Imran Khan: విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఇమ్రాన్ ఖాన్!

ABN , First Publish Date - 2022-09-12T01:33:35+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) ఇమ్రాన్ ఖాన్ శనివారం విమాన ప్రమాదం నుంచి

Imran Khan: విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఇమ్రాన్ ఖాన్!

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) ఇమ్రాన్ ఖాన్(Imran Khan) శనివారం విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లే ఆయన విమానం ఇస్లామాబాద్‌కు తిరిగి వచ్చినట్టు పీటీఐ నేత అజార్ మష్వాని తెలిపారు.


పంజాబ్‌లోని గుజ్రాన్‌వాలలో ఓ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ నుంచి బయలుదేరారు. విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించి తిరిగి ఇస్లామాబాద్‌లో ల్యాండ్ చేశారు. దీంతో ఇమ్రాన్ విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారన్న వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ వార్తలను పీటీఐ నేత అజార్ కొట్టిపడేశారు.


విమానంలో సాంకేతిక లోపం వార్తలు వాస్తవం కాదన్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లే విమానం వెనక్కి వచ్చినట్టు చెప్పారు. ఆ తర్వాత ఇమ్రాన్ రోడ్డు మార్గంలో గుజ్రాన్‌వాలా చేరుకున్నారని వివరించారు. కాగా, ఈ నెల మొదట్లో ఇమ్రాన్ సెక్యూరిటీ కాన్వాయ్‌లోని ఓ వాహనం అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన నుంచి కూడా ఇమ్రాన్ సురక్షితంగా బయటపడ్డారు.

Updated Date - 2022-09-12T01:33:35+05:30 IST