delayed onboarding: జాబ్ ఆఫర్ ఇచ్చి ఇదేం పద్ధతి.. టెక్ కంపెనీలు ఇలా చేస్తున్నాయి ఎందుకో మరి..

ABN , First Publish Date - 2022-09-27T03:42:31+05:30 IST

ఉద్యోగం ఆఫర్ ఇచ్చి సంవత్సరం కావస్తున్నా ఇంకా విధుల్లో చేర్చుకోకపోతే జాబ్ పొందిన వ్యక్తి ఇటు ఆర్థికంగా.. అటు మానసికంగా వేదనకు గురవ్వాల్సిందే.

delayed onboarding: జాబ్ ఆఫర్ ఇచ్చి ఇదేం పద్ధతి.. టెక్ కంపెనీలు ఇలా చేస్తున్నాయి ఎందుకో మరి..

ద్యోగం ఆఫర్ ఇచ్చి సంవత్సరం కావస్తున్నా ఇంకా విధుల్లో చేర్చుకోకపోతే జాబ్ పొందిన వ్యక్తి ఇటు ఆర్థికంగా.. అటు మానసికంగా వేదనకు గురవ్వాల్సి ఉంటుంది. ఒకవైపు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించక, మరోవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించక.. ఎవరికీ చెప్పుకోలేని బాధ అనుభవించాల్సి ఉంటుంది. అచ్చంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు పలువురు టెకీలు(Techies). దేశీయ ఐటీ దిగ్గజాలైన విప్రో(Wipro), ఇన్ఫోసిస్(Infosys), హెచ్‌సీఎల్ టెక్(Hcl tech), టెక్ మహింద్రా(tech mahindra)తోపాటు క్యాప్‌జెమినీ (capgemini) వంటి కంపెనీల నుంచి జాబ్ ఆఫర్లు (job offers) పొందినా..  ఇంతవరకు తమను ఉద్యోగాల్లో చేర్చుకోలేదని పలువురు టెకీలు వాపోతున్నారు. గతేడాది 3 టెక్ కంపెనీలు జాబ్ ఆఫర్లు ఇచ్చినా ఇంకా తనను విధుల్లోకి తీసుకోకపోవడంతో ఓ టెకీ ఆర్థికంగా, మానసికంగా  ఒత్తిడికి గురవుతున్నాడని బిజినెస్ టుడే (business today) ఒక రిపోర్ట్‌ని ప్రచురించింది. ‘‘ ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్‌జెమినీ కంపెనీల నుంచి గతేడాది సెప్టెంబర్ 2021లో జాబ్ ఆఫర్ పొందాను. ఏడాది గడిచిపోయింది. కానీ ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. మా నాన్న రోజు కూలీ. మూడు మల్టీనేషనల్ కంపెనీల నుంచి జాబ్ ఆఫర్లు వచ్చినా కుటుంబం కోసం ఇంకా సంపాదించలేకపోతున్నాను. నా జీవితంలో ఒక సంవత్సరమంతా వృథాగా పోయింది’’ అని సంబంధిత టెకీ బాధపడుతున్నట్టు బిజినెస్ టుడే తెలిపింది.


ఎడ్యుకేషన్ లోన్లు చెల్లించలేక ఇబ్బందులు..

కాగా ఇలాంటి పరిస్థితి ఆ ఒక్క వ్యక్తికే పరిమితం కాలేదు. పలువురు టెకీలు ఈ పరిస్థితులు  ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. వాళ్లలో కొందరు ఎడ్యుకేషన్ లోన్లు చెల్లించాల్సి ఉన్నా అనూహ్య పరిస్థితుల వల్ల నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. మరో వ్యక్తి స్పందిస్తూ.. ‘‘ ఈ  ఏడాది ఏప్రిల్ 22న  ఇన్ఫోసిస్‌లో సిస్టమ్స్ ఇంజనీర్‌గా నాకు ఉద్యోగం వచ్చినప్పుడు మా కుటుంబం చాలా సంతోషపడింది. ఎడ్యుకేషన్‌ లోన్‌ని తిరిగి చెల్లించొచ్చని భావించాను. కానీ ఇప్పటికి 6 నెలలు గడిచినా జాయింగ్ తేదీని ఇంకా వాయిదా వేస్తూనే ఉన్నారు’’ అని పేర్కొన్నాడు. వాయిదా పడుతుండడం కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇన్ఫోసిస్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లానని, బిజినెస్ అవసరాలను బట్టి ఉద్యోగుల జాయినింగ్ తేదీ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. జాయింట్ తేదీకి సంబంధించి 2-3 వారాల్లో సంప్రదిస్తామని సమాధానమిచ్చారని సంబంధిత టెకీ తన బాధను తెలియజేశాడు.


ఈ జాబితాలో మరిన్ని కంపెనీలు..

ఆఫర్లు ఇచ్చి ఇంకా విధుల్లోకి తీసుకోవడంలేదని విమర్శలు ఎదుర్కొంటున్న కంపెనీల జాబితాలో టెక్ మహింద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలు కూడా ఉన్నాయి. హెచ్‌సీఎల్ తనకు జాబ్ ఆఫర్ ఇచ్చి ఏడాది గడిచినా ఇంకా తమ బ్యాచ్‌ని విధుల్లోకి తీసుకోలేదని ఓ టెకీ చెప్పాడు. తమ సందేహాలకు సమాధానం కూడా ఇవ్వడంలేదని పేర్కొన్నాడు. అయితే ఈ అంశంపై హెచ్‌సీఎల్ టెక్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ఫ్రెషర్స్ విషయంలో ఎలాంటి వాయిదా లేదని, కాలపరిమితికి అనుగుణంగా విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2022-09-27T03:42:31+05:30 IST