తండాల్లో తీజ్‌ సందడి షురూ!

ABN , First Publish Date - 2021-07-28T04:44:44+05:30 IST

హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాల్లోని గిరిజన తండాల్లో తీజ్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి.

తండాల్లో తీజ్‌ సందడి షురూ!
అక్కన్నపేట మండలం పెద్దతండాలో తీజ్‌ వేడుకలు

హుస్నాబాద్‌, జూలై 26: హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాల్లోని గిరిజన తండాల్లో తీజ్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూలై చివరి వారంలో మొదలైన వేడుకలు ఆగస్టు వరకు జరుగుతాయి. తీజ్‌ గిరిజనులకు అతి ముఖ్యమైన పండుగ. యువతులు తమ కోరికలు నెరవేరాలని తొమ్మిది రోజుల పాటు వేడుకులను జరుపుకుంటారు.  త్వరగా పెళ్లి కావాలని, మంచి వరుడు దొరకాలని, వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని తీజ్‌ వేడుకలు నిర్వహిస్తారు. వర్షాలు పడగానే గ్రామ దేవతలను ప్రతిష్టించుకొని సీత్లా (ఎడ్లు దాటుడు) పండుగ జరుపుకుంటారు. అనంతరం తీజ్‌ వేడుకలను మొదలవుతాయి. లంబాడీల సంస్కృతిలో ఏడుగురు మాతృ దేవతలుంటారు. అందులో మేరామా పెద్దది. ఆమే పంటలను రక్షిస్తుందని గిరిజనుల నమ్మకం. వివాహం కాని ఆడపిల్లలు తొమ్మిది రోజుల పాటు తీజ్‌ వేడుకలను అతి నిష్టగా జరుపుకుంటారు. చివరి రోజు చెరువులో నారును వదిలి వేస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు ఉప్పు, కారం లేని ఆహారాన్ని భుజిస్తారు. 


తీజ్‌ ఇలా పుట్టింది


తీజ్‌ అంటే పచ్చని పంట లేదా నారు అని అర్థం. పూర్వం మహారాష్ట్రలోని పోరియాగడ్‌ ప్రాంతంలో దండి మేరామా ఉండేది. అదే ప్రాంతానికి పశువులను కాస్తూ సేవాలాల్‌ వస్తాడు. అతడి రూపం, గుణగణాలకు మేరామా ఆకర్షితురాలై సేవాలాల్‌ ప్రేమ పొందెందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. తన ప్రేమను చెప్పేందుకు బతుకమ్మ (గోధుమ మొలకలతో కూడిన తీజ్‌) పోసి జెండా కడుతుంది. స్నేహితులతో కలిసి ఆటపాటలతో తన ప్రేమను వ్యక్తపరుచగా, సేవాలాల్‌ తిరస్కరించి వెళ్లిపోతాడు. ఇద్దరు ఎంతో పవిత్రంగా నిలువడంతో సేవాభాయ్‌, దండి మేరామాలను గిరిజనులు దేవుళ్లుగా కొలుస్తారు. 


 

Updated Date - 2021-07-28T04:44:44+05:30 IST