Oracle Lays off Employees : ఒరాకిల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. పెద్ద సంఖ్యలో ఎంప్లాయిస్‌కు ఉద్వాసన

ABN , First Publish Date - 2022-08-03T22:01:23+05:30 IST

టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అనలిస్ట్ రిలేషన్స్ నుంచి రిక్రూట్‌మెంట్ విభాగం వరకు వేర్వేరు స్థానాల్లో పనిచేసే ఉద్యోగులను పక్కనపెట్టింది.

Oracle Lays off Employees : ఒరాకిల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. పెద్ద సంఖ్యలో ఎంప్లాయిస్‌కు ఉద్వాసన

టెక్సస్ : టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) అమెరికా(USA)లో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల(Employees)కు ఉద్వాసన (Lays off) పలికింది. అనలిస్ట్ రిలేషన్స్ నుంచి రిక్రూట్‌మెంట్ విభాగం వరకు వేర్వేరు స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పక్కనపెట్టింది. తొలగింపు వేటుకు గురైనవారిలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నవారినుంచి కొత్త ఉద్యోగులు కూడా ఉన్నారు. అన్నీ టీమ్‌లు, వేర్వేరు స్థానాల్లో పనిచేస్తున్న ఎంప్లాయిలను తొలగించింది. సీఎక్స్(కస్టమర్ ఎక్స్‌పీరియన్స్) ప్రీసేల్స్, మార్కెటింగ్ టీమ్‌లకు చెందిన ఇంజనీర్లపై వేటు వేసింది. ఒక్కో టీమ్ నుంచి 7 - 10 మందిని పక్కనపెట్టినట్టు టెక్ న్యూస్ వెబ్‌సైట్ ‘ది రిజిస్టర్’ వెల్లడించింది. సీఎక్స్ కామర్స్ టీమ్‌కు చెందిన ఎంప్లాయిస్‌ను కూడా పెద్ద సంఖ్యలో తొలగించినట్టు పేర్కొంది. కాగా ఒరాకిల్ కంపెనీ ప్రధాన కార్యాలయం టెక్సస్‌లోని ఆస్టిన్‌లో ఉంది. కంపెనీ వ్యయాలను 1 బిలియన్ డాలర్ల వరకు తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యకు ఉపక్రమించినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. 


ఉద్యోగం కోసం చూస్తున్నాం..

కాగా ఒరాకిల్ తొలగింపు నేపథ్యంలో అనేక మంది ఉద్యోగులు తాము అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు ‘లింక్డిన్’లో తమ స్టేటస్‌ను మార్చుకున్నారు. ఒరాకిల్ భారతీయ ఉద్యోగుల్లో కూడా చాలా మంది తాము ఉద్యోగాలు కోల్పోయామని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పలువురు పోస్టులు పెట్టారు. హైదరాబాద్ ‘ఒరాకిల్ ’ సెంటర్‌లో ప్రన్సిపల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం కోల్పోయిన వంశీ కృష్ణ స్పందించాడు. ఒరాకిల్ సంస్థాగత మార్పుల కారణంగా దురదృష్టవశాత్తూ ఉద్యోగాన్ని కోల్పోయానని పేర్కొన్నాడు. గత ఆరేళ్లలో ఎన్నో నేర్చుకోగలిగానని, సహచరులు, మేనేజర్లు, కస్టమర్లతో చక్కటి బంధాలను కొనసాగించానని ఆవేదన వ్యక్తం చేశాడు.


కాగా అమెరికా వెలుపల ఒరాకిల్‌కు భారత్ అతిపెద్ద డెలివరీ సెంటర్‌గా ఉంది. ఇక్కడ 40 వేలకుపైగా మంది ఉద్యోగులు ఉన్నారు. ఇండియాతోపాటు కెనడాలో కూడా రానున్న వారాల వ్యవధిలోనే ఉద్యోగులను తొలగించే అవకాశాలున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా బ్లూమ్‌బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. హెల్త్‌కేర్ రంగంపై ఒరాకిల్  దృష్టిసారించింది. ఈ మేరకు క్లౌడ్ టెక్నాలజీపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. క్లౌడ్ డేటా బేస్ ఇండస్ట్రీలో భారీగా పాగా వేయడమే లక్ష్యంగా కంపెనీలు అడుగులు వేస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇటివల 28 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందంతో మెడికల్ రిపోర్ట్‌లు అందించే ‘ సెర్నర్ కార్ప్’ అనే కంపెనీని సొంతం చేసుకుంది.

Updated Date - 2022-08-03T22:01:23+05:30 IST