోర్టును ఆశ్రయించిన నిర్వాసితులు

ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని కొందరు రైతులు తీసుకోగా, మెజారిటీ రైతులు మెరుగైన ప్యాకేజీ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ లోగా ప్రాజెక్ట్‌ అధికారులు రైతుల భూముల్లో పనులు ప్రారంభించేందుకు సిద్ధపడటంతో రైతులు  ఆందోళన బాటపట్టారు. దీనిలో భాగంగా తమ భూముల్లోనే వారంరోజులుగా రిలే నిరహారదీక్షలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన నిర్వాసిత రైతు వెంకట్రామిరెడ్డి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

 ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలి: నేలపట్ల వెంకటరమణారెడ్డి, రైతు 

సీతమ్మసాగర్‌ ప్రాజెక్ట్‌ భూనిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలి.  నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగావకాశం కల్పించాలి. అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తాం

రూ.25లక్షలు చెల్లించాలి: గాదె ధనమ్మ,  రైతు

ఎకరాకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలి. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టుల కింద భూములను కోల్పోయాం. ప్రభుత్వం అరకొరగా పరిహారం ఇవ్వాలని చూస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటంలేదు.

స్పష్టమైన హమీ ఇవ్వాలి: నేలపట్ల వెంకట్రామిరెడ్డి, రైతు

ఇప్పటికే భూములన్నీ కోల్పోయాం. ఇప్పుడేనా ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించాలి. అప్పటివరకు మా భూములజోలికి వస్తే ఆత్మహత్యలకైనా సిద్ధం.


Updated Date - 2021-07-27T04:35:42+05:30 IST