పేదల స్థలాలపై కన్నేశారు..!?

ABN , First Publish Date - 2021-10-17T06:08:37+05:30 IST

కడప నగర నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా 187, 311, 754 తదితర సర్వే నెంబర్లలో 11 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ ప్రాంతాన్ని మృత్యుంజయకుంట అంటారు. ఒక్కప్పుడు పెద్ద చెరువుగా ఉండే ఆ ప్రాంతం

పేదల స్థలాలపై కన్నేశారు..!?
మృత్యుంజయకుంటలో పేదల ఇళ్లు కూల్చేసి చదును చేసిన రెవిన్యూ అధికారులు

మృత్యుంజయకుంటలో 25 ఏళ్లకుపైగా నివాసాలు

ప్రభుత్వం డీకేటీ పట్టాలు జారీ

2018లో డీనోటిఫై చేయడంతో క్రయవిక్రయాలు

ఇప్పుడు ప్రభుత్వ స్థలం అంటూ గుడిసెలు తొలగింపు

బడాబాబుల ఇళ్ల జోలికి వెళ్లని అధికారులు

తెరవెనుక అధికార పార్టీ ఓ ప్రజాప్రతినిధి పాత్రపై ఆరోపణలు


మృత్యుంజయకుంట.. నగర నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ స్థలం. పేదలు పాతికేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం డీకేటీ పట్టాలు కూడా ఇచ్చింది. డీనోటిఫై చేయడంతో క్రయవిక్రయాలు జరిగాయి. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో స్టాంపు డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన కూడా చేసుకున్నారు. ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ వస్తున్నారు. అక్కడ సెంటు ధర రూ.10 లక్షలు పైమాటే. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రెవిన్యూ అధికారులు యంత్రాలతో వాలిపోయి పేదల గుడిసెలు, రేకుల షెడ్లు తొలగించి చదును చేశారు. టీకేటీ పట్టా ఉందని.. ఆ పట్టా చూపిస్తే అది చెల్లదన్నారని బాధితుల కన్నీటి వేదన. అయితే బడాబాబుల ఇళ్ల జోలికి మాత్రం వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు ఖాళీ చేయిస్తున్న స్థలం విలువ రూ.12 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. దీని వెనుక అధికార పార్టీ ఓ కీలక ప్రజాప్రతినిధి పాత్ర ఉందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఆ వివరాలపై ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): కడప నగర నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా 187, 311, 754 తదితర సర్వే నెంబర్లలో 11 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ ప్రాంతాన్ని మృత్యుంజయకుంట అంటారు. ఒక్కప్పుడు పెద్ద చెరువుగా ఉండే ఆ ప్రాంతం నగర విస్తరణతో పాటు ఆక్రమణకు గురైంది. పలువురు పేదలు గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివాసం ఉంటున్నారు. 2002లో నాటి ప్రభుత్వం ఆదేశం మేరకు అప్పటి తహసీల్దారు సత్యనారయణ అక్కడ నివాసం ఉంటున్న పేదలకు ఇంటి నివాస పట్టా (డీఫారం) ఇచ్చారు. ఆ పట్టా రావడంతో కొందరు అప్పులు చేసి పక్కా ఇల్లు కట్టుకున్నారు. కొందరు గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివాసం ఉంటున్నారు. 25-30 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్నారు. విద్యుత అధికారులు కరెంట్‌ మీటరు ఇచ్చారు. కార్పొరేషనకు ఇంటి పన్ను, నీటి పన్నులు కూడా చెల్లిస్తున్నారు. 2019లో నాటి టీడీపీ ప్రభుత్వం మృత్యుంజయకుంటకు చెందిన కొన్ని సర్వే నంబర్లు డీనోటిఫై చేయడంతో క్రయవిక్రయాలు జరిగాయని బాధితులు పేర్కొంటున్నారు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయడంతో కొనుగోలుదారులు ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీని చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కొందరు బ్యాంకు రుణాలు తీసుకుని పక్కా భవనాలు కట్టుకున్నట్లు తెలుస్తోంది. 


ఇన్నేళ్లు కళ్లకు గంతలు కట్టుకున్నారా..?

మృత్యుంజయకుంట భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు రెవిన్యూ అధికారులే డీఫారం పట్టాలు ఇచ్చారు. వందలాది మంది పక్కా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 20 ఏళ్లుగా అది ప్రభుత్వ భూమి.. ఆక్రమణకు గురైందని ఏ అధికారికి కనిపించలేదా..? ముందస్తు సమాచారం.. నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లు తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కుంట ప్రభుత్వ భూమి 11 ఎకరాలు ఉంది. అందులో సుమారుగా 10 ఎకరాలకు పైగా కబ్జాకు గురైందని రెవిన్యూ అధికారులే అంటున్నారు. నిజంగా ఆక్రమణ అనుకుంటే పది ఎకరాల్లో ఉన్న నివాసాలు అన్నింటికి నోటీసు జారీ చేసి.. ఖాళీ చేయడానికి కొంత సమయం ఇచ్చి ఆ తరువాత తొలగించి ఉంటే ఎలాంటి విమర్శలు ఉండేవి కాదు. కేవలం సర్వే నంబర్లు 167, 311, 754 పరిధిలో కేవలం 1.20 ఎకరాలు మాత్రమే ఖాళీ చేయించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటీ..? అన్న ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఎలాంటి వివాదాలు లేని ఆక్రమణలను క్రమబద్ధీకరణ చేయమని ఓ పక్క ప్రభుత్వమే చెబుతుంటే.. మరోపక్క పేదలే కదా..? వారు ప్రశ్నించలేరు కదా..? అంటూ ఎలాంటి సమాచారం లేకుండా ఆక్రమణల తొలగింపు పేరుతో పేదల నివాసాలు కూల్చేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుత స్థిరాస్తి క్రయ విక్రయాల ప్రకారం అక్కడ సెంటు రూ.10 లక్షలకు పైగా పలుకుతుంది. అధికారులు ఖాళీ చేయిస్తున్న 1.20 ఎకరాల భూమి విలువ రూ.12 కోట్లు పైమాటే. ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. 


ఓ ప్రజాప్రతినిధి పాత్రపై ఆరోపణలు

ఆక్రమణల తొలగింపు పేరుతో హడావిడిగా రెవిన్యూ అధికారులు ఖాళీ చేసిన స్థలంలో ఏవైనా ప్రజావసరాల కోసం భవనాలు కడుతున్నారా..? అంటే ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని అధికారులే అంటున్నారు. ప్రభుత్వ భూమిని రక్షించడం మా బాధ్యత.. భవిషత్తులో ఏ శాఖకైనా అవసరం వస్తే కేటాయిస్తామని అంటున్నారు. అత్యవసరంగా ఎలాంటి ఉపయోగం లేనప్పుడు ఉన్నఫలంగా నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడం వెనుక ఆంతర్యమేమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. తెరవెనుక అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి పాత్ర ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తతంగం చల్లబడిన తరువాత రెవిన్యూ శాఖ నుంచి ఈ స్థలాన్ని కార్పొరేషన అవసరాల కోసం కేటాయించేలా చేసి.. ఆ తరువాత లీజు ముసుగులో కాజేయాలనే తెర వెనుక కుట్రలో భాగంగానే ఆక్రమణల తొలగింపు బాగోతానికి తెరతీశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేద, ధనిక అన్న భేదం లేకుండా ఆక్రమణకు గురైందని అధికారులు చెబుతున్న మొత్తం పది ఎకరాల్లో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేసి.. ఖాళీ చేయడానికి కొంత సమయం ఇచ్చి.. తరువాత ఖాళీ చేయించి ఉంటే ఎలాంటి అభ్యంతరాలు ఉండేవి కాదని పలువురు పేర్కొంటున్నారు. 


ప్రభుత్వ భూమి రక్షించాలని ఆక్రమణలు తొలగించాం 

- శివరామిరెడ్డి, తహసీల్దారు, కడప

మృత్యుంజయకుంటలో 11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 10 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైంది. సర్వే నెంబర్లు 187, 311 పరిధిలో 1.20 ఎకరాల్లో ఆక్రమణలు తొలగించాం. ప్రభుత్వ భూమిని కాపాడాలనే ఆక్రమణలు తొలగించాం. ఎలాంటి డీనోటిఫై చేయలేదు. అయితే.. క్రయవిక్రయాలు జరగడంతో సబ్‌ రిజిస్ట్రేషన శాఖ రిజిస్ట్రేషన చేసినట్లు మా దృష్టికి కూడా వచ్చింది. ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు. ప్రస్తుతం ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. ఈ భూమి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. కార్పొరేషన లేదా ఏ ఇతర శాఖలైనా ప్రజావసరాల కోసం కావాలని అడిగితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయిస్తాం. ప్రభుత్వ భూమిని రక్షించాలనే ఆక్రమణలు తొలగించాం తప్ప ఎలాంటి దురుద్దేశ్యం లేదు.

Updated Date - 2021-10-17T06:08:37+05:30 IST